న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం చదువుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు కొందరు అదానీ, అదానీ అంటూ నినాదాలు చేసి సభకు కొంద్దిసేపు ఆలంకం కలిగించారు. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రెసెర్చ్ అనే సంస్థ అదానీ గ్రూపు కంపెనీలు మోసాలకు, అక్రమాలకు పాల్పడ్డాయంటూ ఒక నివేదికను విడుదల చేసిన దరిమిలా అదానీ గ్రూపు కంపెనీల షేర్లు దారుణంగా పతనం కావడం, అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీకి ప్రధాని నరేంద్ర మోడీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ గతంలో అనేకసార్లు ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్‌లోనే ఆరోపణలు గుప్పించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే ఉద్దేశంతో బుధవారం ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగానికి ఆటంకం కల్పిస్తూ ప్రతిపక్ష సభ్యులు అదానీ పేరును సభలో నినదించారు. తన బడ్జెట్ ప్రసంగంలో పోర్టులు, ఇతర మౌలికసౌకర్యాల ప్రాజెక్టుల గురించి ప్రస్తావించిన సందర్భంలో ప్రతిపక్ష సభ్యులు అదానీ పేరును నినదించడం గమనార్హం. అయితే నిర్మలా సీతారామన్ మాత్రం ఆ నినాదాలను పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు.