Wednesday, January 22, 2025

పార్లమెంటులో విపక్ష ఎంపీల మానవహారం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అదానీ గ్రూపు పాల్పడిన ఆర్థిక అవకతవకలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశాయి. గురువారం పార్లమెంటు ఎదుట విపక్షాలకు చెందిన నేతలంతా మానవహారంగా ఏర్పడి తమ నిరసనను తెలియజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో భావసారూప్యం కల విపక్షాల నేతలంతా ఒక్కటై ఈ మానవహారంలో పాల్గొన్నారు.

ఖర్గేతో పాటుగా డిఎంకె నేత టిఆర్ బాలు, సమాజ్‌వాది పార్టీ నేత రాంగోపాల్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా, శివసేన థాక్రే వర్గానికి చెందిన ప్రియాంక చతుర్వేది అరవింద్ సావంత్‌తో పాటుగా ఆర్‌జెడి, బిఆర్‌ఎస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, జెడి (యు)తదితర పార్టీలకు చెందిన ఎంపిలు మానవహారంలో పాలు పంచుకున్నారు. ఎంపిలంతా అదానీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ ‘అదానీ గ్రూపుపై జెపిసి దర్యాప్తు జరిపించాని డిమాండ్ చేయడానికి ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ తన ఆప్తమిత్రుడు అదానీని కాపాడడానికి ప్యత్నించడం దురదృష్టకరం’ అని అన్నారు. బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ర్యాలీగా వెళుతున్న ప్రతిపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తడానికి విపక్ష నేతలను అనుమతించడం లేదని, వారి మైక్‌లను ఆపేస్తున్నారని ఆయన అన్నారు. గురువారం ఉదయం మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశంలో మానవహారంగా ఏర్పడాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ మినహా దాదాపుగా అన్ని విపక్షాలకు చెందిన నేతలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News