Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌కు దక్కిన ప్రతిపక్ష హోదా

- Advertisement -
- Advertisement -

మన లోక్‌సభలో 543 స్థానాలున్నాయి. అందులో కనీసం 55 సీట్లు గల పార్టీకి సభలో ప్రతిపక్ష హోదా లభిస్తుంది. అయితే గత పదేళ్ల బిజెపి పాలన ప్రతిపక్షం లేకుండానే గడిచింది. 2014 ఎన్నికల్లో రెండో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌కు 44, అదే పార్టీకి 2019లో కేవలం 52 స్థానాలు మాత్రమే వచ్చాయి. అందువల్ల ఈ పదేళ్ల కాలం బిజెపికి ఎదురు లేకుండా పోయిం ది. దాని ఫలితాన్ని దేశం అనుభవించింది. నోట్ల రద్దు, ఆర్టికల్ 370 తొలగింపు, పౌరసత్వ సవ రణ చట్టం, ట్రిపుల్ తలాక్, ఇడబ్ల్యుఎస్ కోటా ఆమోదం, జిఎస్‌టి.. ఇలా ఎన్నో బిల్లులు అడిగే వారు లేక బిజెపి సభ్యుల హర్షాతిరేకాలు, బల్లపై చరుపులతో ఆమోదం పొందాయి. ఈసారి కాంగ్రెస్‌కు 99 సీట్లు వచ్చినందు వల్ల ఆ పార్టీకి అధికారిక ప్రతిపక్ష హోదా లభిస్తుంది.

ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని మోడీ తనదైన ధోరణిలో తొణకకుండా గంభీరంగా మాట్లాడినా ఆ సమావేశంలో పాల్గొన్న భాజపా నేతల ముఖాల్లో తగ్గిన సీట్ల తాలూకు నిరాశా ఛాయలు స్పష్టంగా కనిపించాయి. భాజపా సీట్ల తగ్గుదలకు సరియైన కారణాలు మోడీ అంతరాత్మకు తెలిసినా వాటిని దాచిపెడుతూ తాను చేసిన అభివృద్ధికి, ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్‌డిఎ సీట్లు తగ్గడానికి ప్రజలపై ప్రభావం చూపిన మోడీ నిర్ణయాలనే ఉటంకిస్తూ, వాటిని సమర్థిస్తూ, వాటి వల్లే ప్రజలు తిరిగి పట్టంకట్టారని ఆయన సూత్రీకరించారు. నిజానికి మోడీకి గత రెండు లోక్ సభల ఎన్నికల్లో బాసటగా నిలిచిన ఉత్తరాది ఓటర్లు, ప్రత్యేకంగా యుపి, రాజస్థాన్ ప్రజలు ఆయనను నిరాకరించారు. అందుకు రకరకాల కారణాలున్నాయి.

గతంలో ఓట్లేసిన ప్రజలు ఈసారి మోడీ పట్ల వ్యతిరేకతను ప్రదర్శించినా.. దానిని పరిగణనలోకి తీసుకొని పునఃసమీక్ష చేసుకొనే దిశగా ఆ పార్టీ వెళ్ళదు. జనాన్ని బాధించిన అంశాలను వెనక్కి తీసుకోకుండా తిరిగి కొత్త మాయమాటలతో వారిని తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచనే దాని నైజం. కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో ఢిల్లీలో ఉద్యమించిన రైతులకు క్షమాపణలు చెప్పడం తప్ప మోడీ పదేళ్లలో ఎక్కడ వెనక్కి తగ్గలేదు. పంజాబ్, హర్యానా రైతుల ఇక్కట్లు, అగ్నివీర్ విధానం, మణిపూర్ మంటలు భాజపాకు ఓట్ల ద్వారా నిరసనను తెలిపాయి. రామమందిర నిర్మాణం దేశాన్ని ప్రభావితం చేస్తుందనుకుంటే అయోధ్యలోని భాజపా అభ్యర్థి ఓటమి పాలవడం మోడీకి షాక్ తగిలినట్లే. దేశ జనుల నాడి పూర్తిగా పట్టు దొరికినట్లు వ్యవహరించిన ఆయనకు కూడా తలకెక్కని దెబ్బఇది. మత ఛాందసాన్ని తెగేదాక లాగితే అసలుకే మోసమని గ్రహింపు వస్తే మంచిదే. కడుపులో చల్ల కదలకుండా బతికేవారికి మతం ప్రాణ సమానంగా అనిపిస్తుంది. కానీ రెక్కాడితే తప్ప డొక్క నిండనివారికి మతం కన్నా జీవితమే ముఖ్యం.

