Monday, April 7, 2025

కులాల లెక్కలు.. బిజెపికి చిక్కులు

- Advertisement -
- Advertisement -

కులాల వారీగా జనాభా లెక్కలను సేకరించాలని కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా చెవిటివాని ముందు శంఖంలా ఉంటోంది. మంగళవారం (ఏప్రిల్ 1) కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్షనాయకుడు మల్లికార్జున ఖర్గే ఈ అంశంపై సవివరంగా ప్రస్తావించారు. కులాల వారీగా జనగణన ఆలస్యం కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. యుద్ధాలు, అత్యవసర పరిస్థితులు, ఇతర సంక్షోభాల సమయంలో కూడా జనాభా లెక్కల సేకరణ జరిగిందని, కానీ చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వం రికార్డు స్థాయి లో జనగణన నిర్వహించడంలో జాప్యం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

దీన్ని నిర్వహించడానికి ప్రభుత్వం ఇష్టపడటం లేదని స్పష్టమవుతోందని విమర్శించారు. ఖర్గే చెప్పిన వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి కులాల ప్రాతిపదికపై జనాభా గణనపై విముఖత ఉన్నట్టు తెలుస్తోంది. కులాల ప్రాతిపదికగా జనాభా లెక్కలను సేకరించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో సుప్రీం కోర్టు ముందు చేతులెత్తేసింది. అప్పటినుంచి ఈ సమస్య కొన్నేళ్లపాటు వాయిదా పడుతోంది. 1881 నుంచి దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఓసారి జనాభా లెక్కలను సేకరించడం పరిపాటిగా వస్తోంది. 1931 జనాభా లెక్కలకు ముందు మహాత్మాగాంధీ జనాభా లెక్కలు దేశానికి ఎంత ముఖ్యమో ఆయన గుర్తు చేశారు. మన ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి మనకు కాలానుగుణంగా వైద్య పరీక్షలు ఎంత అవసరమో జనాభా లెక్కలు కూడా అంతే అవసరంగా గాంధీజీ ఉదహరించడం ఇక్కడ గమనించాలి.

అయితే కులాల వారీ జనాభా లెక్కలు మాత్రం బ్రిటిష్ వారి పాలనలోనే దేశం లో 1933లో చివరిసారి జరిగింది. అప్పటి నుంచి ఆగిపోయిన ఈ ప్రక్రియను తిరిగి చేపట్టాలన్న డిమాండ్ చిరకాలంగా వెనుకబడిన తరగతుల నుంచి వస్తోంది. 1933 నాటి కులాల వారీ సేకరణ ఆధారంగానే ఒబిసిలు దేశ జనాభాలో 36 శాతం మాత్రమే ఉంటారని ఒక వర్గం, 60 నుంచి 70 శాతం వరకు ఉంటారని మరోవర్గం ఎవరికి తోచిన విధంగా వారు వాదన లేవదీయడమే తప్ప కచ్చితమైన వివరాలు ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే దేశ జనాభాలో వెనుకబడిన తరగతులు అధిక సంఖ్యలోనే ఉంటారని ఎక్కువ శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు కేవలం 27 శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించడం న్యాయం కాదని వెనుకబడిన తరగతుల ఆవేదన అరణ్య రోదనగా ఉంటోంది.

విపి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 1990లో ఒబిసిలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% కోటా కల్పించారు. అప్పటినుంచి తమ జనసంఖ్య ఎంతో తేల్చి ఆ మేరకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఆ వర్గాలనుంచి బయలుదేరింది. 2001లోను, 2011లోను జనాభా లెక్కలతోపాటు కులాల వారీ లెక్కలు సేకరించాలన్న ఆలోచన అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అయితే యుపిఎ ప్రభుత్వం 2011 జనాభా లెక్కల సేకరణలో వేర్వేరుగా సామాజిక, ఆర్థిక కులగణన పేరుతో కొంత సమాచారాన్ని సేకరించింది. ఈ సమాచారం తమకు అందజేస్తే జిల్లా పరిషత్తులు, పంచాయతీ సమితుల చట్టం కింద ఒబిసిలకు 27% రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలవుతుందని 2021లో మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది.

ఆ మేరకు సుప్రీం కోర్టులో కూడా వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. అయినా కేంద్రం చలించలేదు. ఆ సమాచారం తప్పుల తడకగా ఉందని, దానివల్ల ఎలాంటి ప్రయోజనం కలగదని కేంద్రం సాకులు చెప్పి తప్పించుకుంది. 2021 జనాభా లెక్కల సేకరణలో భాగంగా కులాల వారీ లెక్కలు సేకరించడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా కుల ప్రాతిపదికన జనగణన చేపట్టాలని నాలుగేళ్ల క్రితం ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసినా ఫలించలేదు. ప్రతి పదేళ్లకు ఓసారి చేపట్టే జనాభా లెక్కల సేకరణలో ఎస్‌సి, ఎస్‌టిల జనగణన సాధ్యమవుతున్నప్పుడు ఇతర వెనుకబడిన తరగతుల వివరాలు సేకరించడం ఎందుకు కష్టమవుతుందని కాంగ్రెస్‌తో సహా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా గతంలో విపి సింగ్ ప్రభుత్వం ఒబిసిలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు దానికి వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోనే హింసాత్మక ఆందోళనలు చెలరేగడం మరిచిపోలేని వాస్తవం. కులాల గణన పేరు చెబితే కాషాయ నాథులకు కంపరం పుట్టుకొస్తోంది. దీనికి కారణం కులాల శాతాలు బయటపడితే అగ్రవర్ణాలకు దూరం కావలసి వస్తుందని వారి భయం. బిజెపి మొదటి నుంచి హిందుత్వ భావజాలంతో అగ్రవర్ణాలను అక్కునచేర్చుకుని వారిని ఓటు బ్యాంకుగా కొల్లగొడుతోంది. జనాభాలో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలు, మైనారిటీలు దాదాపు 80% వరకు ఉన్నారు. వీరంతా పేదరికంలోనే మగ్గుతున్నారు. మిగిలిన 20% అగ్రవర్ణాలు. అగ్రవర్ణాలదే అన్నిటిలో పైచేయిగా ఉంటోంది.

దేశ సంపద అంతా అగ్రవర్ణాల అనుభవంలోనే ఉందన్న వాస్తవం గణాంకాలతో బయటపడితే తమ ఉనికికే ముప్పు తప్పదన్న పిరికితనం కమలనాథులను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కులాల గణనకు ముందుకు రాకుండా ఏవో సాకులతో విపరీత కాలయాపన చేస్తోందన్న విమర్శలు కాంగ్రెస్ తదితర విపక్షాల నుంచి వస్తున్నాయి. అంతేకాదు ఈ సంవత్సరం బడ్జెట్‌లో జనాభా గణన కోసం రూ. 575 కోట్లు మాత్రమే కేటాయించడం బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వానికి కులాల వారీ జనాభా లెక్కల సేకరణ బొత్తిగా ఇష్టం లేదనిపిస్తోందని రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యల్లో యదార్థం లేకపోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News