గతవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలతో దళితులను కూడా నిరాశ పరిచింది. గత పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అనుసరించి దళిత వ్యతిరేక వైఖరిని మరొకసారి రుజువు చేసుకున్నది. పైగా దళితులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఇప్పటికీ ఎస్‌సిలకు ప్రత్యేక శాఖ లేదు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలోనే ఎస్‌సిల కోసం కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు. ఇవి కూడా గతంలో ఉన్నవే. ప్రస్తుతం ఉన్న మంతిత్వ శాఖలోనే బిసిలకు కూడా పథకాలు ఉన్నాయి. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు అందరికీ ఇదే శాఖ అంటే ఎస్‌సి, బిసిలు కలిపితే దాదాపు 70 శాతం జనాభా. అంటే 70 శాతం జనాభాకు కలిపి ఒకే మంత్రిత్వశాఖ. ఇది చాలు ఈ ప్రభుత్వానికి ఎస్‌సిలు, బిసిలు అంటే ఎంతటి శ్రద్ధ ఉందో అర్ధం కావడానికి.
భారతీయ జనతా పార్టీ హిందువుల పక్షాన నిలబడే పక్షంగా పెద్ద పేరున్నది. అయితే ఈ రోజు హిందూ సాంప్రదాయాలను రక్షిస్తున్నది, వాటిని కొనసాగిస్తున్నది మెజారిటీగా వెనుకబడిన కులాలే. కానీ వారికి నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎంతమాత్రం అనుకూలంగా లేవు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఇటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి.
బడ్జెట్‌లో ప్రభుత్వం చూపుతున్న లెక్కలు కేవలం స్కాలర్ షిప్‌లు, అక్కడక్కడ కొన్ని హాస్టల్స్ నిర్మాణంలో ఉన్నాయి. అయితే పరిస్థితి దీనికి భిన్నంగా ఉన్నది. రోజుకు రోజుకు ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు మారిపోతున్నాయి. ముఖ్యంగా తరతరాలుగా అంటరానితనం, వివక్ష, వెలివేత, హత్యలు, అత్యాచారాల లాంటి దుర్మార్గాలకు బలైపోతున్న దళితుల జీవితాలు మరింత దిగజారిపోతున్నాయి.
మొదటిగా చెప్పుకోవాల్సింది హత్యలు, అత్యాచారాలు. ఇవి ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ అరాచాకాలు పెచ్చుమీరుతున్నాయి. అయితే ప్రభుత్వానికి ఇవేవి కనపడటం లేదా? ఇవేవి జరగనట్టుగానే వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వాలు కనీసం ఎస్‌సి, ఎస్‌టిల కోసం ఎకనామిక్ సర్వేలో గానీ, బడ్జెట్‌లలో గానీ ప్రస్తావించే తమ ప్రతిపాదనలను ప్రస్తావించేవారు. అయితే నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన తర్వాత ఆ పదాలే ఎకనామిక్ సర్వేలో కనిపించడం లేదు.
పైగా బడ్జెట్‌లో కూడా తమ ప్రాధాన్యతలలో ఆ పేర్లు లేవు. మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రకటించారు. పేదలు, మహిళలు, యువత, రైతులు అప్రాధాన్యతలు, దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, ఈ దేశంలో కులం లేదని, కులరహిత సమాజంలో ఉన్నమనే భావనను కల్పిస్తున్నారు. అయితే నిజం కాదనే విషయం అందరికీ తెలుసు. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఎస్‌సి, ఎస్‌టిల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తే కుల అసమానతలు ఉన్నయని ఒప్పుకోవాలి. అది ఒప్పకుంటే ఆ సమస్య పరిష్కారం కోసం పథకాలు రచించాలి. ఇది వారికి ఇష్టం లేదు. అందరూ హిందువులే అనేది వారి అవగాహన.
అయితే ఈ విధానం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈ దేశంలో కుల సమాజం ఉనికిని, దాని అస్తిత్వాన్ని, దాని ప్రభావాన్ని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు. అందువలననే వాళ్ళు కొన్నిప్రత్యేకమైన నిబంధనలను, హక్కులను కల్పించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 16, 17, 20, 21 ప్రాథమిక హక్కులతోపాటు, ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్స్ 38, 46 లను కుల అసమానతలకు పరిష్కారంగా భావించి పొందుపరిచారు. ముఖ్యంగా ఆర్టికల్ 46 ప్రకారం, ఈ దేశంలోని అణగారిన వర్గాలు, పేదలు ప్రత్యేకించి ఎస్‌సి, ఎస్‌టిల విద్యా, ఆర్థిక ప్రగతికి, సాధికారతకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ రాజ్యాంగంలోని హక్కులు, నిబంధనలు ఈ ప్రభుత్వానికి ఎంతమాత్రం దృష్టిలో లేవు. అదే విధంగా రాజ్యాంగం పరిపూర్ణంగా రూపొంది, రాజ్యాంగ సభకు సమర్పించిన రోజు నవంబర్ 20, 1949న డా॥ బి.ఆర్. అంబేద్కర్ చేసిన ప్రసంగం కూడా వీరి చెవికి ఎక్కడం లేదు. “మనం రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. 1950 జనవరి, 26న అది అమలులోకి రాబోతున్నది. అయితే అప్పటి నుంచి మనం వైరుధ్య భరితమైన జీవితాలలోకి అడుగు పెడుతున్నాం. ఒక మనిషి ఒక ఓటు, ఒక ఓటు ఒక విలువ ద్వారా మన రాజకీయ సమానత్వంలోకి వెళ్తున్నాం. కానీ ఇంకా సామాజిక ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నాయి. వీటిని సత్వరమే పరిష్కారం చేసుకోవాలి. లేదంటే మనం అత్యంత శ్రమతో నిర్మించుకున్న ప్రజాస్వామ్య సౌధం కుప్పకూలిపోగలదు.”
