ముంబై/ సిమ్లా : రుతుపవనాల ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో గత సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం వరకు ముంబై సహా శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ముంబైకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ముంబైలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. స్థానిక రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబై సహా ఠాణే , పాల్ఘర్ జిల్లాలను కూడా వర్షాలు ముంచెత్తాయి. ఠాణేలో ఒక వ్యక్తి గుంత కారణంగా కింద పడడంతో అదే సమయంలో బస్సు వచ్చి అతనిపై నుంచి వెళ్లి పోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.
హిమాచల్ ప్రదేశ్‌లో ఆరుగురు గల్లంతు
హిమాచల్ ప్రదేశ్‌లో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కులూ జిల్లాలో అకస్మాత్తుగా వరదలు ముంచెత్తాయి. దీంతో అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వరద ఉధ్ధృతిలో ఆరుగురు కొట్టుకు పోయినట్టు అధికారులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నారు. జిల్లా లోని మలానా, మణికరణ్ గ్రామాలకు మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. సిమ్లా లోని థల్లీ టన్నెల్ వద్ద కొండచరియలు విరిగిపడి ఓ మహిళ మృతి చెందారు. అటు బీహార్ లోనూ భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.