బెంగళూరు : కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్నాటకలో ప్రతిపక్ష పార్టీల రెండురోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలలో బిజెపి కూటమిని ఎదుర్కొనేందుకు జట్టుకట్టేందుకు విపక్షాల భేటి జరగడం ఇది రెండోసారి. ఇంతకు ముందు ఈ సమావేశంగత నెల 23న పాట్నాలో జరిగింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే బెంగళూరు ప్రతిపక్ష సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ జాతీయ స్థాయి నేత రణదీప్ సూర్జేవాలాలు ఈ భేటీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. విపక్షాల భేటీకి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ద్వారా ఈ భేటీకి వివిధ పార్టీల నేతలకు ఆహ్వానాలు అందాయి. వీరిలో ఇప్పటికే చాలా మంది బెంగళూరుకు చేరారు.
కాంగ్రెస్ కీలక నేత సోనియా గాంధీ తరఫున నేతలకు విందు ఏర్పాటు చేశారు. సోనియా , రాహుల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ, ఎన్‌సిపి నేత శరద్ పవార్, శివసేన యుబిటి నేతలు ఉద్ధవ్ థాకరే, ఆదిత్యా థాకరే, సంజయ్ రౌత్, బీహార్ సిఎం నితీశ్‌కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ సమావేశానికి వచ్చారు. డిఎంకె అధినేత స్టాలిన్, ఆప్ నేత కేజ్రీవాల్‌లు కూడా హాజరుకానున్నారు. విపక్ష భేటీకి ఎండిఎంకె, కెడిఎంకె, విదుతలే చిరుతైగల్ కచ్చి (విసికె) , ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డ్‌బ్లాక్, ఐయుఎంల్ హాజరుకానుంది. పంజాబ్ సిఎం భగవంత్ మాన్, జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ , మాజీ సిఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా,
అఖిలేష్ యాదవ్, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఇతరులు హాజరు కానున్నారు. మొత్తం మీద 26 ప్రతిపక్ష పార్టీలు ఈ భేటీకి వస్తాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సోమవారం ఇక్కడికి చేరిన నేతలకు విమానాశ్రయంలో సిద్ధరామయ్య, డిప్యూటీ సిఎం డికె శివకుమార్ ఇతర నేతలు స్వాగతం పలికారు.
కనీస ఉమ్మడి కార్యక్రమం కీలకం
ఇందుకు , యుపిఎ పేరు మార్పుపై సబ్‌కమిటీ
ప్రతిపక్షాల సంఘటితం దిశలో ముందు కనీస ఉమ్మడి కార్యక్రమం (సిఎంపి) ఖరారు కీలకం కానుంది. దీని గురించి మంగళవారం విస్తృతంగా చర్చించేందుకు ఓ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఇందులో బిజెపిని బలీయంగా లోక్‌సభ ఎన్నికలలో ఎదుర్కొనేందుకు అవసరం అయిన విధివిధానాల ఖరారుకు సిఎంపి అత్యవసరం కానుంది. ఇక కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న యుపిఎ పేరు మార్పు దిశగా కూడా నిర్ణయం తీసుకుంటారని వెల్లడైంది. యుపిఎ పేరు మార్పిడిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, కలిసికట్టుగా దీనిపై ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సోమవారం విలేకరులకు తెలిపారు. మంగళవారం ప్రతిపక్షాల భేటీలో కీలక ఘట్టం మంగళవారం ఖర్గే స్వాగతోపన్యాసంతో ఆరంభమవుతుంది. ఉమ్మడిగా ప్రతిపక్షాల ప్రచారాన్ని ఖరారు చేసుకునేందుకు కూడా ఓ సబ్‌కమిటీ ఏర్పాటు కానుంది.