Thursday, January 23, 2025

ఓఆర్‌ఆర్ టు ఆర్‌ఆర్‌ఆర్ అనుసంధానం చేసేలా

- Advertisement -
- Advertisement -

regional ring road mapఅంతర్గత రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు
ఔటర్, రీజనల్ రింగ్‌రోడ్డుకు మధ్య
జాతీయ, రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు
గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో క్షేత్రస్థాయిలోకి అధికారులు
ఈనెల రెండోవారంలో సర్వేనెంబర్‌ల వారీగా నోటిఫికేషన్ విడుదల

ORR link to RRR

మనతెలంగాణ/హైదరాబాద్:  ఆర్‌ఆర్‌ఆర్ (రీజనల్ రింగ్‌రోడ్డు) భూసేకరణ అధికారుల నియామకానికి ఆమోదముద్ర వేయటంతో ఆయా అధికారులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే ప్రాంతీయ రింగ్ రోడ్డు కన్సల్టెన్సీ సంస్థ రోడ్డు వెళ్లే గ్రామాల మీదుగా గుర్తులు ఏర్పాటు చేసింది. భూసేకరణ అధికారులు గ్రామాల వారీగా రహదారి వెళ్లే భూమిని గుర్తించి భూముల యజమానులకు నోటీసులు జారీ చేయనున్నారు. 21 రోజుల పాటు దీనికి సంబంధించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తరువాత భూసేకరణ ప్రక్రియను చేపడతారు. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు సుమారు 4 నుంచి 5 నెలల వ్యవధి పడుతుంది. భూసేకరణ ప్రక్రియ కొలిక్కివచ్చిన తరవాత రహదారి నిర్మాణానికి వీలుగా టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించనుంది.

19 మండలాలు…113 గ్రామాలు

రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తరభాగం నిర్మాణం కోసం ప్రాథమిక గెజిట్ (a)ను సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయగా, మరో వారంలో రెండో గెజిట్(A) విడుదల కానుంది. మొదటి గెజిట్‌లో భూసేకరణ అధికారులు, రింగ్‌రోడ్డు వెళ్లే జిల్లాలు, మండలాలు, గ్రామాల వివరాలను తెలియజేశారు. రెండో గెజిట్‌లో గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలను తెలియజేస్తారు. ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగంలో నిర్మించే ఈ రోడ్డు 158 కిలోమీటర్లు ఉంటుంది. యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 19 మండలాలకు చెందిన 113 గ్రామాల మీదుగా రీజనల్ రింగ్ రోడు ఉత్తర భాగం నిర్మాణమవుతుంది. భూ సేకరణ అధికారులుగా ఏడుగురు ఆరీఓలు, ఒక అడిషనల్ కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నియమించగా దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది.

అదనంగా రేడియల్ రోడ్ల నిర్మాణం

బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్), ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్)ను అనుసంధానం చేసేందుకు అంతర్గత మార్గాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రస్తుతం నగరం నుంచి ఔటర్ రింగ్‌రోడ్డుకు చేరుకున్న వారు అక్కడ నుంచి ప్రతిపాదిత ఆర్‌ఆర్‌ఆర్‌కు రావాలంటే కొన్ని ప్రాంతాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారులపై నుంచి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి ప్రాంతీయ రింగ్‌రోడ్డును అనుసంధానం చేయడం ద్వారా ట్రాఫిక్ సాఫీగా సాగేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రహదారులపై ఇప్పటికే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఏ) ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం నగరానికి ఔటర్‌కు మధ్య ఉన్న కొన్ని రేడియల్ రోడ్లను ఔటర్ రింగ్‌రోడ్డుతో ఆపకుండా అక్కడ నుంచి రీజనల్ రింగ్‌రోడ్డు వరకు పొడిగించాలని ఒక ప్రణాళిక రూపొందిస్తోంది. అలాగే ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ కొన్ని పట్టణాలు, కీలక ప్రాంతాలు ఉన్నాయి. వీటినే అర్భన్ నోడ్‌లుగా వ్యవహారిస్తున్నారు. వీటిని కలుపుతూ ప్రాంతీయ రింగ్‌రోడ్డు వరకు కూడా రహదారులను కొనసాగించనున్నారు. ఇలా మొత్తం 25 రహదారులను కొత్తగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఔటర్, రీజనల్ రింగ్‌రోడ్డుకు మధ్య కొన్ని జాతీయ, రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడంతోపాటు కొత్తవి కూడా నిర్మించనున్నారు. 450 కిలోమీటర్ల విస్తీర్ణంలో వీటిని నిర్మించటానికి ప్రాథమికంగా కసరత్తు జరుగుతోంది. వీటిని కనీసం 4 లైన్లుగా అభివృద్ధి చేయనున్నారు.

కొత్త రహదారులు కలిపే కీలక ప్రాంతాలు…

కొత్త రహదారులు కలిపే కీలక ప్రాంతాలు వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖ్‌నగర్, దౌడుగూడ, గుండేలగూడ, రాచలూరు, ఇబ్రహీంపట్నం, బీబీనగర్, బొమ్మలరామారం, ములుగు, వర్గల్, తూప్రాన్, దొంతి, శివ్వంపేట, నర్సాపూర్, దౌల్తాబాద్, ఇస్మాయిఖాన్‌పేట, ఎదుమైలారం, శంకర్‌పల్లి, చేవేళ్ల, తడ్లపల్లె, ఫరూఖ్‌నగర్, షాబాద్, చేవేళ్ల, సంగారెడ్డి, జీడిపల్లె, తూప్రాన్, బీబీనగర్, భువనగిరి, మల్కాపూర్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, గుండేలగూడ తదితర ప్రాంతాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News