Monday, December 23, 2024

ఈశాన్య రాష్ట్రంలో తెగల మధ్య ఘర్షణలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లోక్‌సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగం విపక్షాల వాకౌట్ల నడుమ సాగింది. తాము మణిపూర్ విషయంపై ప్రధాని స్పందనను కోరామని, అయితే ఆయన తమ ప్రసంగంలో తొలి 90 నిమిషాలలో ఈ విషయం దాటేసి, ఇతర విషయాలు ప్రస్తావించారని ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. మణిపూర్ మణిపూర్ అంటూ ప్రధాని ప్రసంగ దశలో విపక్షాలు అడ్డుతగిలాయి. ఈశాన్య రాష్ట్రంలో తెగల మధ్య ఘర్షణలు జాతిని కలవరపరుస్తున్నాయని ముందు దీనిని ఆయన ప్రస్తావించాల్సి ఉందని ప్రతిపక్ష సంఘటిత వేదిక అయిన ఇండియా కూటమి తెలిపింది. ఎంతకూ ప్రధాని మణిపూర్ గురించి ప్రస్తావించలేదని, దీనితో తాము సభ నుంచి వాకౌట్ జరుపుతున్నామని పేర్కొంటూ సభ నుంచి విపక్షాలు వెళ్లాయి. వీరితో పాటు బిఆర్‌ఎస్, శిరోమణి అకాలీదళ్ సభ్యులు కూడా బయటకు వెళ్లారు. తరువాత రెండు గంటల పాటు సాగిన తమ ప్రసంగంలో ప్రధాని మోడీ మణిపూర్ పరిస్థితిపై మాట్లాడారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అక్కడ శాంతి స్థాపనకు అన్ని విధాలుగా యత్నిస్తున్నాయని వివరించారు. ప్రతిపక్షాలకు వినే ఓపిక తీరికా లేదని, మధ్యలోనే సభ నుంచి వాకౌట్ జరిపాయని ప్రధాని మోడీ వారిపై విరుచుకుపడ్డారు. వాకౌట్ తరువాత కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ విలేకరులతో మాట్లాడారు. మణిపూర్‌పై మాట్లాడమంటే ఆయన కనీసం ముప్పావుగంట పాటు మణిపూర్ మాటే ఎత్తలేదని విమర్శించారు. సభలో ప్రధాని చేసింది కేవలం రాజకీయ ప్రసంగంగా ఉందన్నారు. ఆయన కాంగ్రెస్‌పై మునుపటి విమర్శలకే దిగారు. ప్రతిపక్షాలను అవహేళన చేశారని, అయితే ప్రతిపక్షాలు ఎందుకు ఈ అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చాయో, ఆ అంశాన్ని గాలికొదిలేశారని తెలిపారు. అవిశ్వాసం తీసుకువచ్చిన కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ స్పందిస్తూ ఈ తీర్మానంలో రెండు అంశాలు ఉన్నాయని, ఒక్కటి మణిపూర్ ప్రజలకు న్యాయం జరగాలి. రెండు ముందుగా మణిపూర్ పరిస్థితిపై ఆయన మాట్లాడాలనేదే తీర్మానం ఆలోచన అన్నారు. మొత్తానికి సభను ఉద్ధేశించి ఇంతకాలానికి ప్రధాని మోడీ ఇన్ని గంటలు మాట్లాడేలా చేశామని , దీనితో అయినా ఆయన మౌనభంగం అయిందని తెలిపారు.

అయితే మణిపూర్‌కు సరైన న్యాయం దిశలో ఆయన నుంచి ఎటువంటి ఉలూకుపలుకూ లేకుండా పోయిందని గొగోయ్ చెప్పారు. ప్రధాని మోడీ నిజానికి తన బాధ్యతల నుంచి పారిపోయినట్లు, విధి నిర్వహణల నుంచి ఆయన వాకౌట్ చేసినట్లు విమర్శించారు. మణిపూర్‌కు న్యాయం కోసం తాము వాకౌట్ జరిపినట్లు, అయితే ప్రధాని చేసిందేమిటని ప్రశ్నించారు. దేశంలో హింసాత్మక ఘటనలపై ఆయన స్పందించాలని తాము కోరామని , మణిపూర్ ఒక్కటే కాకుండా, హర్యానా ఇతర చోట్ల పరిణామాలపై ప్రసంగించాలని కోరగా ఆయన రాజకీయ ఉపన్యాసానికి దిగారని డిఎంకె ఎంపి టిఆర్ బాలు స్పందించారు. కాంగ్రెస్‌కు చెందిన కార్తీ చిదంబరం మాట్లాడుతూ దేశ చరిత్రలో కనివిని ఎరుగని స్పిన్నర్ ఎవరంటే అది ఇప్పుడు తేలిందని, ప్రధాని మోడీ సారధ్యపు ప్రభుత్వమే ఈ స్పిన్నర్ అని క్రికెట్ పరిభాషలో తెలిపారు. జాతికి మణిపూర్ గురించి తెలియచేయాల్సింది పోయి ఇతర విషయాలను ప్రస్తావిస్తే లాభం ఏమిటని నీలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News