Sunday, November 24, 2024

బోలు ఎముకల వ్యాధి ఎందుకు వస్తుంది?… ఎలా నివారించాలి?

- Advertisement -
- Advertisement -

మనకు వయసు పెరిగే కొద్దీ అనేక రకాల శారీరక సమస్యలు వస్తాయి. కొన్ని వ్యాధులు కూడా సంక్రమిస్తాయి. అలాంటి వాటిలో బోలు ఎముకల వ్యాధి (ostereoporosis) కూడా ఒకటి. వృద్ధాప్యంలో ఎముకలు బలహీనపడడం సాధారణమే అయినా , అవి ఒక పరిమితిని మించి దాటితే ప్రమాదకరంగా మారుతుంది. దీని కారణంగా ఎముకలు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎముకలు బలహీన పడటాన్ని బోలు ఎముకల వ్యాధి లేదా ఆస్టియోపోరోసిస్ అని అంటారు. తుంటి, మణికట్టు, వెన్నెముకపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సకాలంలో నివారణ చర్యలు తీసుకోకుంటే ఎముకలు దెబ్బతింటాయి. మనశరీరంలోని ఎముకలు ఎప్పుడూ పునరుద్ధరణ చెందుతుంటాయి.

విరిగిపోయినా వెంటనే అతుక్కుంటాయి. 30 ఏళ్ల వయసు వచ్చే సరికి మన ఎముకల బరువు పెరగడం ఆగిపోతుంది. ఇక అప్పటి నుంచి మనం వాటిని కాపాడుకుంటుండాలి. ఎముకలో అనేక ఖనిజాలు ఉంటాయి. అవి పుష్కలంగా ఉన్నప్పుడే ఎముక బరువుగా, దృఢంగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ఖనిజాల లోపం కారణంగా ఎముకలు బలహీన పడతాయి.

స్త్రీలల్లో మోనోపాజ్ స్థితిలో ఈ ఆస్టియోపోరోసిస్ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. 40 నుంచి 50 ఏళ్ల వయసు గల మహిళల్లో హార్మోన్ల మార్పు జరిగి మోనోపాజ్ స్థితి వస్తుంది. అప్పుడు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విటమిన్ డి లోపం కారణంగా కూడా ఎముకలు బలహీన పడుతుంటాయి. శరీరంలో కాల్షియం లోపం, జన్యుసంబంధిత కారణాల వల్ల కూడా ఎముకలు బలహీనపడతాయి. క్యాన్సర్ చికిత్స, హైపర్ థైరాయిడ్, ధూమపానం, పొగాకు నమలడం, అతిగా మద్యం సేవించడం వల్ల ఆస్టియోపోరోసిస్ సంక్రమిస్తుంది. దీని బారిన పడిన వారి శరీరంలో ఎముకలు పెళుసుగా మారతాయి. వారికి తేలికపాటి దగ్గు వచ్చినా, లేదా వంగినా తుంటె, వెన్నెముక, మణికట్టు ఎముకల్లో పగుళ్లు ఏర్పడుతుంటాయి. తగినంత సూర్మరశ్మిని అందని వారు, వ్యాయామం చేయని వారు దీని బారిన పడతారు.

వెన్నునొప్పి, శరీరాకృతి వంగిపోవడం, ఎత్తు తగ్గుతున్నట్టు కనిపించడం, చిన్నప్రమాదాలకే ఎముకలు విరిగిపోవడం వంటివి బోలు ఎముకల వ్యాధి లక్షణాలు. కొద్దిమంది మహిళల్లో ఇది మూపురంలా పెరుగుతుంది. ఎక్స్‌రే ద్వారా బోలు ఎముకల వ్యాధిని నిర్ధారించవచ్చు. తక్కువ లక్షణాలు ఉండే వారిలో ఎముకలు పెళుసుగా మారతాయని తెలుసుకోలేరు. ఇలాంటి అతి చిన్న లక్షణాలు గుర్తించడానికి , సరైన చికిత్స అందించడానికి బోన్ డెన్సిటీ స్కాన్ ( డెక్సాస్కాన్) సహాయ పడుతుంది. డెక్సాస్కాన్‌తో ఎముక సాంద్రతను పరీక్షిస్తారు. దీంట్లో టి. స్కోర్ అనే విలువ 2.5 లేదా అంతకన్నా తక్కువ ఉంటే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ అయినట్టే. బిస్పోస్పోనేట్స్ , టెరీపరటైడ్, కాల్సిటోనిన్, డెనోసోముబాబ్ , మరియు కొన్ని రకాల హార్మోన్ మందులు ఈ వ్యాధికి వాడతారు. దీంతోపాటు కాల్షియం , విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. యోగాసనాల వల్ల కూడా ఈ వ్యాధి సమస్య చాలావరకు తగ్గుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News