ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల సందడి ప్రారంభమైంది. సినీ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఈ అవార్డుల కోసం ఈ ఏడాది వివిధ కేటగిరీల్లో పోటీపడే సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అకాడమీ కమిటీ ప్రకటించింది. ఇక మార్చి 27న ఆస్కార్ అవార్డుల వేడుక జరుగనుంది. అయితే ఈ ఏడాది కూడా భారతీయ చిత్రాలు తుది జాబితాలో నిలవలేదు. సూర్య ‘జై భీమ్’ చిత్రం, మోహన్‌లాల్ పాన్ ఇండియా మూవీ ‘మరక్కార్’ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో పోటీపడినప్పటికీ తుది జాబితాలోకి మాత్రం రాలేకపోయాయి. దీంతో ఈసారి కూడా భారతీయ చిత్ర పరిశ్రమకు నిరాశే ఎదురైంది.
ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం ఉత్తమ చిత్రం విభాగంలో బెల్‌ఫాస్ట్, కోడా, డోన్ట్ లాకప్, డ్రైవ్ మై కార్, డ్యూన్, కింగ్ రిచర్డ్, లికోరైస్ పిజా, నైట్‌మేర్ అల్లీ, ది పవర్ ఆఫ్ ది డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ సినిమాలు పోటీపడుతున్నాయి. ఇక ఉత్తమ నటుడు అవార్డు కోసం జేవియర్ బార్డెమ్ (బీయింగ్ ది రికార్డోస్), బెనిడిక్ట్ కంబర్ బ్యాచ్ (ది పవర్ ఆఫ్ ది డాగ్), ఆండ్రూ గార్‌ఫీల్డ్ (టిక్ టిక్.. భూమ్), విల్‌స్మిత్ (కింగ్ రిచర్డ్), డెంజిల్ వాషింగ్టన్ (ది ట్రాజెడీ ఆఫ్ మెక్‌బత్) ఆస్కార్ బరిలో నిలిచారు. అదేవిధంగా ఉత్తమ నటి విభాగంలో జెస్సీకా చాస్టెయిన్ (ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫేయీ), ఓలీవియా కోల్‌మెన్ (ది లాస్ట్ డాటర్), ఫెన్‌లోప్ క్రజ్ (పార్లల్ మదర్స్), నికోల్ కిడ్‌మెన్ (బీయింగ్ ది రికార్డోస్), కిరీస్టిన్ స్టీవార్డ్ (స్పెన్సర్) పోటీపడుతున్నారు. ఉత్తమ దర్శకుడు విభాగంలో కెన్నెత్ బ్రనాగ్ (బెల్‌ఫాస్ట్), ర్యూసుకీ హమగూచి (డ్రైవ్ మై కార్), పాల్ థామస్ ఆండ్రూసన్ (లికోరైస్ పిజా), జాన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్), స్టీవెన్ స్పీల్‌బర్గ్ (వెస్ట్ సైడ్ స్టోరీ) పోటీపడుతుండడం విశేషం. అదేవిధంగా ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ సౌండ్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ కాస్టూమ్ డిజైనర్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో పలువురు నటులు, సాంకేతిక నిపుణులు, సినిమాలు పోటీపడుతున్నాయి.
Oscar Awards 2022 Announced