న్యూఢిల్లీ : హోం మంత్రిత్వశాఖ సంబంధిత పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి ప్రతిపక్ష సభ్యులు గురువారం వాకౌట్ జరిపాయి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ పరిస్థితి విషమంగా ఉందని, దీనిపై చర్చించాల్సి ఉందని ప్యానల్ భేటీలో విపక్ష సభ్యులు పట్టుపట్టారు. అయితే దీనికి ప్రభుత్వం సమ్మతించలేదు. ఇందుకు నిరసనగా ప్రతిపక్షాలు తాము ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపాయి. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో జైళ్ల సంస్కరణల విషయాన్ని చర్చిచేందుకు కమిటీ భేటీ ఏర్పాటు చేశారు. ముందు మణిపూర్ పరిస్థితి గురించి ఈ కమిటీ చర్చించాల్సి ఉందని, దీనిని ఎవరూ విస్మరించడానికి వీల్లేదని ఛైర్మన్ బృజ్‌లాల్‌కు టిఎంసికి చెందిన ఎంపి డెరెక్ ఒ బ్రెయిన్, కాంగ్రెస్ ఎంపి దిగ్విజయ్ సింగ్, ప్రదీప్ భట్టాచార్యలు సంయుక్త లేఖను అందించాయి.
అత్యవసర ప్రాతిపదికన మణిపూర్‌లో చర్చించాల్సి ఉంది. ఇది కమిటీ సభ్యులుగా తమ కనీస నైతిక బాధ్యత అని లేఖలో తెలిపారు. ప్యానెల్ సారధి అయిన బృజ్‌లాల్ 2000 సంవత్సరం ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ డిజిపిగా కొంతకాలం వ్యవహరించారు. ఇంతకు ముందు సీనియర్ పోలీసు అధికారిగా పనిచేసిన వ్యక్తికి , మణిపూర్‌లో పరిస్థితి తీవ్రత గురించి తెలుసునని , అక్కడి హింసాకాండను వెంటనే అరికట్టాల్సి ఉందనే విషయం గుర్తించిన ఆయన ముందుగా దీనిపై చర్చ చేపట్టాల్సి ఉందన్నారు. ప్రజల తరఫున ఎన్నికైన ప్రజా ప్రతినిధులమైన మనం ఈ బాధ్యత నుంచి వైదొలిగితే మంచిది కాదనితెలిపారు. అయితే మణిపూర్ పరిస్థితిపై ఈ ప్యానెల్ భేటీలో చర్చించడం కుదరదని తెలియచేయడం చివరికి ప్రతిపక్షాల నుంచి వాకౌట్‌కు దారితీసింది.