ఢిల్లీ: అప్రజాస్వామికంగా 23 మంది ఎంపిలను సస్పెండ్ చేశారని, పార్లమెంట్ చరిత్రలోనే ఇది బ్లాక్ డే అని టిఆర్ఎస్ ఎంపిలు మండిపడ్డారు. పార్లమెంట్ ఆవరణంలోని మహాత్మ గాంధీ విగ్రహం ముందు విపక్షాలకు చెందిన 23 మంది ఎంపిలు నిరసన తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చ కోరితే సభ్యులను సస్పెండ్ చేస్తారా? అని ఎంపిలు మండిపడుతున్నారు. జిఎస్‌టి భారం, ధరల పెంపుతో ప్రజలకు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారం రోజులుగా సభలో ఆందోళన చేస్తున్నామని, అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ప్రతిపక్షాల ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై మోడీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని టిఆర్ఎస్ ఎంపిలు మండిపడ్డారు. తెలంగాణపై ప్రధాని మోడీ కక్ష గట్టాడన్నారు. సిఎం కెసిఆర్ దిశానిర్దేశంలో తమ పోరాటం కొనసాగుతుందని టిఆర్ఎస్ ఎంపిలు స్పష్టం చేశారు.