న్యూఢిల్లీ : వక్ఫ్ చట్టానికి ప్రతిపాదిత సవరణలపై ముస్లింలను ప్రతిపక్షాలు ‘తప్పుదారి పట్టిస్తున్నాయి’ అని బిజెపి సోమవారం ఆరోపించింది. బిల్లు పార్లమెంట్ ఆమోదముద్ర పొందినట్లయితే స్పష్టమైన టైటిళ్లు ఉన్న వక్ఫ్ ఆస్తుల్లో ‘ఒక్క అంగుళమైనా’ పరాధీనం కాదని బిజెపి స్పష్టం చేసింది. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఎఐఎంపిఎల్‌బి) సారథ్యంలో పలు ముస్లిం సంస్థలు ఢిల్లీలో వక్ఫ్ (సవరణ) బిల్లుపై నిరసన ధర్నాలో పాల్గొన్న నేపథ్యంలో బిజెపి ఆ ఆరోపణ చేసింది. పలువురు ఎంపిలు ధర్నాలో పాల్గొన్నారు. బిల్లుకు మద్దతు ఇచ్చిన పక్షంలో ముస్లింలు ఎన్నటికీ క్షమించబోరని ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు టిడిపి. జెడి (యు), ఎల్‌జెపి(రామ్‌విలాస్)లను ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు.
ఆ ధర్నాపై వ్యాఖ్యానించవలసిందని మీడియా కోరినప్పుడు బిజెపి ఎంపి తేజస్వి సూర్య స్పందిస్తూ, ‘దేశంలో వోటు బ్యాంకు రాజకీయాలు భయం ఆధారంగానే ఎల్లప్పుడూ సాగుతున్నాయి. సెక్యులర్ పార్టీలుగా చెప్పుకుంటున్నవి అనుసరించే పద్ధతే అది’ అని అన్నారు. ‘వక్ఫ్ ఆస్తుల యాజమాన్యంలో ప్రొఫెషనలిజాన్ని, మేలైన నిర్వహణను, పారదర్శకతను తీసుకురావడమే వక్ఫ్ బిల్లును తేవడంలో ప్రభుత్వ ఉద్దేశం అని ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నాను’ అని తేజస్వి సూర్య ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో విలేకరుల గోష్ఠిలో చెప్పారు. వక్ఫ్‌కు చెందని భూముల ఆక్రమణకు వక్ఫ్ బోర్డు అధికారాల దుర్వినియోగం చెందకుండా ప్రభుత్వం చూసిందని ఆయన తెలిపారు.
‘స్పష్టమైన టైటిళ్లు ఉన్న అన్ని సంస్థలు, ఏళ్ల తరబడి ఉనికిలో ఉన్న అన్ని ప్రార్థనా స్థలాలలో ఏ ఒక్కదానికీ కొత్త వక్ఫ్ చట్టం గురించి భయం ఉండరాదు’ అని సూర్య అన్నారు. ముస్లింలను తప్పుదారి పట్టించే యత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు, ‘అటువంటి భూముల్లో ఒక్క అంగుళం పరాధీనం కాదు’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలపై సూర్య విరుచుకుపడుతూ, సెక్యులర్ పార్టీలుగా చెప్పుకుంటున్నవి ముస్లింల కోసం ఏమీ చేయలేదని, అవి వారిని బెదరగొట్టే, తప్పుదారి పట్టించే యత్నాలే చేశాయని ఆరోపించారు. ‘వక్ఫ్ బోర్డులను మరింత పటిష్ఠం చేయడమే ప్రభుత్వ ఉద్దేశం’ అని సూర్య చెప్పారు.