Monday, December 23, 2024

ఒయు ఒడిలో సందడి

- Advertisement -
- Advertisement -

యూనివర్శిటీ అనగానే మెట్టు మెట్టు ఎక్కి పైకొచ్చిన విద్యార్థులు, వివిధ కోర్సులు, పుస్తకాలు, ప్రొఫెసర్లు, పరిశోధనలు అంతా గంభీర నిశ్శబ్ద వాతావరణమే ఉంటుంది. అక్కడి దృశ్యమంతా విద్యార్జనతో ఉన్నత స్థాయి ఉద్యోగ సాధన దిశగా, ఆవిష్కరణల విజయ బావుటా లక్ష్యంగా యాంత్రికంగా కదులుతుంది. అయితే ఉస్మానియా యూనివర్శిటీ లెక్కే వేరు. సుమారు యాభై ఏళ్ళు కేవలం ఉత్తమ విద్యకే చిరునామా అయిన ఆ యూనివర్శిటీ 1970 నుండి చదువుకు తోడుగా ఉడుకు రక్తపు ఉత్సాహానికి కూడా వేదిక అయింది. తెలుగు నేలపై ఎగసిన విప్లవోద్యమాలకు ఇక్కడి విద్యార్థులు సైదోడుగా నిలిచి విద్యాలయం పేరును రక్తాక్షరాలతో లిఖించారు. ఎందరో మెరికల్లాంటి విద్యార్థులు సాయుధ పోరులోకి వెళ్లి ప్రాణాలు వదిలారు. ప్రతి సామాజిక ఆందోళనకు వీరి పాత్ర చరిత్రలో భాగమైంది. ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలోను, దాని కోసం జరిగిన ప్రతి ఆందోళనలోను ముందుండి తెలంగాణ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ రకంగా ఉస్మానియాకు ఉద్యమాల గడ్డగా పేరు పడింది.

అయితే కాలం మారుతోంది. విద్యా విధానంలో వచ్చిన పలు మార్పుల కారణంగా యువత సాంకేతిక, వైజ్ఞానిక విద్య వైపు వెళ్ళవలసిన ఆగత్యం ఏర్పడింది. ఇంటర్ నుండే ప్రయివేటు రెసిడెన్షియల్ కాలేజీలు, ఎంసెట్ ర్యాంకులు, ఇంజినీరింగ్ చదువులు అన్నీ కలిసి విద్యార్థికి సమాజం వైపు చూసే తీరిక లేకుండా చేశాయి. భారీ ఫీజులు కట్టి చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశలు నిజం చేయాలనే తపన వారిని రాట కర్రకు కట్టేశాయి. ప్రపంచీకరణ తెచ్చిన మార్పులకు ఉస్మానియా యూనివర్శిటీ కూడా మినహాయింపు కాదు. దాని రూపురేఖలు, లక్ష్యాలు మారాయి. నియమ నిబంధనలు మారాయి. ఇప్పుడు బయటివారు ఆ ప్రాంగణంలో అడుగు పెట్టాలంటే అనుమతి కావాలి. ఎలాంటి ఉరేగింపులకు, నినాదాల హోరుకు చోటు లేదు. విద్యార్థులంటే చదువుకోవలసిందే. యూనివర్శిటీ కల్పిస్తున్న విద్య, పరిశోధనల సదుపాయాలను సద్వినియోగపరచుకొని విద్యావంతుడిగా ఎదిగాలి.

అందుకున్న జ్ఞానం తో గొప్ప పరిశోధకుడిగా, ప్రతిభాశాలిగా, పారిశ్రామికవేత్తగా సమాజ ఉన్నతికి తోడ్పడాలి.
ఈ సంధికాలంలో నిలబడ్డ ఉస్మానియాకు ఓ కుదుపు కావాలి, కొత్త ఆశలు చిగురించే ఊపు కావాలి. విద్య సముపార్జనతో, పరిశోధనల కృషి వల్ల ఆవిష్కరణల జయకేతనాలు ఎగిరి ఉస్మానియా ఆధునిక వైజ్ఞానిక పారిశ్రామిక ప్రగతిలో భాగమవ్వాలి. అందుకు తగిన మార్గనిర్దేశనకు అన్ని వైపుల నుండి సహకారం అవసరం. అందులో పూర్వ విద్యార్థులు పెద్దన్నల్లా వెంట రావాలి. వందేళ్లగా మేధావుల కర్మాగారంగా పని చేస్తున్న ఉస్మానియాకు ఎందరో గొప్ప బిడ్డలున్నారు. వారంతా చేయి చేయి కలిపితే నేటి పారిశ్రామిక, వైజ్ఞానిక అభివృద్ధికి తోడ్పడే సదుపాయాలు ఉస్మానియా విద్యార్థులకు అందజేయవచ్చు.

ఆ దిశగా అడుగులు పడడానికి ఈ మధ్య జరిగిన ఉస్మానియా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉపయోగపడుతుందని భావించవచ్చు. జనవరి 3, 4 తేదీల్లో ఒయు క్యాంపస్‌లో ‘గ్లోబల్ అల్యూమిని మీట్ 2023’ ని ఉస్మానియా ఫౌండేషన్ నిర్వహించింది. యూనివర్శిటీ విసి సారథ్యంలో, ఇతర అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు ఆహ్వాన కమిటీ సభ్యులుగా ఈ సంబరాన్ని ఘనంగా నిర్వహించారు. 300 మంది విద్యార్థులు వాలెంటీర్లుగా తమ సేవలందించారు. తక్షణ వైద్య సదుపాయాలు కూడా సిద్ధంగా ఉంచారు. ప్రకటించిన వెంటనే ‘గమ్ -2023’ సైట్ ద్వారా వేయి మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద భారతీయులకు రూ. వేయి కాగా విదేశీయులకు వంద డాలర్లు వసూలు చేశారు. మూడవ తేదీ మధ్యాహ్నం ఆరంభమైన మీట్ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు డిన్నర్ తో ముగియగా రెండో రోజు పూర్తిస్థాయి కార్యక్రమాల ఏర్పాటు జరిగింది. మధ్యాహ్నం దాకా పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న డిపార్ట్ మెంట్ తరగతి గదులను సందర్శించి ప్రస్తుత విద్యార్థులను పలకరించారు.

