మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఔషద చట్టం 1945 అమలుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ప్రజారోగ్యంలో కీలకపాత్ర పోషించే ఔషదాలను ప్రజలకు అందించే ఫార్మసిస్టులకు తగిన గుర్తింపు లభించనుంది. మెడికల్ దుకాణాలలో ఫార్మసిస్టుల ద్వారానే ప్రజలకు ఔషదాలను అందించడానికి ఔషద చట్టం 1945, సెక్షన్ 65(2)ను కచ్చితంగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా తక్షణమే ఫార్మసీ ఇన్‌స్పెక్షర్‌ను నియమించి ఫార్మసీ యాక్ట్ 1948, సెక్షన్ 42ను అమలు చేయాలి.ఈ చట్టం ప్రకారం అర్హతలేని వారు ప్రజలకు మందులు ఇస్తే 6 నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
ప్రక్షాళన చేయాలి: ఆకుల సంజయ్ రెడ్డి, ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడు
రాష్ట్రంలో మందుల పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు ఆకుల సంజయ్ రెడ్డి అన్నారు. ఔషద చట్టం 1945 అమలు ద్వారా అర్హులైన ఫార్మసిస్టులకు ఉద్యోగ అవకాశాలు లభిచండంతో పాటు ప్రజారోగ్యం కూడా బాగుంటుందని తెలిపారు. ప్రజలు నాణ్యమైన ఔషదాలను ఫార్మసిస్టుల ద్వారానే తీసుకోవాలని సూచించారు. మెడికల్ షాపులలో మందులు ఇచ్చే వ్యక్తి ఫార్మసిస్టేనా…? కాదా..? అని తెలుసుకోవాలని తెలిపారు. ఔషదాలకు సంబంధించిన సందేహాలను ఫార్మసిస్టుల ద్వారా ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. ఫార్మసీ పరిజ్ఞానం లేని వ్యక్తులు ద్వారా ప్రజలు మందులు తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు సంబంధించి కిడ్నీలు, లివర్ పాడయ్యే అవకాశాలు ఉంటాయని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఫార్మసిస్టుల ద్వారానే మందులు తీసుకోవాలని సూచించారు.