ఈ మాటలు మన పాలకులకు చెవికెక్కలేదు. కానీ అంబేద్కర్ జయంతి, వర్ధంతి సమయాలలో మాత్రం నివాళి అర్పించడానికి సిద్ధమవుతారు. ఇది కేవలం కొంగ జపం లాంటిదే మరొకటి కాదు. దళితులకు మిగతా ఇతర సమాజానికి మధ్య ఆర్థిక, సామాజిక అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్షరాస్యత లాంటి చాలా చిన్న విషయాలల్లో ఈ అంతరాన్ని చూడవచ్చు. మొత్తం జనాభా అక్షరాస్యత 2020 లెక్కల ప్రకారం 80 శాతం ఉండగా, దళితుల్లో ఇది 73 శాతంగా ఉన్నది. ఉన్నత విద్యలో ఈ తేడా చాలా ఎక్కువగా ఉంది. అదే విధంగా ఉద్యోగాల కల్పనలో ఆ తేడా కొనసాగుతున్నది. నిరుద్యోగ రేటు సాధారణ జనాభాలో 6.7 శాతం ఉండగా, అది ఎస్‌సిలల్లో 8.3 శాతంగా ఉంది. తలసరి ఆదాయం 2011 లెక్కల ప్రకారం ఎస్‌సిలలో 47,124 రూపాయలుండగా, సాధారణ జనాభాలో 74 వేల రూపాయలున్నాయి.
అదే విధంగా ప్రముఖ ఆర్థిక శాస్త్ర పరిశోధకులు నితిన్ కుమార్ బర్తి అధ్యయనం ప్రకారం, ఎస్‌సిల సరాసరి వార్షికాదాయం 89 వేలు ఉండాగా, ఎస్‌సిలలో 75 వేలు ఉన్నాయి. అయితే వెనుకబడిన కులాల్లో ఒక లక్షా నలభై వేలు ఉండగా, ఆధిపత్య కులాల్లో ఒక లక్షా ఆరు వేల మేరకు ఉండడం గమనించాలి. అదే విధంగా ఖర్చులో కూడా ఎస్‌సిలు 87 వేలు, ఎస్‌టిలు 72 వేలు, ఒబిసిలు లక్షా 8 వేలు, ఆధిపత్య కులాలు లక్షా 46 వేలు ఉన్నాయి. ఆధిపత్య కులాలకు ఎస్‌సి, ఎస్‌టిలకు మధ్య ఉన్న వ్యత్యాసం దాదాపు రెట్టింపు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇంకా భూమి హక్కులు, అధికారం కానీ ఇంతకన్నా మెరుగ్గా ఏమీలేరు.
వీటన్నింటికి తోడు ఇటీవల సాంకేతిక యాంత్రిక రంగాల్లో వస్తున్న మార్పులు ఎస్‌సి, ఎస్‌టి, బిసిలలోని కొన్ని వర్గాలను మరింత హీనస్థితికి నెడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయి, పారిశ్రామిక, గృహ నిర్మాణ రంగాల్లో వచ్చిన మార్పులు నూటికి 80 శాతం మందిని పనికి దూరం చేశాయి. అదే విధంగా సాధారణ డిగ్రీలు అంటే ఎటువంటి సాంకేతిక నైపుణ్యం, వృత్తి నైపుణ్యం లేని విద్యను పొందిన వాళ్ళు అటు శారీరక శ్రమ చేయలేక, ఇటు శాస్త్ర సాంకేతికి రంగాల్లో ప్రవేశించలేక దుర్భరమైన నిరుద్యోగాన్ని అనుభవిస్తున్నారు. కొన్ని పదుల కోట్ల నిరుద్యోగ యువత ఈ రోజు దేశంలో జీవచ్ఛవాలుగా జీవనం సాగిస్తున్నారు.
పైన పేర్కొన్న అంశాలేవి కూడా బడ్జెట్‌లో ప్రస్తావనకు నోచుకోలేదు. నైపుణ్యాభివృద్ధి కోసం కేటాయింపులు ఉన్నప్పటికీ, దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండాపోతున్నది. ఎందుకంటే, ఈ నైపుణ్యాభివృద్ధి పథకం ఒక పెద్ద కుంభకోణం. కొంత మంది రాజకీయ అండదండలున్న కొన్ని సంస్థలకు ఇది ఒక కల్పవృక్షం. కేంద్ర ప్రభుత్వ భాషలో చెప్పాలంటే అమృతోత్సవాల సందర్భంగా ఇది ఒక అమృతబాండం. ఈ అసమానతలు ఇలాగే కొనసాగితే, దేశంలో మరిన్ని ఆందోళనలకు, అశాంతికి తెరదీయక తప్పదు.
మల్లేపల్లి లక్ష్మయ్య