మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ గడువు సమీపిస్తుండటంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు ఆశావాహులను గుర్తించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకుంటున్నాయి. గత ఐదారు రోజుల నుంచి బిజెపి దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో సీనియర్ నాయకులతో పాటు ఓయూ విద్యార్థి సంఘం నాయకులు తాము సైతం అంటున్నారు. అందులో భాగంగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి ఓయూ విద్యార్థి నాయకుడు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. పుల్లారావు యాదవ్ టికెట్ కోసం దరఖాస్తు సమర్పించారు. ఉస్మానియా ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన పుల్లారావు యాదవ్ ఖమ్మం జిల్లా వాసి. బిసి సామాజిక వర్గానికి చెందిన యువకుడు కావడంతో పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నారు.
పార్టీ సీనియర్ నాయకులు గరికపాటి మోహన్ రావు అనుచరుడుగా పార్టీకి సేవలందిస్తూ హైకమాండ్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. బండి సంజయ్ చేపట్టిన యాత్రలో ఉత్తర తెలంగాణ జిల్లాల బాధ్యతలు తీసుకుని యాత్ర విజయవంతం కావడంతో తన వంతు పాత్ర పోషించినట్లు తెలిపారు. విద్యార్థి సంఘాల కోటాలో పార్టీ పెద్దలు తను పేరును పరిశీలించి ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు చేపడుతూ పార్టీ బలోపేతం చేసినట్లు వెల్లడించారు. జిల్లా మంత్రికి పువ్వాడ అజయ్‌కుమార్ తానే గట్టి పోటీ ఇవ్వగలని పేర్కొన్నారు.