Sunday, January 19, 2025

లోగో, సిఎంపిపై అంగీకారం ..నేడు సీట్ల సర్దుబాట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : ముంబైలో గురువారం ప్రతిపక్షాల కూటమి ఇండియా రెండురోజుల భేటీ ఆరంభం అయింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష కూటమిని బలోపేతం చేసే దిశలో ఏర్పాటు అయిన మూడో భేటీ ఇది. ఇక్కడి శివార్లలోని హోటల్ హయాత్‌లో జరిగే సమావేశాలలో తొలిరోజు గురువారం ఇష్టాగోష్టిగానే నేతల నడుమ చర్చలు జరిగాయి. కాగా శుక్రవారం కూటమి కన్వీనర్ ఎంపిక, లోగోపై నిర్ణయం, కలిసికట్టుగా ప్రచారానికి అవసరం అయిన రీతిలో కనీస ఉమ్మడి కార్యక్రమం (సిఎంపి) వంటివి ప్రస్తావనకు రానున్నాయి. వివిధ రాష్ట్రాలలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు ప్రధాన అంశం కానుంది. అయితే ఇప్పటికే ఈ విషయంలో దాదాపుగా ఏకాభిప్రాయం కుదిరిందని, కొన్ని రాష్ట్రాలలో కొన్ని సీట్లపై సంక్లిష్టత నెలకొందని ఇండియా కూటమి నేతలు తెలిపారు. ఇక్కడ ఆరంభమైన భేటీ నేపథ్యంలో నేతలు ఆసీనులైన హాల్‌లో జుడేగా భారత్, జీతేగా ఇండియా అనిరాసి ఉన్న బ్యానర్లు కన్పించాయి. ఇండియా భేటీకి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఉద్ధవ్ థాకరే ,

సీనియర్ నేత శరద్ పవార్ వంటి వారు వచ్చారు. ఖర్గేను వెంటబెట్టుకుని రాహుల్ హోటల్‌లోకి వచ్చారు. పలువురు ప్రముఖ నేతలకు ఎన్‌సిపి నాయకురాలు సుప్రియా సూలే స్వాగతం పలికారు. ఆదిత్యా థాకరే, సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత మనోజ్ ఝాతో భేటీకి ముందు రాహుల్ మాట్లాడుతూ కన్పించారు. గురువారం సాయంత్రం తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్, జార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ , బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్ తరలివచ్చారు. ఇండియా భేటీలో పాల్గొనేందుకు మమత బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా, పిడిపి నేత మెహబూబా ముఫ్తీ బుధవారమే వచ్చారు. ఇండియా కూటమి కేవలం ఏ ఒక్కపార్టీ కోసమో లేదా కొన్ని పార్టీలకోసమో కాదని మొత్త ం 140 కోట్ల మంది భారతీయుల కోసం అని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. మోదీ సర్కార్ ఒక్క మనిషికోసం పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన అదానీ మోడీ కనెక్షన్‌ను ప్రస్తావించారు. ఇండియా కూటమి దేశంలోని ప్రజలందరి కోసం పనిచేస్తుందన్నారు.

మోడీ సర్కారును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతాయని, దీనిలో వెనుకంజ లేదని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఇండియా కూటమికి పెరుగుతున్న ఆదరణతో మోడీ ఇతర బిజెపి నేతలు భయపడుతున్నారని సిపిఎం నేత సీతారాం ఏచూరి తెలిపారు. శుక్రవారం ఇండియా కూటమికి సంబంధించి లోగోను, ఉమ్మడి కార్యక్రమాన్ని విలేకరుల సమావేశంలో నేతలు వెల్లడిస్తారు. అయితే ఈసారి సీట్ల సర్దుబాట్లపై ప్రకటన వెలువడటం అనుమానాస్పదం అయింది. కాగా గురువారం నాడే మోడీ సర్కారు ఉన్నట్లుండి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల గురించి ప్రకటన వెలువరించడం, ఈ సెషన్‌లో అత్యంత కీలక బిల్లులు తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నదనే విషయంతో ఇండియా కూటమి శుక్రవారం ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.

కేంద్రానికి భయం అందుకే జమిలీ తంతు
ప్రతిపక్ష నేతలు ప్రియాంక చతుర్వేది
ఇండియా కూటమి సంఘటితంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి భయం పట్టుకుందని ప్రతిపక్ష నేతలు ప్రియాంక చతుర్వేది, సంజయ్ సింగ్‌లు ముంబైలో విమర్శించారు, ఎటువంటి ముందస్తు సంప్రదింపులకు తావు లేకుండా కేంద్రం పార్లమెంట్ స్పెషల్ సెషన్‌కు దిగడం ఇందులో ఒకే దేశం ఒకే ఎన్నికలు పేరిట జమిలీకి దిగడం నిరంకుశమే అవుతుందని శివసేన ఉద్ధవ్ వర్గం నాయకురాలు ప్రియాంక తెలిపారు. ఎన్నికల సంఘంతో మాటవరసకు అయినా మాట్లాడకుండా కేంద్రం ఒన్ ఇండియా ఒన్ ఎలక్షన్ బిల్లు తీసుకురావడం దారుణం అని, ఇక మరీ వివాదాస్పద యుసిసిని ఏ విధంగా తెస్తారని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News