రెండు మార్లు నమ్మినవారు ఈసారి ఆయన్ని వద్దనుకున్నారు. దేశ ప్రజల బాగోగుల పట్ల నిజంగా బాధ్యత ఉంటే రాబోయే పాలన లో వాటి పట్ల నిర్ణయాలు మార్చుకోవాలి. 2014, 2019 ఎన్నికల్లో ఘన విజయాన్ని ఇచ్చిన ఓటర్లు ఈసారి ‘ఇండియా’ కూటమి వైపు ఎందుకు కొంత మొగ్గు చూపారో భాజపా ఆలోచించాలి. 2014లో 282, 2019 లో ఏకంగా 303 సీట్లు సాధించుకున్న బిజెపి ఈసారి 240 కే పరిమితమైంది. మిత్ర పక్షాలతో కలిస్తే తప్ప సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేని దుస్థితి. ‘ఓడి గెలిచిన మోడీ’ అని, ‘బచ్ గయా!’ అని పత్రికలు పతాక శీర్షికలు పెట్టేందుకు సాహసించాయంటే ఆ తలవంపు సామాన్యం కాదు. ఎందుకంటే ‘చార్ సౌ పార్’ అని, బిజెపి కనీసం 370 సాధిస్తుందని మోడీ వందల సభల్లో పునరుద్ఘాటించారు. విడతల వారీగా పోలింగ్ పూర్తవుతున్న కొద్దీ కొత్త విమర్శలను మొదలెట్టారు. ‘ఇండియా’ కూటమి గెలిచే సీట్ల సంఖ్యను అడ్డుకోవడానికి మతాన్ని పూర్తిగా వాడుకున్నారు. కాంగ్రెస్ గెలిస్తే మందిరం లోని రాముణ్ణి మళ్ళీ డేరాలోకి మార్చుతుందని అన్నారు. అయితే ఆయన అతివాద మత దృక్పథం నచ్చని ఓటర్లు మరింతగా వ్యతిరేకంగా వెళ్లారని ఫలితాలు చెబుతున్నాయి.

మిత్రపక్షాలు తోడు వచ్చినా, రాకున్నా సొంతంగా బిజెపికి ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం రావాలని మోడీ కోరుకున్నారు. ప్రజలందరికీ నచ్చినా, నచ్చకపోయినా తమ నిర్ణయాలు ఏకపక్షంగా పార్లమెంటులో ఆమోదం పొందాలని ఆశించారు. అయితే గత పదేళ్ల పాలనలో ప్రభుత్వ నిర్ణయాల వల్ల నష్టపోయిన వారు, వాటిని వ్యతిరేకించిన వాళ్లు ‘ఇండియా’ కూటమి వైపు వెళ్లారు. కేంద్రంలో బిజెపి వల్ల కష్టనష్టాలు ఎదుర్కొంటున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు కూటమిగా కాంగ్రెస్‌కు మద్దతు నిలవక తప్పని విపత్కరత ఏర్పడింది. ఇలా తన శత్రువులను పెంచుకొని మోడీ పాత ఓటర్లకు దూరమయ్యారు. ఇదంతా కాంగ్రెస్ కు కలిసిరావడం దేశానికి మేలు చేసిందనాలి. ఎందుకంటే పదేళ్ల అనంతరం లోక్‌సభలో ఒక పార్టీ ప్రతిపక్ష హోదాను అందుకుంది. లోక్‌సభలో ప్రతిపక్షంగా ఉండడానికి ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో ఉన్న పార్టీ కనీసం 10% సీట్లు గెలిచి ఉండాలి. మన లోక్‌సభలో 543 స్థానాలున్నాయి. అందులో కనీసం 55 సీట్లు గల పార్టీకి సభలో ప్రతిపక్ష హోదా లభిస్తుంది. అయితే గత పదేళ్ల బిజెపి పాలన ప్రతిపక్షం లేకుండానే గడిచింది. 2014 ఎన్నికల్లో రెండో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌కు 44, అదే పార్టీకి 2019లో కేవలం 52 స్థానాలు మాత్రమే వచ్చాయి.

