న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద కిసాన్ సంసద్ నిర్వహిస్తున్న రైతులకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఏడుగురు నాయకులు శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. మూడు నల్ల చట్టాలను కేంద్రం ఉపసంహరించాలని ఈ సందర్భంగా వారు డిమాండు చేశారు. పార్లమెంట్ హౌస్ వద్ద సమావేశమైన 14 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు అనంతరం జంతర్ మంతర్‌కు చేరుకుని కిసాన్ సంసద్‌లో పాల్గొన్నారు. వీరంతా కిసాన్ సంసద్‌లో మాట్లాడటం కాని వేదికపైన కూర్చోవడం కాని చేయకుండా ఆందోళన నిర్వహిస్తున్న రైతుల పక్కన కూర్చోవడం విశేషం. రైతులకు సంఘీభావం ప్రకటించి మూడు నల్ల చట్టాలను ఉపసంహరించాలన్న రైతుల డిమాండ్‌కు మద్దతు నిలవాలని తామంతా నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీ విలేకరులకు తెలిపారు. దేశంలోని రైతులందరికీ మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. వ్యవసాయ చట్టాలపై రైతులతో మాట్లాడేందుకు తాము సిద్ధమంటూ ప్రభుత్వం చేస్తున్న వాదనలో అర్థం లేదని, అది జరిగే పని కాదని ఆయన అన్నారు. పార్లమెంట్‌లో ఏం జరుగుతోందో యావద్దేశం చూస్తోందని, పెగాసస్ వ్యవహారం గురించి తాము చర్చించాలని తాము డిమాండు చేస్తుంటే ప్రభుత్వం అందుకు అనుమతించడం లేదని ఆయన తెలిపారు.
Opposition joins farmers for Kisan Sansad