మెల్‌బోర్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నుంచి జపాన్ స్టార్ నవొమీ ఒసాకా, అమెరికా నల్లకలువ వీనస్ విలియమ్స్ దూరమయ్యారు. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్ మరో వారంరోజుల్లో ప్రారంభంకానుంది. ఈక్రమంలో మెగాటోర్నీకి నవోమీ ఒసాకా దూరమైందని ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే ఒసాకా టోర్నీ నుంచి ఎందుకు వైదొలిగిందనేది తెలపలేదు. యూఎస్ ఓపెన్ ఛాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ కుడికాలి సమస్యతో టోర్నీనుంచి వైదొలుగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. కార్లోస్ బాటలో ఒసాకా మెగా టోర్నీకి దూరమైంది. వెటరన్ అమెరికన్ స్టార్ క్రీడాకారిణి విలియమ్స్ గతవారం ఆక్లాండ్ క్లాసిక్‌లో ఆడుతూ గాయపడింది. గాయం నుంచి కోలుకోకపోవడంతో టోర్నీకి దూరమైంది.
కాగా 2021లో ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచిన ఒసాకా సెప్టెంబర్‌లో కడుపునొప్పి కారణంగా టోక్యో టోర్నీ నుంచి వైదొలిగింది. అనంతరం మరో మ్యాచ్ ఆడకపోవడంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌ల్లో 42వ స్థానానికి పడిపోయింది. నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ విన్నర్‌గా నిలిచిన ఒసాకా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు గతంలో తెలిపింది. 2022లో ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్‌లో మొదటిరౌండులోనే వెనుదిరిగింది. గాయంతో వింబుల్డన్‌కు దూరమైంది. మరోవైపు ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత వీనస్ విలియమ్స్ కూడా గాయంతో ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమైంది.
గతవారం న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ టోర్నీలో ఓపెనింగ్ రౌండులో అదరగొట్టిన వీనస్ సహచర అమెరికా క్రీడాకారిణి వొలినెట్స్‌పై అద్భుత విజయం సాధించింది. హూకమంలో గాయపడటంతో ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి వీనస్ (42) తప్పుకున్నట్లు నిర్వాహకులు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆస్ట్రేలియా ఓపెన్ జనవరి 16నుంచి మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభంకానుంది.