కొత్త సంస్థలను సృష్టించారు
అవి ఈ ఎన్నికల్లో మట్టి కరిచాయి
ఒమర్ అబ్దుల్లా
బుద్గామ్ (జెకె) : కొత్త సంస్థలను సృష్టించడం ద్వారా తమ పార్టీని నాశనం చేయడానికి గత ఐదు సంవత్సరాల్లో పెక్కు ప్రయత్నాలు జరిగాయని, కానీ ఆ సంస్థలు ఈ ఎన్నికల్లో మట్టి కరిచాయని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మంగళవారం చెప్పారు. జెకె మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన సమీప పిడిపి ప్రత్యర్థులను ఓడించి గందర్బల్, బుద్గామ్ సీట్లను గెలుచుకున్నారు. ఆయన గందర్బల్‌లో 10 వేలకు పైగా వోట్లతోను, బుద్గామ్‌లో 18 వేల వోట్లతోను విజయం సాధించారు.
బుద్గామ్ సీటుకు సంబంధించి రిటర్నింగ్ అధికారి నుంచి గెలుపు సర్టిఫికేట్‌ను స్వీకరించిన అనంతరం బుద్గామ్‌లో విలేకరులతో ఒమర్ మాట్లాడుతూ, ‘గడచిన ఐదు సంవత్సరాల్లో ఎన్‌సిని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడ అనేక పార్టీలను సృష్టించారు. వాటి లక్షం ఎన్‌సి నాశనమే. కానీ, మాపై భగవంతుని దయ ఉంది. మమ్మల్ని నాశనం చేయజూసినవారు ఆ ప్రక్రియలో మట్టి కరిచారు’ అని చెప్పారు. ‘వోటు వేసి నన్ను గెలిపించినందుకు, జెకె ప్రజలకు మరొక సారి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు బుద్గామ్ వోటర్లకు నా ధన్యవాదాలు’ అని ఆయన తెలిపారు. ఈ తీర్పు పార్టీ బాధ్యతలను పెంచిందని ఒమర్ చెప్పారు. అద్భుత విజయం సాధించినందుకు ఎన్‌సిపి అభినందించిన పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి కూడా ఒమర్ ధన్యవాదాలు తెలియజేశారు.