హాస్టళ్లకు అనుబంధంగా ఉన్న మెస్‌లలో భోజనాలు చేశారు. తాము చదువుకున్న రోజులను మరోసారి అనుభవించే రీతిలో ఈ ఏర్పాట్లు జరిగాయి. ఆనాటి చికెన్, సాంబార్ రుచులను మళ్ళీ ఆస్వాదించారు. సాయంత్రం టాగోర్ ఆడిటోరియంలో మీట్‌కు తలమానికంలా సభా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వీడ్కోలు సమావేశంలో సుమారు 15 మంది వైస్ ఛాన్సలర్లు పాల్గొన్నారు. ప్యానెల్ సభ్యులుగా మరికొందరు పాల్గొని ఉస్మానియా విద్యా విధానంలో రావలసిన మార్పులు, అభివృద్ధికర చర్యలపై ఫలవంతమైన చర్చను కొనసాగించారు. విభాగాల్లో పరిశోధనల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. పరిశ్రమల ఆవశ్యకతకు అనుగుణంగా సిలబస్ మార్పు, విద్యా బోధన ఉండాలన్నారు. ఒక సెమిస్టర్ లేదా ఆరు నెలలు పరిశ్రమల్లో ఇంటర్న్ షిప్ అవసరమన్నారు. పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా విద్యార్థులు తీర్చిదిద్దబడితేనే నిరుద్యోగిత రూపుమాపవచ్చని చెప్పారు.

వ్యవసాయ, రక్షణ, అంతరిక్ష, వైద్య పరికరాల తదితర ఆధునిక రంగాల్లో దేశంలో 70 వేల స్టార్ట్ అప్ కంపెనీలు ఉన్నాయి. వాటి ఆవశ్యకతల మేరకు విద్యలో తగిన మార్పులు జరగాలన్నారు. ‘కనెక్ట్ టు రికనెక్ట్’ అనే భూమికపై ఏర్పాటైన ఈ సమ్మేళనం పూర్వ విద్యార్థుల నుండి ఆశించిన ఫలితాలను కొంత వరకు సాధించిందనుకోవాలి. భిన్న ఉన్నత స్థాయిల్లో ఉన్న పూర్వ విద్యార్థులు వివిధ రకాలుగా యూనివర్శిటీ అభివృద్ధికి తోడ్పడేందుకు ముందుకు వచ్చారు. ఆర్థిక సహాయంగా అప్పటికప్పుడు రూ. రెండు కోట్ల చెక్కులు అధికారులకు అందాయి. రూ. పది కోట్ల హామీలు వచ్చాయి. ఐఎఎస్, ఐపిఎస్ తరహా ఉన్నతోద్యోగాల్లో ఉన్నవారు వ్యక్తిగతంగా రూ.లక్ష దాకా అందజేశారు. విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు ఈయడానికి కొందరు ముందుకొచ్చారు. పరిశ్రమలు గలవారు ఉస్మానియా విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పందాలపై వేదికపైనే సంతకాలు చేశారు.

వెయ్యికి పైగా ఈ సంబరానికి హాజరైన పూర్వ విద్యార్థుల్లో 93 ఏళ్ల వెంకటేశం గారొకరు. ఉస్మానియా లా కాలేజీ తొలి బ్యాచ్ విద్యార్ధి ఆయన హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. తాము చదివిన కాలేజీ చూయించాలనే ఉత్సాహంతో కొందరు పిల్లలను, మనవలను వెంటేసుకొని వచ్చారు. 84 ఏళ్ల బాబురావు గారు 1959 లో ఉస్మానియాలో ఇంజినీరింగ్ చేశారు. ఇంగ్లీష్, ఉర్దూలలో బోధనా ఉండేదని, తమ కోర్సు పూర్తికాగానే అందరిని నాగార్జున సాగర్ నిర్మాణంలో ఇంజినీర్లుగా తీసుకొన్నారు, తమని నాగార్జునసాగర్ బ్యాచ్ అని పిలుస్తారని చెప్పుకొచ్చారు.1962 లో ఎం ఇ చదివిన ఇసిఐఎల్ మాజీ అధికారి నెలకు రూ. 30తో భోజనం చేసేవారమన్నారు. ఇలా ఆహూతులందరు ఉస్మానియా ప్రాంగణంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని తీపి గురుతులు మూట కట్టుకొని వెళ్లారు. ఉద్యమాల గడ్డగా పేరు పొందిన ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ ఉద్యోగాల అడ్డాగా మారాలని ఆశించడంలో కొత్తేమీ లేదు. నిజానికి గత యాభై ఏళ్లుగా ఉస్మానియా విద్యార్థి ఒక చేత ఉద్యమం, మరో చేత ఉద్యోగ ప్రయత్నంతో బ్యాలెన్సుగా నడిచాడు. ఉద్యమం వద్దు, ఉద్యోగమే ముద్దు అనే కొత్త నినాదానికి ఆ విద్యార్ధి ఎలా స్పందిస్తాడో చూడాలి.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News