ప్రతిపక్షం మరిన్ని సీట్లు కోల్పోవడం కాయం
భద్రతా వైఫల్యం ఘటనకు ప్రతిపక్షాల పరోక్ష మద్దతు
అసెంబ్లీ ఎన్నికల ఓటమితో నిస్పృహలో ప్రతిపక్షం
పార్లమెంట్‌లో జరిగిన ఘటనను ఎవరూ మన్నించరు
భద్రతా వైఫల్య ఘటనను అందరూ ఖండించాల్సిందే
బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో జరిగిన భద్రతా వైఫల్య ఘటనకు ప్రతిపక్షాలు మౌనంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన కారణంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో వారి సంఖ్య మరింత తగ్గిపోయి ప్రతిపక్ష సభ్యులు ప్రతిపక్షంలోనే ఉండిపోతారని ప్రధాని జోస్యం చెప్పారు. ఈ ఏడాదికి చివరి బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంగా చెబుతున్న సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తూ 2024 లోక్‌సభ ఎన్నికలకు బిజెపి ప్రధాన ప్రచార అస్త్రాన్ని పరోక్షంగా బయటపెట్టారు.
మంగళవారం ఢిల్లీలో సమావేశమైన ప్రతిపక్ష ఇండియా కూటమిపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కల్పించిన ప్రతిపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో నిస్పృహకు గురైన ప్రతిపక్షాలు పార్లమెంట్ అంశాన్ని తమ రాజకీయ అస్త్రంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టడమే వారి(ప్రతిపక్షాలు) లక్షమని, కాని భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడమే తన ప్రభుత్వ లక్షమని మోడీ ప్రకటించారు. బిజెపిని అధికారం నుంచి దించడమే లక్షంగా కొందరు వ్యక్తులు చేతులు కలుపుతున్నారు.
అయితే దేశభక్తులమైన మేము మాత్రం భారత్ పురోభివృద్ధి కోసం పనిచేస్తున్నాము. ప్రభుత్వాన్ని తొలగించేందుకు వారు తమ బలాన్ని ఉపయోగిస్తున్నారు. కాని భారత్ అభ్యున్నతి కోసం మా బలాన్ని ఉపయోఇస్తున్నాము అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో వారి ప్రవర్తన కారణంగా 2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్ష సభ్యుల సంఖ్య మరింత క్షీణిస్తుందని, బిజెపి బలం మరింత పెరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఆడిటోరియంలో బిజెపి ఎంపీలు కూర్చున్న సీట్ల పక్కన ఖాళీగా ఉన్న సీట్లను చూపిస్తూ 2024 ఎన్నికల తర్వాత ఈ సీట్లన్నీ బిజెపి సభ్యులతో నిండిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఆ చర్యను ఎవరూ ఆమోదించరు
డిసెంబర్ 13న లోక్‌సభలోని విజిటర్స్ గ్యాలరీ నుంచి సభ్యుల ఛాంబర్‌పైకి దూకిన ఇద్దరు వ్యక్తులు స్మోక్ బాంబులను ప్రయోగించిన ఘటనను ప్రధాని మోడీ ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్న వారెవరూ ఈ చర్యను ఆమోదించబోరని స్పష్టం చేశారు. ఈ చర్చను మనమంతా సమైక్యంగా ఖండించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రతిపక్షం తన నిస్పృహనంతా పార్లమెంట్‌లో బయటపెట్టుకుంటోందని, మొత్తం ఘటనకు రాజకీయ రంగు పులుముతోందని మోడీ విమర్శించారు. ఈ ఘటనకు ప్రతిపక్షాలు మౌనంగా, పరోక్షంగా మద్దతు ఇవ్వడం ఆందోళనకరమని ఆయన అన్నారు. ఇది ఖండించాల్సిన విషయమని ఆయన అన్నారు. ప్రతిపక్షంలోనే కొనసాగాలని వారంతా నిర్ణయించుకున్నట్లు వారి వ్యవహార శైలిని బట్టి అర్థమవుతోందని, అందుకోసమే ప్రాక్టీసు చేస్తున్నట్లు కనపడుతోందని ప్రధాని వ్యంగ్య బాణాలు రువ్వారు.
బిజెపి ఎంపీలంతా సంయమనం పాటించాలని, ప్రజాస్వామిక సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు. మన నాలుకను అదుపులో పెట్టుకుని, ప్రజాస్వామ్య నిబంధనలకు లోబడి ఉండి ప్రతిపక్షాల దుర్నీతిని ఎండగట్టాలని ఆయన బిజెపి ఎంపీలకు పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ఇతరులు పాల్గొన్నా పాల్గొనకపోయినా మనం మాత్రం పార్లమెంట్ సమావేశాలలో పాల్గొనాలని, కొన్ని ముఖ్యమైన బిల్లులు ఉభయ సభలలో చర్చకు రానున్నాయని ప్రధాని గుర్తు చేశారు. ఈ చర్చలలో ప్రతిపక్షాలు పాల్గొని ఉంటే బాగుండేదని, కాని మంచి పనులు చేయడం వారి తలరాతలో లేదని ఆయన ఎద్దేవా చేశారు.
మొదటిసారి ఓటర్లకు వివరించండి
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న ఓటర్లకు దేశంలో పదేళ్ల క్రితం పరిస్థితి ఎలాగుండేదో వివరించాలని ప్రధాని మోడీ బిజెపి ఎంపీలకు సూచించారు. 18 సంవత్సరాల వయసు ఉన్న యువజనులకు తన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు పెరుగుతున్న ఖ్యాతి గురించి మాత్రమే తెలుసునని, దశాబ్ద క్రితం దేశంలో ఉన్న అవినీతి, దుష్పరిపాలన గురించి తెలిసి ఉండదని ఆయన అన్నారు. జనవరి 25న పాటించే జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు ఈ అంశంతో ప్రచారం నిర్వహించవచ్చునని ఆయన సూచించారు. సరిహద్దు గ్రామాలను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి దాన్ని ప్రజలకు వివరించాలని ఆయన ఎంపీలకు సూచించారు.
సరిహద్దు గ్రామాల అభివృద్ధికి గుజరాత్‌లోని ధోర్డో ఆదర్శ గ్రామమని, ఇటీవలే ఉత్తమ పర్యాటక గమ్యస్థానంగా ఐక్యరాజ్యసమితి గుర్తింపును ఆ గ్రామం దక్కించుకుందని ప్రధాని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రతివారం జరిగే బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తాను ఎన్నడూ గైర్హాజరు కాలేదని, అందులో పాల్గొనడం తనకు ఎంతో సంతృప్తికరంగా ఉంటుందని ప్రధాని అన్నారు. ఈరోజుకు కూడా బిజెపి కార్యకర్త తనలో సజీవంగా ఉండడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 22న ముగియనున్నాయి.