అదానీ వివాదంపై కాంగ్రెస్ నాయకత్వంలో పలువురు ప్రతిపక్ష ఎంపిలు శుక్రవారం పార్లమెంట్ సముదాయం లోపల నిరసన పాదయాత్ర నిర్వహించారు. వారు ‘మోడీ అదానీ భాయ్ భాయ్’ అని నినాదం రాసి ఉన్న నల్ల మాస్కులు ధరించారు. ఇండియా కూటమి పార్టీలు కొన్నింటికి చెందిన పలువురు నేతలు రాజ్యాంగం ప్రతిని పట్టుకుని, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన యాత్రలో పాల్గొన్నారు. నిరసనలో పాల్గొన్న ఎంపిల్లో ఆర్‌జెడి, జెఎంఎం, వామపక్షాల నేతలు కూడా ఉన్నారు. నిరసన ప్రదర్శనలో పాల్గొనని టిఎంసి, సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అదానీపై అటువంటి ఖండన కార్యక్రమాలకు ఇంత వరకు దూరంగానే ఉంటున్నారు.
కాగా, ఆ రెండు పార్టీల నిర్ణయాన్ని ప్రతిపక్ష కూటమిలో ‘చీలిక’గా అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) భావిస్తోంది. లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి, వయనాడ్ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆ పాదయాత్రలో పాల్గొన్నవారిలో ఉన్నారు. అదానీ వివాదంపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందని ప్రియాంక ఆ తరువాత ఆరోపించారు. ప్రభుత్వానికి ఎందుకు భయం అని ఆమె అడిగారు. అదానీ, ఇతర అధికారులపై ఒక యుఎస్ కోర్టులో దోషులుగా నిర్ధారణ చేసిన దృష్టా అదానీ గ్రూప్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో దర్యాప్తు నిర్వహించాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అదానీని అరెస్టు చేయాలని కూడా రాహుల్ గాంధీ కోరారు. అయితే, అన్ని ఆరోపణలను ‘నిరాధారమైనవి’గా అదానీ గ్రూప్ కొట్టివేసింది.