Monday, January 20, 2025

ఒకే వేదిక పైకి కాంగ్రెస్, ఎస్‌పి, టిఎంసి నేతలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రతిపక్ష నేతల భేటీ ఈ నెల 23 న పాట్నాలో జరుగుతుంది. చిరకాల ప్రత్యర్థులు ఈ వేదికపై ఒకచోట కలువనున్నారు. ఈ నెల 12న ముందుగా ఈ భేటీకి ఏర్పాట్లు జరిగాయి. అయితే కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ తేది తమకు అనువుగా లేదని తెలియచేయడంతో దీనిని 23వ తేదీకి వాయిదా వేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు బిజెపికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత సాధన దిశలో ఈ కీలక భేటీకి రంగం సిద్ధం అయింది. దీనికి కాంగ్రెస్ తరఫున పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు హాజరవుతారు. కాంగ్రెస్ చిరకాల ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న సమాజ్‌వాది పార్టీ తరఫున అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఈ భేటీకి హాజరు అవుతామని తెలిపారు.

కాంగ్రెస్ తమ పార్టీల ప్రయోజనాలకు విఘాతకారి అని తరచూ ఇంతకాలం చెపుతూ వచ్చిన ఈ ప్రధాన పార్టీల నేతలు భేటీకి హాజరుకానుండటం కీలకం అయింది. ఇక ఇదే వేదికపై వామపక్ష కూటమి నేతలు కూడా కొందరు హాజరవుతున్నారు. బెంగాల్‌లో మమతకు వామపక్షాలకు పడని తీరు తెలిసిందే. సమావేశానికి తమిళనాడు సిఎం, డిఎంకె నేత స్టాలిన్, జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్, ఉద్ధవ్ థాకరే వస్తారని జెడియూ జాతీయ అధ్యక్షులు రాజీవ్ రంజన్ విలేకరులకు తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి పట్టువిడుపులు అవసరం అని, ప్రాంతీయ పార్టీలను ఇతర బలీయ పార్టీలను కాంగ్రెస్ గౌరవించడం జరిగితే విపక్ష ఐక్యత ఫలప్రదం అవుతుందని మమత బెనర్జీ, థాకరే తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్‌ను ప్రధానిగా పేర్కొనడం వల్ల విపక్ష ఐక్యత ముందుకు సాగుతుందని ఇటీవలే సామ్నా సంపాదకీయంలో రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News