Wednesday, November 6, 2024

అవిశ్వాసం అసలు ఉద్దేశం

- Advertisement -
- Advertisement -

దేశం పరువు తీసిన మణిపూర్ దారుణాల నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షం ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను లోక్‌సభ స్పీకర్ పరిశీలనకు స్వీకరించక తప్పలేదు. కొత్తగా ఏర్పాటైన 26 ప్రతిపక్షాల ఐక్య కూటమి ‘ఇండియా’ తరపున కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటి, భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) నుంచి మరొకటి రెండు అవిశ్వాస తీర్మానాలు బుధవారం ఉదయం 10 గం.లోగా లోక్‌సభ స్పీకర్‌కు అందాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ఉదయం 10 గం.లోపు దాఖలైన అవిశ్వాస తీర్మానాలపై స్పీకర్ తన నిర్ణయాన్ని ఆ రోజే ప్రకటించవలసి వుంటుంది. తీర్మానాన్ని లోక్‌సభ సభ్యులెవరైనా ప్రతిపాదించవచ్చు. అవిశ్వాస తీర్మానాలను తీసుకొచ్చే హక్కు లోక్‌సభ సభ్యులకు మాత్రమే వుంటుంది. తీర్మానానికి మద్దతుగా దానిని ప్రతిపాదించిన వ్యక్తి సహా కనీసం 50 మంది సభ్యులు సంతకాలు చేయవలసి వుంటుంది.

పరిశీలనకు స్వీకరించిన అవిశ్వాస తీర్మానంపై 10 రోజుల్లోగా చర్చను చేపట్టాలి. ఆ తేదీని స్పీకర్ సభలోని అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయిస్తారు. కాంగ్రెస్ పార్టీ తరపున అసోంకి చెందిన సభ్యుడు గౌరవ్ గొగోయ్ తీర్మానాన్ని ప్రతిపాదించగా, బిఆర్‌ఎస్ తరపున నామా నాగేశ్వర రావు అవిశ్వాసాన్ని సంధించారు. లోక్‌సభలో బలాబలాలను బట్టి ఈ తీర్మానం నెగ్గే అవకాశాలు బొత్తిగా లేవు. పాలక పక్ష కూటమి ఎన్‌డిఎకి సభలో భారీ మెజారిటీ వుంది. తీర్మానం నెగ్గాలంటే సభలో కనీస మెజారిటీ అయిన 272 మంది సభ్యుల మద్దతు అవసరం వుంటుంది. ఒక్క బిజెపి బలమే 303, ఎన్‌డిఎ ఉమ్మడి సంఖ్యా బలం 331. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు గల సభ్యులు 144 మందే. బిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌పి, బిజూ జనతాదళ్ ఉమ్మడి బలం 70. ఈ పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం నెగ్గడం కలలో కూడా జరిగే పని కాదు. అటువంటప్పుడు ప్రతిపక్ష కూటమి ఎందుకు ఈ అవిశ్వాసాన్ని తలపెట్టినట్టు? మణిపూర్‌లో ఇద్దరు కుకీ తెగ మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనపై శీతాకాల సమావేశాల తొలి రోజు నుంచి పార్లమెంటు దద్దరిల్లుతున్నది. 4 రోజుల పాటు సమావేశాలు వాయిదా పడ్డాయి. మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ కనాకష్టంగా 77 రోజుల తర్వాత మాట్లాడినప్పటికీ సమస్య మూలాలను ప్రస్తావించలేదు. అందుచేత ప్రధాని స్వయంగా సభకు వచ్చి మణిపూర్‌పై మాట్లాడాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

కేంద్రంలో, మణిపూర్‌లో గల బిజెపి ప్రభుత్వాలు 80 రోజులు దాటిపోతున్నా అక్కడి సమస్యను పరిష్కరించలేకపోయాయి. ఉద్రిక్తతలను చల్లార్చలేకపోయిన వైఫల్యం వాటి ముఖాల మీద స్పష్టంగా కనిపిస్తున్నది. అమెరికా సహా విదేశాలు వేలెత్తి చూపించే పరిస్థితి తలెత్తింది. అందుచేత దేశాధికార దండాన్ని చేతబూనిన ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఈ వ్యవహారంపై సమగ్రంగా వివరించాల్సి వుంటుంది. దీనికి వేరు మాట లేదు. అదానీ వ్యవహారం సహా ఇప్పటికనేక వివాదాస్పద పరిణామాలపై నోరు విప్పకుండా ప్రధాని తప్పించుకోగలిగారు. ఈసారి మణిపూర్ ఉదంతంపై ఆయనను సభకు రప్పించి ప్రసంగించేలా చేయాలని ప్రతిపక్ష కూటమి పట్టుదలతో వుంది. అందుకోసమే అవిశ్వాస తీర్మాన మార్గాన్ని అది ఎంచుకొన్నది. తాను ఓడిపోయినా ప్రధాని చేత మాట్లాడిస్తే ఆ మేరకు అదే తనకు విజయమని ‘ఇండియా’ భావిస్తున్నది. ప్రతిపక్ష కూటమి అవిశ్వాస తీర్మాన ప్రస్తావన తీసుకు రాగానే ప్రధాని మోడీ దాని మీద రెచ్చిపోయి మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం నుంచి ఊడిపడేదేమీ లేదని ఆయన అన్నారు. అంతేకాదు ప్రతిపక్షాలు తమ కూటమికి ‘ఇండియా’ అని వచ్చేలా పేరు పెట్టుకోడాన్ని కూడా ఆయన ఎద్దేవా చేశారు.

ఈస్టిండియా కంపెనీ, ఉగ్రవాద సంస్థలు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ముజాహిదీన్ వంటివి కూడా ఇండియా పేరును పెట్టుకొన్నాయని ఎత్తి చూపారు. ఇది ఆయన అక్కసును చాటుతున్నది. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని పదవిలో వుంటూనే అవిశ్వాస తీర్మానాలను గట్టిగా సమర్థించారు. ఈ తీర్మానాల వల్ల అనేక విషయాలు చర్చకు వస్తాయని, అది దేశానికి అవసరమని అన్నారు. 1999 ఏప్రిల్ 17న అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వంపై ఒక్క ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానం నెగ్గడం, ఆయన ప్రభుత్వం కూలిపోడం తెలిసిందే. మొదటి రెండు లోక్‌సభల్లోనూ అవిశ్వాస తీర్మానాలు లేవు. 1963లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంపై ఆచార్య జెబి కృపలానీ మొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. అది వీగిపోయింది. ప్రధాని మోడీ ప్రభుత్వంపై ఇది రెండవ అవిశ్వాస తీర్మానం. 2018లో ఆయన ప్రభుత్వంపై అప్పటి టిఆర్‌ఎస్ పార్టీ మొదటి అవిశ్వాస తీర్మానాన్ని తెచ్చింది. ప్రస్తుత తీర్మానంపై చర్చ సమగ్రంగా జరిగి దేశ సమస్యలపై వెలుగు ప్రసరిస్తుందని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News