Wednesday, January 22, 2025

లేఖాస్త్రం

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీ దేశాధికారాన్ని చేపట్టి తొమ్మిదేళ్ళు పూర్తి కావస్తున్నది. మొదటి నుంచి దానిది నిరంకుశ పోకడేనని చెప్పడానికి లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. అటు సామాజికంగా మెజారిటీ మతస్థుల్లో పరమత ద్వేషాన్ని ఉన్మాద స్థాయికి రెచ్చగొట్టి మైనారిటీలపై దాడులకు ఉసిగొల్పడం ఈ నిరంకుశత్వానికి ఒక చెంప కాగా, రాష్ట్రాల్లో ప్రజల మద్దతుతో అధికారాన్ని పొంది జనహిత పాలన అందిస్తున్న ప్రతిపక్షాలను నానా ఇబ్బందులకు, అప్రతిష్ఠకు గురి చేసి అంతమొందించే ప్రయత్నం చేయడం దీనికి రెండో పార్శం. అయినా ఇంత వరకు భరిస్తూ, సహిస్తూ వచ్చిన ప్రతిపక్షాలు ఇంత కాలానికి సంఘటిత సంతకంతో ప్రధాని మోడీకి లేఖ రాయడం ఆయన తన వైఖరిని మార్చుకుంటారనే ఆశతో కానేకాదు.75 ఏళ్ళ పరిణత ప్రజాస్వామ్య దేశంలో ప్రజల్లో బలంగా నాటుకొన్న రాజ్యాంగ చైతన్యాన్ని ఉద్దేశించి రాసిందే ఈ లేఖ అని భావించక తప్పదు. భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సహా తొమ్మిది మంది బలమైన విపక్ష నేతలు ఈ లేఖను సంధించారు.

ఇందుకు తక్షణ ప్రేరణ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను లిక్కర్ కుంభకోణం పేరిట సిబిఐ అరెస్టు చేయడం కాగా, తరచూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని ఆ పార్టీల నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల చేత దాడులు, సోదాలు జరిపించడం, గవర్నర్లను కేంద్రం తన చెప్పుచేతల్లో వుంచుకొని బిజెపియేతర ముఖ్యమంత్రులను వేధించే పనికి ఉపయోగించుకోడం వంటి నిరంకుశ ధోరణులే అసలు కారణమని స్పష్టపడుతున్నది. ఎంతో సహనంతో రాసిన ఈ లేఖలో కేంద్రం తీసుకుంటున్న ఇటువంటి చర్యల కారణంగా దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు మళ్ళినట్టు బోధపడుతున్నదని వీరు ప్రధాని దృష్టికి తెచ్చారు. భారత దేశం ఇంకా ప్రజాస్వామ్య దేశంగానే కొనసాగుతున్నదని మీరు అంగీకరిస్తారనుకుంటాం అని ప్రధానిని ఉద్దేశించి ఈ నేతలు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని దేశ ప్రజల్లోని ప్రజాస్వామిక దృక్పథాన్ని, అవగాహనను, చైతన్యాన్ని నీరుగారడం మీకు సాధ్యం కాదని ఆయనకు దృఢ స్వరంతో తెలియజేయడంగానే పరిగణించాలి.

అయితే ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రతిపక్ష నేతల మీదికి కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న తీరు చూస్తుంటే మన ప్రస్థానం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు అడుగులు వేస్తున్నదేమోననే అభిప్రాయం కలుగుతున్నదని ప్రధాని దృష్టికి ఇంత మంది నాయకులు తీసుకు వెళ్ళడం విశేషం. ఆదివారం నాడు ఈ మూడు పేజీల లేఖపై సంతకాలు చేసిన వారిలో దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు పలువురు ప్రధాన విపక్ష నేతలున్నారు. కెసిఆర్‌తో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, శివసేన (బాలా సాహెబ్ ఠాక్రే) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వున్నారు. దేశానికి నాయకత్వం వహించడంలో జాతీయ పార్టీలు బలహీనపడిపోయి వాటి స్థానంలో బలమైన ప్రాంతీయ పక్షాలు పుంజుకోడం ప్రారంభమై చాలా కాలమైంది.

అవి భవిష్యత్ జాతీయ రాజకీయాలను శాసించే బలాన్ని చేకూర్చుకొన్నాయి. ఈ శక్తులు లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు రాసిన ఈ లేఖకు విశేష ప్రాధాన్యముంది. బిజెపి పాలనలో రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిపోతున్నదో ఇటీవల ఎన్నికల సంఘం వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెల్లడి చేసింది. వెన్నెముక లేని వ్యక్తులు సిఇసిలుగా నియమితులయితే ప్రజాస్వామ్యానికి ఎటువంటి ఉపద్రవం కలుగుతుందో ఐదుగురు సభ్యుల ధర్మాసనం సునిశిత వ్యాఖ్యలతో వివరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలోని రాజీ ఎరుగని విపక్ష నేతల పట్ల ఒక విధంగానూ, బిజెపికి దాసోహమైపోయి అందులో చేరిపోయిన నాయకుల పట్ల మరో విధంగానూ వ్యవహరిస్తున్న తీరును ఈ లేఖ ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లింది.

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బిజెపిలో చేరిన తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత సువేందు అధికారి వంటి వారిపై గల కేసులకు నత్త నడక నేర్పుతూ ప్రతిపక్ష నేతలపై ఎన్నికల సమయంలో ఇడి, సిబిఐ దాడులను ముమ్మరంగా జరిపించడాన్ని ఎత్తి చూపింది. ఇవన్నీ బహిరంగ రహస్యాలే. తమది పచ్చి నిరంకుశత్వమని , ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలకు విరుద్ధమని కేంద్రంలోని బిజెపి పాలకులు బాహాటంగానే చాటుకొంటున్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులపై గవర్నర్లను అడ్డంగా ఉసిగొల్పడం ద్వారా సమాఖ్య వ్యవస్థ నియమాలను నిలువెత్తున పాతిపెడుతున్నారు. ప్రతిపక్ష నేతలు ఎంతో సంయమనంతో రాసిన ఈ లేఖను దేశ ప్రజలు గమనిస్తారని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News