అందువల్ల ఈ పదేళ్ల కాలం బిజెపికి ఎదురు లేకుండా పోయింది. దాని ఫలితాన్ని దేశం అనుభవించింది. నోట్ల రద్దు, ఆర్టికల్ 370 తొలగింపు, పౌరసత్వ సవరణ చట్టం, ట్రిపుల్ తలాక్, ఇడబ్ల్యుఎస్ కోటా ఆమోదం, జిఎస్‌టి.. ఇలా ఎన్నో బిల్లులు అడిగేవారు లేక బిజెపి సభ్యుల హర్షాతిరేకాలు, బల్లపై చరుపులతో ఆమోదం పొందాయి. ఈసారి కాంగ్రెస్‌కు 99 సీట్లు వచ్చినందు వల్ల ఆ పార్టీకి అధికారిక ప్రతిపక్ష హోదా లభిస్తుంది. దానికి చట్టబద్ధ అధికారాలు ఉంటాయి. రాబోయే లోక్‌సభలో అన్ని ప్రభుత్వ నిర్ణయాలపై చర్చకు ఆస్కారముంటుంది. భిన్న పార్టీల సభ్యులకు మాట్లాడేఅవకాశం లభిస్తుంది. ప్రశ్నించే గొంతులు పెరుగుతాయి.ఆ చర్చ రికార్డు అవుతుంది.

మీడియాలో ప్రాముఖ్యత పెరిగి విషయం ప్రజలదాక వెళుతుంది. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్ష నాయకుడి విశ్లేషణకు, వాదనకు గౌరవం, విలువ లభిస్తాయి. రెండు వందలకు పైగా ఉండే విపక్ష సభ్యుల గొంతు పార్లమెంట్ గోడలు కూడా దాటుతుంది. వాకౌట్ చేసిన, బహిష్కరణకు గురైన సంఖ్యాపరంగా దృశ్యం కంటికి అనేలా ఉంటుంది. ఆ ఖాళీతో సభ బోసిపోతుంది. ప్రభుత్వాన్ని చిక్కులు పెట్టేలా విషయం వార్తలకెక్కుతుంది. ప్రతి నిర్ణయానికీ ప్రభుత్వం ఇప్పటిలా కాకుండా ముందు వెనుకలు ఆలోచించుకోవాలి. 16 సీట్లున్న టిడిపి, 12 సీట్లున్న నితీశ్ జనతాదళ్ అన్ని విషయాల్లో ప్రభుత్వానికి తోడు రాక పోవచ్చు. బిల్లు పాసవడానికి, మెజారిటీకి 33 సీట్లు తక్కువున్న బిజెపి గతంలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. మోడీ గ్రహపాటో, సామాన్యుల విజ్ఞతనో గాని మ్యాజిక్ నెంబర్ కు బిజెపి దూరమవడం వల్ల దేశానికి ఎంతో మేలు జరిగినట్లే.

క్రితం మాదిరిగా నచ్చనివారిపై ఐటి, ఇడి, సిబిఐ దాడులు చేయించేందుకు మోడీ సాహసించకపోవచ్చు. అంతేకాకుండా ఆ శాఖల్లోని అధికారులు కూడా ప్రతిపక్ష సభ్యుల సంఖ్యను, వారి విమర్శను పట్టించుకోక తప్పదు. 2 వందలకు పైగా ఉన్న విపక్షాల సభ్యుల బలం కూడా తక్కువ కాదు. అడిగేవాళ్ళున్నారన్న స్పృహతో అన్ని శాఖల అధికారులు జాగ్రత్తగా వ్యవహరిస్తారు.దేశంలో కొంతైన ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడుతుంది. మతప్రాతిపదికన ప్రజలు రెండుగా, మూడుగా చీలిపోయే ప్రమాదం నుండి ఓటర్లు ఈ ఎన్నికల ద్వారా దేశాన్ని రక్షించారని అనుకోవాలి. ఇక మోడీ నిన్న, మొన్నటి మోడీ కాదు. రాహుల్ కూడా గతకాలపు అయోమయ నేత కాదు. కాలం వీరిద్దరికీ పాఠాలు నేర్పింది. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచింది. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ తన సమర్థతను నిరూపించుకుంటే మనోవాంఛ సిద్ధించే అవకాశం లేకపోలేదు.

బి.నర్సన్ 9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News