Sunday, December 22, 2024

బెంగళూరులో 17, 18 తేదీలలో విపక్ష భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రతిపక్షాల తదుపరి భేటీ బెంగళూరులో ఈ నెల 17 18 తేదీలలో జరుగుతుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ సోమవారం తెలిపారు. బిజెపి వాషింగ్ మిషన్ ద్వారా ఇప్పుడు జరిగిన ముంబై ఆపరేషన్ పరిణామంతో ప్రతిపక్షాలు ఏకం కావాలనే సంకల్పం మరింత బలోపేతం అయిందన్నారు. మహారాష్ట్రలో ఎన్‌సిపి నేత అజిత్ పవార్ పార్టీలో తిరుగుబాటుకు దిగి, మంత్రివర్గంలో చేరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలనే ఆలోచన ఇప్పుడు మరింతగా కార్యాచరణకు మారుతుందన్నారు. ఫాసిస్టు,

అప్రజాస్వామిక శక్తులను చిత్తుచేసే క్రమంలో ఇప్పుడు ప్రతిపక్షాలు మరింత ధృఢమైన వైఖరితో ముందుకు సాగుతాయన్నారు. బెంగళూరులో ప్రతిపక్ష భేటీ తేదీ వివరాలను కెసి వేణుగోపాల్ ట్విట్టర్‌లో పొందుపర్చారు. గత వారంలో ఎన్‌సిపి నేత శరద్ పవార్ ముంబైలో మాట్లాడుతూ ప్రతిపక్షాల తదుపరి సమావేశం బెంగళూరులోనే ఈ నెల 13, 14వ తేదీలలో జరుగుతుందని తెలిపారు. అయితే ఈ తేదీలలో కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ సెషన్ ఉండటంతో , అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని ఈ నెల 17 , 18 తేదీల్లో బెంగళూరులో జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు వివరించారు. పలు ప్రతిపక్ష పార్టీల తొలి భేటీ పాట్నాలో గత నెల 23న జరిగింది.

బిజెపి వాషింగ్ మిషన్‌లో ఐసిఇ డిటర్జెంట్
మహారాష్ట్రలో ఎన్‌సిపికి చెందిన అజిత్ పవార్ ఇతరులను ఆ పార్టీ నుంచి బిజెపి అనైతికంగా చీల్చిందని కాంగ్రెస్ కమ్యూనికేషన్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మండిపడ్డారు. ఆదివారం చాలా విచిత్రం జరిగింది. బిజెపి బ్రాండ్ మోడీ వాషింగ్‌మిషన్ ఈసారి ముంబైలో తన పని ప్రారంభించింది. ఈ వాషింగ్‌మిషన్‌కు ఇన్‌కంటాక్స్ , సిబిఐ, ఇడిలు (ఐసిఇ) డిటర్జెంటుగా మారాయని విమర్శించారు. ఈ డిటర్జెంటు ఘాటు చూపించి ఎన్‌సిపిలో చీలిక తెచ్చారని తెలిపారు. ఇదంతా కూడా ప్రతిపక్ష ఐక్యతను దెబ్బతీసేందుకు సాగుతోన్న వ్యవహారం అన్నారు. ఈ నెల 17, 18 తేదీలలో బెంగళూరులో జరిగే తదుపరి ప్రతిపక్ష భేటీలో అన్ని విషయాలూ ప్రస్తావనకు వస్తాయని తెలిపారు.

బెంగళూరు భేటీ ..ఒక్కరికోసం అందరూ అందరి కోసం ఒక్కరు
ఇప్పుడు ప్రతిపక్షాలు ఎవరికి వారేగా ఉండవని, బెంగళూరు సమావేశంతో ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలు మరింత బలోపేతం అవుతాయని టిఎంసి ఎంపి డెరెక్ ఒ బ్రెయిన్ స్పందించారు. కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ వెలువరించిన బెంగళూరు సమ్మిట్ …ఆల్ ఫర్ ఒన్, ఒన్ ఫర్ ఆల్‌ను టిఎంసి నేత తమ ట్వీటుకు జతపర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News