న్యూఢిల్లీ : రక్షణ శాఖలో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌కు వ్యతిరేకంగా దేశం లోని వివిధ వర్గాల నేతలు, యువకుల నుంచి ఆందోళనలు చెలరేగుతున్నాయి. చాలా చోట్ల రోడ్లపై యువత చేరి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఘర్షణలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరుద్యోగ యువత మొర ఆలకించాలని, అగ్నిపథం వైపు వారిని నడిపిస్తూ వారి సహనానికి అగ్నిపరీక్ష పెట్టవద్దని ప్రధాని నరేంద్రమోడీని అభ్యర్థించారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ యువకుల కలలను భగ్నం చేయరాదని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
బిజెపి ఎంపి వరుణ్‌గాంధీ ఇది రక్షణ శాఖకు అనవసర భారమే అని వ్యాఖ్యానించారు. ఈమేరకు రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు లేఖ రాశారు. ఈ అగ్నిపథ్ పథకంపై యువతలో అనేక ప్రశ్నలు , సందేహాలున్నాయని పేర్కొన్నారు. నాలుగేళ్ల తరువాత 75 శాతం అగ్నివీరులు ఎలాంటి పింఛను సదుపాయం లేకుండా రిటైర్ అయి, తరువాత నిరుద్యోగులుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఈ పథకం యువతకు అన్యాయం చేయడమేనని విమర్శించారు. నాలుగేళ్ల కాంట్రాక్టు కింద సైనిక నియామకాలు చేస్తాననడం అన్యాయమేనని ధ్వజమెత్తారు. అగ్నిపథ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం యువతపై నిర్లక్షం ప్రదర్శిస్తోందని, దేశ భవిష్యత్తుకు ఇది ప్రాణాంతకమని సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు.