Thursday, January 23, 2025

నితీశ్ ఆరాటానికి ఆటంకాలు!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: లోక్‌సభ ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో అందరినీ కూడగట్టి ప్రతిపక్ష ఐక్యతను సాధించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పట్టువదలకుండా చేస్తున్న కృషికి అడ్డంకులు ఎదురు కావడం ఆశ్చర్యపోవలసిన విషయం కానే కాదు. కుక్కతోక వంకర వంటి ఈ ఐక్యతను ఎలాగైనా సాధించే సంకల్పంతో నితీశ్ కుమార్ ఇంత వరకు చేసిందల్లా వివిధ ప్రతిపక్షాల కార్యాలయాలకు వెళ్ళి వాటి నాయకులతో ప్రాథమిక స్థాయి చర్చలు జరపడమే. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీని, ఆప్ సారథి కేజ్రీవాల్ వంటి వారిని కలుసుకొన్నారు. ప్రతిపక్షాన్ని ఐక్యం చేయదలచడంలో తన స్వార్థమేమీ లేదని, తాను భావి ప్రధాని కావాలని కోరుకోడం లేదని ఆయన ముందే ప్రకటించారు.

Also Read: బిసి కులవృత్తులకు లక్ష ఆర్థిక సాయం

2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులపై దేశమంతటా ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికకు గురి కాకుండా చూడడమే తన ఉద్దేశమని కూడా చెప్పుకొన్నారు. ఆయన వ్యూహం ప్రకారం ఈ నెల 12న ప్రతిపక్ష నేతల సమావేశం పాట్నాలో జరిగి వుండవలసింది. కాని దానిని వాయిదా వేస్తున్నట్టు సోమవారం నాడు నితీశ్ ప్రకటించారు. జూన్ 12న నితీశ్ పాట్నాలో జరపడానికి తలపెట్టిన భావ సారూప్యం గల పార్టీల కీలక సమావేశానికి తాము హాజరు అవుతామని, అయితే తమ పార్టీ తరపున ఎవరిని పంపించాలనే అంశంపై నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ సమాచార వ్యవహారాల ఇన్‌ఛార్జి జయరామ్ రమేశ్ ప్రకటించి వున్నారు.

కాని రాహుల్ గాంధీ గాని, మల్లికార్జున్ ఖర్గే గాని ఈ సభకు హాజరయ్యే అవకాశాలు లేవని కాంగ్రెస్ పార్టీ నితీశ్‌కు తెలియజేసినట్టు తెలుస్తున్నది. అలాగే పాట్నా సభకు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ హాజరు కాలేరని డిఎంకె వర్తమానం పంపించినట్టు సమాచారం. దీనితో 12న తలపెట్టిన పాట్నా సభను నితీశ్ వాయిదా వేసుకొన్నారు. ఈ నెలాఖరున ఆ సభను జరిపించాలని ఆయన నిర్ణయించుకొన్నట్టు తెలుస్తున్నది. అప్పటికి తాను కోరుకొంటున్నట్టు వివిధ ప్రతిపక్షాల అగ్ర నేతలు వీలు చేసుకొని ఆ సభకు హాజరు కాగలరని నితీశ్ భావిస్తున్నట్టు అర్థమవుతున్నది. ఆయా పార్టీల రెండవ స్థాయి, మూడో స్థాయి నాయకులు కాకుండా అగ్ర నేతలే ఈ సభకు హాజరు కావాలని నితీశ్ కోరుకొంటున్నారు. నితీశ్‌తో ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కలిసి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేని, మమతా బెనర్జీని, శరద్ పవార్‌ను కలుసుకొన్నారు. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కూడా భేటీ అయ్యారు.

కాని ఆయన నితీశ్ ప్రయత్నాలతో కలిసి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. బిజెపి చేస్తున్నది ఏ ఒక్కటీ దేశ క్షేమం కోసం ఉద్దేశించినది కాదని, ఎన్ని ప్రతిపక్షాలు కలిసి వస్తే దేశానికి అంత మంచి జరుగుతుందని, తాము అనేక పార్టీల నేతలతో మాట్లాడామని శరద కలుసుకొన్న తర్వాత నితీశ్ కుమార్ ప్రకటించారు. శరద్ పవార్ కూడా ప్రతిపక్ష ఐక్యత కోసం గతంలో ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మమతా బెనర్జీ ప్రోత్సాహంతో ఆయన అప్పట్లో ఈ కృషి కొంత వరకు జరిపారు. జాతీయ స్థాయిలో భుజాలు కలిపినా రాష్ట్రాల్లో ఈ పార్టీల మధ్య రాజకీయ వైరుధ్యాలు వున్న మాట వాస్తవం. వాటిని పరిష్కరించుకోకుండా జాతీయ స్థాయిలో మమేకం కావడం సాధ్యమయ్యే పని కాదు. వాస్తవానికి పాట్నాలో జరపదలచుకొన్న సమావేశంలో ఈ విషయంపైనే చర్చ కేంద్రీకరించాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీతో వివిధ ప్రతిపక్షాలకు ఏకీభావం కుదిరే అవకాశాలు బహు తక్కువ. కొన్ని రాష్ట్రాల్లో అది సాటి ప్రతిపక్షాలను ఎదుర్కోవలసి వుంటుంది. కాంగ్రెస్ లేకుండా మిగతా ప్రతిపక్షాలన్నీ ఒక్క త్రాటి మీదికి వస్తే ఎలా వుంటుందనే అంశం మీద కూడా చర్చ చాలానే జరిగింది. అది ఆశించిన ప్రయోజనం కలిగించబోదనే భయాలున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో వున్నా లేకపోయినా ఎక్కువ రాష్ట్రాల్లో ఉనికిని కలిగి వుంది. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఒంటరిగానే బిజెపితో పోరాడి కేంద్రంలో మళ్ళీ ఏకైక అధికార పక్షంగా చక్రం తిప్పుదామనే కోరిక దానిలో లేకపోలేదు. మొన్నటి కర్ణాటక విజయం తర్వాత అది ఇంకా పెరగి వుండవచ్చు. కాని మతతత్వ బలంతో ఉత్తరాదిలో బాగా వేళ్ళూనుకొన్న బిజెపిని కాంగ్రెస్ ఒంటరిగా ఓడించడం తేలిక కాదు. అందుచేత ఐక్య ప్రతిపక్షంతో కలిసి అడుగులు వేయక తప్పని పరిస్థితిలో అది వుంది. చివరికి బిజెపి వ్యతిరేక ప్రతిపక్ష కూటమి ఏ రూపు తీసుకొంటుందో ఇప్పటికైతే ఊహకు అతీతమైన విషయమే. కాని భారతీయ జనతా పార్టీ సెక్యులర్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక విలువలను బలి తీసుకొంటున్న తీరును గమనిస్తే దానిని మట్టి కరిపించే దిశగా ప్రతిపక్షాల మధ్య ఏ మేరకు అవగాహన కుదిరినా అది హర్షించదగినదే అనిపించడం ఆక్షేపించదగినది కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News