జనగామ ప్రతినిధి : నిత్యం ప్రజాసేవే జీవితంగా బ్రతుకుతున్న తనను రాజకీయంగా అడ్డుకోవాలని ప్రతిపక్ష పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని, అందుకు అమాయకురాలైన తన కూతురిని మాయమాటలు చెప్పి తనపై కేసులు పెట్టించి రాజకీయంగా అణిచివేయాలని చూస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌లో టెస్టుల అప్‌డేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తన కూతురుపై, అల్లుడిపై తనపై కేసు పెట్టి హైకోర్టును ఆశ్రయించడం పట్ల స్పందిస్తూ అభంశుభం తెలియని తన కూతురు ప్రతిపక్షాల కుట్రపూరిత మాయలో పడి తనపై కేసులు పెట్టేవరకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రజల ఆశీర్వాదం ఉందని, ఎవరెన్ని కుట్రలు పన్నినా జనగామ నియోజకవర్గానికి తాను చేసిన పనులే తనను ప్రజల హృదయాల్లో నిలుపుతుందన్నారు.
ఎవరెన్నీ కుట్రలు పన్నినా తనపై కక్షపూరితంగా చేస్తున్న పనులను ప్రజలు గమనిస్తున్నారని, వారికి తనపై అపారమైన సానుభూతి పెరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం తాను గెలిచి తీరుతానని, జనగామ నియోజకవర్గాన్ని ఇంతకు పదింతలు అభివృద్ధి చేసి అభివృద్ధిలో ప్రథమస్థానంలో నిలుపుతానని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.