లఖ్‌నవూ: ఆస్కార్ అవార్డు గ్రహీత పింకీ సోంకర్ ఇంటి కూల్చివేతకు అటవీశాఖ అధికారులు నోటీస్‌లు జారీ చేశారు. ప్రభుత్వానికి చెందిన స్థలాల్లో అక్రమంగా ఇళ్ల నిర్మాణం చేశారని ఆమెతోపాటు కొందరు గ్రామస్తులకు ఈ నోటీస్‌లను అందజేశారు. ఉత్తరప్రదేశ్ లోని మిర్జాపూర్‌కు చెందిన పింకీ సోంకర్ పెదవి మొర్రి (గ్రహణం మొర్రి)తో జన్మించారు. తన జీవితం ఆధారంగా తీసిన స్మైల్ పింకీ డాక్యుమెంటరీకి 2008లో ఆస్కార్ అవార్డు లభించింది. సామాజిక కార్యకర్తల సహకారంతో తన చీలిక పెదవికి శస్త్ర చికిత్స చేయించేందుకు ఆమె ప్రయాణం ఎలా సాగిందనే అంశాన్ని ఈ డాక్యుమెంటరీలో చూపించారు. పింకీ తన కుటుంబంతో కలిసి రాంపుర్ దాభి గ్రామంలో నివాసం ఉంటున్నారు.
తాజాగా ఆమెతోపాటు గ్రామం లోని 30 కుటుంబాలకు అటవీ శాఖ అధికారులు కూల్చివేత నోటీసులు జారీ చేశారు. వారు నివసిస్తున్న స్థలం అటవీశాఖకు చెందిందని, అక్రమంగా అందులో ఇళ్లు నిర్మించారని నోటీసుల్లో పేర్కొంది. “పింకీ జీవితం ఆధారంగా తీసిన డాక్యుమెంటరీకి ఆస్కార్ రావడంతో అటవీశాఖ అధికారులు ఈ భూమిని అందించారు” అని గ్రామస్తులు పేర్కొన్నారు. తాము ఈ ప్రాంతంలో ఇళ్లు నిర్మించే సమయంలో అటవీశాఖ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని పింకీ తండ్రి రాజేంద్ర సోంకర్ తెలిపారు. దీనిపై జిల్లా మెజిస్ట్రేట్ ప్రియాంక నిరంజన్ స్పందించారు. ఈ నోటీసులను పరిశీలించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. న్యాయబద్ధంగా సమస్యను పరిష్కరిస్తామన్నారు. దీని గురించి రెవెన్యూ, అటవీ శాఖలకు సమాచారం అందించామని పేర్కొన్నారు.