నాలుగు సార్లు వాయిదా పడిన రాజ్యసభ
న్యూఢిల్లీ : బీమా సవరణ బిల్లు ను పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపాలన్న డిమాండ్‌తో విపక్షాల ఆందోళన నేపథ్యంలో గురువారం రాజ్యసభ నాలుగు సార్లు స్వల్ప విరామంతో వాయిదా పడింది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రస్తుత 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతూ బిల్లుకు సవరణ తీసుకు వచ్చారు. యాజమాన్యంపై ఆంక్షలు తొలగించారు. బీమా కంపెనీలపై నియంత్రణ కల్పించారు. దీనివల్ల విదేశీ సంస్థలకు భారత్‌లోని బీమా సంస్థలను సొంతం చేసుకోడానికి, నియంత్రించడానికి అవకాశం కలుగుతుంది. గురువారం మధ్యాహ్నం ఆర్థిక మంత్రి సీతారామన్ ఈ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. 1938 నాటి బీమా చట్టం సవరణకు అనుమతించాలని రాజ్యసభను కోరారు. దీనిపై రాజ్యసభ లోని విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఈ బిల్లు ప్రజలకు కష్టాలు తెస్తుందని, బీమా చట్టం ఇప్పటికి సవరణ జరగడం ఇది మూడోసారి అని, ఇందులోని లోపాలను సవరించడానికి పార్లమెంట్ స్థాయి సంఘానికి పరిశీలన కోసం పంపాలని కోరారు. ఈ సందర్భంగా విపక్షాలు నినాదాలతో, సభ మధ్య లోకి దూసుకు వెళ్లడంతో సభను నాలుగు సార్లు వాయిదా వేశారు.