Sunday, January 19, 2025

మారనున్న స్థానికత

- Advertisement -
- Advertisement -

OTR TSPSC arrangements for amendment

2018 రాష్ట్రపతి ఉత్తర్వులు, కొత్త
జిల్లాల ప్రకారం ఖరారు ఒటిఆర్
సవరణకు టిఎస్‌పిఎస్‌సి ఏర్పాట్లు
రెండు, మూడు రోజుల్లో వెబ్‌సైట్‌లో
ఎడిట్ ఆప్షన్ ఉగాదికి గ్రూప్ 1
నోటిఫికేషన్?

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) నోటిఫికేషన్ల విడుదలకు అవసరమైన చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా అభ్యర్థులు స్థానికత, విద్యార్హతల సమాచారంలో మార్పులకు వన్ టైం రిజిస్ట్రేషన్ (ఒటిఆర్) సోమవారం నుంచి టిఎస్‌పిఎస్‌సి అవకాశం కల్పించనుంది. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో ఒటిఆర్ విభాగంలో ఎడిట్ ఆప్షన్‌ను కమిషన్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఆదివారం టిఎస్‌పిఎస్‌సి ఒక ప్రకటన విడుదల చేసింది. ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నూతన రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 33 జిల్లాల ప్రాతిపదికన అభ్యర్థులు తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో ఎడిట్ ఆప్షన్‌లోకి వెళ్లి 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకున్న జిల్లాలను అప్‌డేట్ చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్ తెలిపారు. ఇప్పటివరకు ఒటిఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు న్యూ రిజిస్ట్రేషన్(ఒటిఆర్) ఆప్షన్‌పై క్లిక్ చేసి తమ వ్యక్తిగత వివరాలు, 1 నుంచి 7వ తరగతి వరకు చదువుకున్న జిల్లాలు, విద్యార్హతలతో వారి మొబైల్ నెంబర్ తదితర వివరాలతో ఆన్‌లైన్ ఫారం భర్తీ చేయాలని పేర్కొన్నారు.

కొత్త జిల్లాల ప్రకారం…

తెలంగాణ ఏర్పాటైన సమయంలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉండగా.. ఇప్పుడు 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటయ్యాయి. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త జిల్లాల ప్రకారం అభ్యర్థులు ఒటిఆర్‌లో తమ వివరాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2018కి ముందు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే దానిని స్థానిక జిల్లాగా గుర్తించారు. కొత్త రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఒకటవ తరగతి నుంచి 7వ వరకు వరుసగా నాలుగేళ్లు ఏ జిల్లాలో చదివితే దానిని స్థానికతగా నిర్ణయిస్తున్నారు. అభ్యర్థులు చదివిన పాఠశాల ఏ జిల్లా పరిధిలోకి వస్తే ఆ జిల్లానే అభ్యర్థుల స్థానిక జిల్లాగా ఖరారు కానుంది. జిల్లా స్థానికత ఖరారైతే వారు ఏ జోన్,ఏ మల్టీ పరిధిలోకి వస్తారో తెలుస్తుంది. టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో సుమారు 25 లక్షల మంది అభ్యర్థులు ఒటిఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో నిరుద్యోగ అభ్యర్థులు అధిక సంఖ్యలో కొత్తగా ఒటిఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోనున్నారు.

ఉగాదికి గ్రూప్ 1 నోటిఫికేషన్..?

రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఉగాదికి నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. అందులో 503 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో భాగంగా ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వూ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉన్నందుకు ముందుగా ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడలేదు. నిరుద్యోగులు ఏడు సంవత్సరాల నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మొదటిసారి ఇవ్వనున్న గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను ఉగాధికి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News