Monday, December 23, 2024

తొలి అడుగు

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీని దేశాధికారం నుంచి తొలగించాలనే దీక్షతో 15 ప్రతిపక్షాలు కలిసికట్టుగా పాట్నా వేదిక మీదికి రావడం విశేష పరిణామమే. చివరికి ఏమి జరగనున్నప్పటికీ ప్రస్తుతానికైతే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చొరవ ఒక మాదిరి ఫలితాన్ని సాధించిందని అంగీకరించాలి. ఇది కళ్లముందు కనబడుతున్న వాస్తవం. దీనిని నిరాకరించవలసిన పని లేదు. నిన్నటి వరకు పరస్పరం అనుమానంతో చూసుకొన్న పార్టీలు కూడా ఈ వేదికను పంచుకొన్నాయి. బిజెపికి, కాంగ్రెస్‌కి సమాన దూరంలో వుంటామని ప్రకటించి వున్న సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క బిజెపియే తమ శత్రువని ధ్రువపరచడం గమనించవలసిన మార్పు. అయితే తమ లక్ష శుద్ధి గురించి ఇవి ప్రజలను ఏ మేరకు ఒప్పించగలగుతాయో ముందు ముందు గాని వివరంగా వెల్లడి కాదు. కాంగ్రెస్ బలంగా వున్న చోట దానికి తమ మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు.

భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే దేశంలో ఎన్నికలనేవే వుండవని ఆమె అభిప్రాయపడ్డారు. బిజెపితో ఐక్యంగా పోరాడడానికి తామంతా సిద్ధంగా వున్నామన్నారు. బిజెపితో పోరాటం, దానిని అధికారం నుంచి దించడం అంటే కేవలం ఆ పార్టీ మీద కసితో చేసే పనులేనా, లేక అందులో దేశానికి, దేశ ప్రజలకు సంబంధించిన అంశాలేమైనా వున్నాయా? దేశ ప్రజలు బిజెపికి వరుసగా రెండు సార్లు అధికారం కట్టబెట్టారు. అంటే మిగతా రాజకీయ పక్షాలకు మించిన విలువను, గౌరవాన్ని దానికి ఇచ్చారు. వాటిని అది ఏమేరకు సార్థకం చేయగలిగింది, అంతగా తనను నెత్తిన పెట్టుకొన్న భారత ప్రజలకు బిజెపి ఏమిచ్చింది? తొమ్మిదేళ్ళకు మించి సాగిన దాని పాలనను తరచి చూచి ఈ ప్రశ్నలకు ప్రతి ఒక్కరూ సమాధానం వెతుక్కోవలసి వుంది. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటికి పెట్రోల్, డీజెల్ ధరలు లీటరు రూ. 60 70 మధ్య వున్నాయి. ఇప్పుడు రూ. 100 దాటిపోయాయి.

అలాగే గృహిణుల కంట తడిని తుడిచే వంట గ్యాస్ ధర రూ. 400 500 మధ్య వుండేది. ఇప్పుడు రూ. 1200లకు చేరుకొన్నది. 2012 మేలో యుపిఎ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరు వద్ద రూ. 7.54 పెంచితే, దానిని ఆ ప్రభుత్వ వైఫల్యంగా నరేంద్ర మోడీ విమర్శించారు. ఇప్పటి ధరల గురించి ఏమంటారని ఆయనను అడిగితే మౌనమే సమాధానమవుతుంది. ఇతర సరకుల ధరలు కూడా ఆకాశాన్నంటి నిప్పులు చెరుగుతున్నాయి.అలాగే నిరుద్యోగం ఎంత తీవ్రంగా వున్నదో అందరికీ తెలిసిందే. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టిన మోడీ ఆ వాగ్దానాన్ని అణువంతైనా అమలు పరచలేకపోయారు. విదేశాల్లోని గుప్తధనాన్ని తీసుకు వచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలోనూ రూ. 15 లక్షలు పడేలా చూస్తానని చేసిన ఆర్భాట ప్రకటన ఆచరణలో ఐపు లేకుండా పోయింది. ఇవన్నీ మామూలు ప్రజలకు సంబంధించిన మోసాలు కాగా,

అన్ని మతాల వారి సహజీవన సెక్యులర్ క్షేత్రంగా వుండిన దేశాన్ని హిందువుల ఆధిపత్యంలోని దేశంగా మార్చడానికి బిజెపి అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీని వల్ల భిన్న మతాల మధ్య వైషమ్యాలు పెరిగాయి. ముస్లింల ఆహారాన్ని కూడా ద్వేషించేలా మెజారిటీని తయారు చేయడానికి బిజెపి శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా గోమాంసం కలిగి వున్నారనే నెపంతో వారిని హతమార్చిన ఘటనలు కూడా జరిగిపోయాయి. అలాగే దళితులపై వల్లమాలిన విద్వేషాన్ని కక్కే సందర్భాలు చోటు చేసుకొంటున్నాయి. ఈ విధంగా భారత దేశం సెక్యులర్, ప్రజాస్వామిక రాజ్యాంగం ద్వారా చెప్పుకొన్న ఘన సంకలాన్ని విడనాడుకొనేలా చేసేందుకు పార్లమెంటు ద్వారా, బయటా కమలనాథులు అమలు చేస్తున్న పన్నాగాలు ఇన్ని అన్ని కావు. దీనిని దృష్టిలో వుంచుకొనే బిజెపి హస్తాల నుంచి భారత దేశ చరిత్రను కాపాడుతామని పాట్నా సభలో ప్రతిపక్షాలు ప్రతిన బూనాయి.

మిగతా ప్రతిపక్ష పార్టీల కంటే పార్లమెంటులో ఎక్కువ స్థానాలు కలిగిన కాంగ్రెస్ ఐక్య ప్రతిపక్ష వేదికకు సహకరిస్తానని ప్రకటించింది. గత కాలపు ఇష్టాయిష్టాలను జ్ఞాపకాల నుంచి చెరిపి వేసి ఈ సభకు తాను వచ్చానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బిజెపిని అధికారం నుంచి దించాలని అనుకోడమంటే ఈ దేశ సహజీవన సంస్కృతిని కాపాడాలనుకోడమే. ఇందులో ఎవరి స్వార్థమూ వుండడానికి వీల్లేదు. ఈ విషయం పాట్నా వేదిక మీద స్పష్టమైంది. అయితే అందుకోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకొంటారన్నది ఈ భేటీలో వెల్లడి కాలేదు. వచ్చే నెల సిమ్లాలో జరిగే రెండవ సభలో అందుకు సంబంధించిన విధి నిషేధాలు బయటపడవచ్చు. పాట్నా సభలో ఆమ్ ఆద్మీ పార్టీ లేవనెత్తిన ఢిల్లీ ఆర్డినెన్స్ అంశానికి ఈ ఐక్యతను దెబ్బ తీసే శక్తి వున్నదని భావించలేము. ఎందుకంటే కాంగ్రెస్ ఎటువంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యకు మద్దతు ఇవ్వబోదని ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News