తమిళనాడు ప్రభుత్వం వెల్లడి
చెన్నై: రాష్ట్రంలో ఆన్‌లైన్ రమ్మీని నియంత్రించడానికి త్వరలోనే ఒక ఆర్డినెన్సును జారీచేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ వ్యవహారాన్ని పరిశీలించిరెండు వారాలలో తగిన సిఫార్సులు చేసేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి సారథ్యంలో ఒక కమిటీని నియమించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆన్‌లైన్ రమ్మీ గేమ్ ఆడి డబ్బులు కోల్పోయి కొందరు వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు మద్రాసు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె చంద్రు నేతృత్వంలో ఒక కమిటీని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఏర్పాటు చేశారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్‌లైన్ రమ్మీతో ఏర్పడుతున్న ఆర్థిక నష్టాలు, పర్యవసానంగా ఆత్మహత్యలు జరిగే పరిస్థితులు ఏర్పడడం వంటి అంశాలతోపాటు ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌ను ప్రోత్సహించే విధంగా వేస్తున్న అడ్వర్టయిజ్‌మెంట్ల వల్ల సమాజంపై పడుతున్న ప్రభావం తదితర అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. కమిటీ నివేదిక ఆధారంగా ఈ సామాజిక సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనేందుకు వీలుగా త్వరలోనే ఒక ఆర్డినెన్సును జారీచేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.