న్యూఢిల్లీ : ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై ఆరు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి సమాచారాన్ని తొలగించడానికి ముందు వాటిని రూపొందించిన కంటెంట్ క్రియేటర్లకు నోటీసు ఇవ్వాలని సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ అనే సంస్థ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఇందిరాజైసింగ్ వాదనలు వినిపిస్తూ , సామాజిక మాధ్యమాల నుంచి సమాచారాన్ని తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ఆ పోస్టు చేసిన వ్యక్తికి నోటీసులివ్వాల్ని అవసరం ఉందని అన్నారు.
అలా చేయకపోవడం సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించడమే అని ఆమె వాదించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ ప్రముఖ వ్యక్తులు ఎవరైనా సోషల్ మీడియాల్లో ఏదైనా సమాచారాన్ని పోస్ట్ చేస్తే, దానిని తొలగించే ముందు వారికి నోటీసులు జారీ చేసి , వాదనలు వినాల్సిందిగా భావిస్తున్నట్టు వెల్లడించింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ , ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.