Thursday, January 23, 2025

విశ్వవేదికపై వీరనాటు

- Advertisement -
- Advertisement -

విశ్వవేదికపై మరోసారి భారతీయ సినీ పతాక రెపరెపలాడింది. ఈ సారి తెలుగు జెండా సగర్వంగా ఎగిరింది. సినీ ప్రపంచం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాల వేడుకల్లో తెలుగు మట్టి పరిమళాలు గుప్పుమన్నాయి. సోమవారం ఉదయాన్నే అట్టహాసంగా ప్రారంభమైన 95వ అకాడమీ అవార్డుల వేడుకవైపు యావత్ భారతావని ఉత్కంఠ.. ఉద్విగ్నతల నడుమ చూస్తుండగానే ‘నాటు’ కొట్టుడు దెబ్బకు పోటీలో నిలిచిన మిగతా నాలుగు పాటలు వెనక్కి వెళ్లాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఉత్తమ పాటగా దేశం గర్వించదగ్గ దర్శకుడు.. అంతా జక్కన్నగా పిలుచుకునే రాజమౌళి నాయకత్వంలో రూపుదిద్దుకున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పేరును నిర్వాహకులు ప్రకటించారు. ఆ వెంటనే లాస్‌ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్ కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. చిత్ర బృందం సంబురాలు అంబరాన్నంటాయి. పరోక్షంగా టీవీల్లో వీక్షిస్తున్న కోట్లాది భారతీయుల గుండెలు ఉప్పొంగిపోయాయి.

నాటు నాటు పాటకు సంగీత దర్శకత్వం వహించిన ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ భుజంభుజం కలిపి వేదికనెక్కి పురస్కారాలను అందుకున్నారు. అంతకుముందు ఆస్కార్ అవార్డుల వేదికపై నాటు నాటు పాటను లైవ్ ఫెర్ఫార్మెన్స్‌లో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి ఆలపిస్తుండగా.. హాలీవుడ్ నటులు లయబద్ధంగా కాలు కదిపిన తీరు కనులవిందు చేసింది. పాట ముగియగానే డాల్బీ థియేటర్ లో ఆసీనులైన ప్రతి ఒక్కరూ లేచి నిల్చొని చప్పట్లు చరిచిన అపూర్వ దృశ్యం భారతీయుల ప్రతిభను, ప్రతిష్టను మరింత ఇనుమడింప జేసింది. అంతకుముందు బాలీవుడ్ అందాలభామ దీపికా పడుకోన్ వేదికపై నాటునాటు పాటను ప్రపంచానికి పరిచయం చేశారు. తెలుగు విప్లవ యోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం ఇతివృత్తంతో తెరకెక్కికిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో కీలక సన్నివేశంలో వచ్చే నాటునాటు పాట యూట్యూబ్, టిక్ టాక్ తదితర సామాజిక మాధ్యమాల్లో కోట్లాది వ్యూస్ ను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.

ఇంత అద్భుతమైన పాటను రాసింది తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన చంద్రబోస్ కాగా, ఆలపించిన వారిలో ఒకడైన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లింగంజ్ హైదరాబాదీ కావడం మరో విశేషం. ఇక నాటు నాటుతో పాటు భారత్ ను మరో ఆస్కార్ పురస్కారం వరించింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ట్ ఫిల్మ్ విభాగంలో మనదేశం నుంచి నామినేట్ అయిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ ను దక్కించుకుంది. ఆహుతుల హర్షధ్వానాల నడుమ దర్శకులు కార్తికి గోన్ సాల్వెస్, నిర్మాత గున్నీత్ మోగ్న అవార్డులు అందుకున్నారు. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలను చేరదీసి ఆదరించిన దంపతుల కథ ఇది. 42 నిమిషాల నిడివిగలిగిన ఈ డాక్యుమెంటరీలో ఆద్యంతం కనిపించేంది రెండు ఏనుగులు, దంపతులు మాత్రమే. మరోవైపు పురస్కారాలు గెలుచుకున్న చిత్ర బృందాలపై యావత్ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. దేశాధినేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్తువెత్తించారు. తాజా అకాడమీ వేడుకల్లో ఒకే చిత్రం వివిధ కేటగిరీల్లో ఏడు పురస్కారాలను సొంత చేసుకోవడం కొసమెరుపు. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ అనే హాలీవుడ్ చిత్రానికి ఈ గౌరవం దక్కడం విశేషం. విశ్వ సినీ యవనికమీద ఒక తెలుగు సినిమా సత్తా చాటడం, ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం తెలుగువారందరిగా మనకు గర్వకారణం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News