Wednesday, January 22, 2025

ప్రధానే రావాలి.. ప్రకటన చేయాలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు మణిపూర్ అంశం కొరుకుడుపడని ప్రతిష్టంభనగా మారింది. మణిపూర్ విషయంపై సభలలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతారని, చర్చకు తాము సిద్ధం అని ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రధాని మోడీ సభలో ప్రకటన చేయాల్సి ఉందని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. మణిపూర్ విధ్వంసం ఆందోళనకరమని దీనిపై ప్రధాని మోడీ వెంటనే సభలోనే సమాధానం ఇవ్వాల్సి ఉందని ప్రతిపక్షాలు సోమవారం కూడా తమ పట్టుబిగించాయి. ప్రధాని మోడీ ఈ విషయంపై సభ వెలుపల మాట్లాడం, సభలోపల మౌనం పాటించడం ఎందుకు? అని విపక్షాలు నిలదీశాయి. ప్రతిపక్షాలను అవమానించడం, దేశాన్ని పక్కదోవ పట్టించడం ప్రధాని ఆనావాయితీ అయిందని విమర్శించాయి. ఈ విషయంపై హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ మణిపూర్ అంశం అత్యంత సున్నితమైనదని,

దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, హోం మంత్రిగా సభకు తాము సమాదానం ఇస్తామని తెలిపారు. చర్చ జరిగితే కీలక విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మరి ప్రతిపక్షాలు విషయాన్ని ప్రస్తావించడం , తీరా చర్చకు ముందుకు రాకపోవడం విడ్డూరంగా ఉందని అమిత్ షా విమర్శించారు. ముందు ప్రతిపక్ష సభ్యులు సంయమనం పాటించి చర్చకు అంగీకరించాలని కోరారు. సున్నితమైన అంశంపై దేశం తెలుసుకోవల్సి ఉందని, చర్చ జరిగితే నిజాలు తేలుతాయని షా తెలిపారు. సభలలో ప్రతిపక్ష వాదనను అధికార పక్షం తిప్పికొట్టింది. ప్రతిపక్షాలు చర్చ పట్ల పలాయనం చిత్తగిస్తున్నాయని, పైగా రాద్ధాంతానికి దిగుతూ విలువైన సెషన్‌కు అడ్డుతగులుతున్నాయని బిజెపి ఎదురుదాడికి దిగింది. సోమవారం ఈ పరిస్థితి నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరోసారి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. కాగా పార్లమెంట్‌లో ప్రతిష్టంభన గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా,

బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా ప్రధాని మోడీని పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల వైఖరి, కీలకమైన మణిపూర్ విషయంపై మంతనాలు జరిపినట్లు వెల్లడైంది. వీటితో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూడా ఈ ముగ్గురు చర్చించినట్లు వెల్లడైంది. మరో వైపు ప్రస్తుత పార్లమెంట్ గందరగోళం గురించి రక్షణ మంత్రి , లోక్‌సభలో డిప్యూటీ నేత రాజ్‌నాథ్ సింగ్ కొందరు ప్రతిపక్ష నేతలతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో ఆయన ఆదివారం రాత్రి ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బాగాలేవని ఖర్గేకు తెలిపినట్లు వెల్లడైంది.
తిరిగి ఇండియా ప్లకార్డులు
మోడీ మాట్లాడు అనే డిమాండ్లు
సోమవారం ఉభయసభలు ఆరంభం కాగానే నిరసనలు తరువాత వాయిదాలతో సాగకుండా నిలిచిపొయ్యాయి. ప్రతిపక్షాలు సభల్లో నినాదాలకు దిగుతూ చేతుల్లో ప్లకార్డులతో నిరసనలకు దిగారు. మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని మోడీ ఇకనైనా మాట్లాడాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. నినాదాలు ఇందుకు ప్రతిగా అధికార పక్ష సభ్యుల మండిపాట్లతో సభలలో గందరగోళం చెలరేగింది. చర్చకు ముందు ప్రధాని మోడీ మణిపూర్ విషయంపై మాట్లాడాల్సి ఉంటుందని రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. ఆయన ప్రకటనపై చర్చకు ప్రతిపక్షం సిద్ధమన్నారు. మణిపూర్‌పై వెలుపల మాట్లాడి లోపల కిమ్మనకుండా ఉండటం ప్రధాని బాధ్యతారాహిత్యం అన్నారు. మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత ప్రభుత్వంపై లేదా అని శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు.

అక్కడి పరిస్థితిపై ప్రధాని వద్ద జవాబు లేదా? అని సందేహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయలేదు? పరిస్థితిని అదుపు చేయలేని హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పడం దేనికి? అక్కడ మహిళలపై దారుణాలు జరుగుతూ ఉన్నా స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి అక్కడికి ఎందుకు వెళ్లలేదు? బాధితులను ఎందుకు పరామర్శించలేదు? అని విపక్షాలు నిలదీశాయి. బిజెపి నేత సుధాంశు త్రివేది స్పందిస్తూ రాజస్థాన్‌లో , బెంగాల్‌లో అత్యాచారాల గురించి విపక్షాలు మాట్లాడటం లేదెందుకు? అని ప్రశ్నించారు. చివరికి రాజస్థాన్‌లో కాంగ్రెస్ సిఎం తమ సొంత మంత్రి బాధను కూడా వినడం లేదని, పైగా మాట్లాడితే బర్తరఫ్ చేశారని ఇదేం న్యాయం అని చెప్పారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ మాట్లాడుతూ చర్చ నుంచి ప్రతిపక్షాలు సాకులతో తప్పించుకోవాలని చూస్తున్నాయని , ఇది పద్ధతి కాదన్నారు. మణిపూర్ విషయంపై ప్రధాని మోడీ సెషన్ ఆరంభంలోనే దీనిపై ప్రకటన వెలువరించారని, ఇది విశ్లేషణాత్మకంగా ఉందని, పరిస్థితిలోని సున్నితత్వాన్ని అర్థం చేసుకుని వెలువరించిన ధృఢచిత్తపు ప్రకటనను పట్టించుకోకపోతే ఎట్లా అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News