మన తెలంగాణ/హైదరాబాద్ : ఉమ్మడి ఎపిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని విద్యుత్, తాగునీటి సమస్యలు అధికంగా ఉండేవని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణలో గతంలో తరచూ విద్యుత్ కోతలు, తాగునీటి కోసం నిరసనలు జరిగేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెప్పారు. తొమ్మిదినరేళ్లలో సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక హైదరాబాద్ మహానగర పరిధిలో అభివృద్ధి శరవేగంతో దూసుకెళుతోంది. ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లతో ట్రాఫిక్ చిక్కులు చాలా వరకు తగ్గాయి. మంచినీటి కొరత చాలా వరకు తగ్గింది. ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు. దేశంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఉమ్మడి ఎపిలో విద్యుత్, తాగు నీటి సమస్య తీవ్రంగా ఉండేదన్న ఆయన గతంలో తరచూ విద్యుత్ కోతలు, తాగు నీటి కోసం నిరస నలు జరిగేవని గుర్తు చేశారు. మిషన్ భగీరథ ద్వారా భాగ్యనగరం సహా రాష్ట్రవ్యాప్తంగా తాగు నీటి సమస్య లేకుండా చేశామని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో 24 గంటలు తాగు నీటిని అందించాలన్నదే తమ స్వప్నమని పేర్కొన్నారు. పెట్టుబడులు తేవడం, మౌలిక వసతులు కల్పిస్తేనే విశ్వనగరం సాధ్యమని తెలిపారు.
మెట్రో రైలు సేవలు 70 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నామన్న ఆయన మెట్రోను రాబోయే 7 నుంచి 10 ఏళ్లలో 415 కిలోమీటర్లు విస్తరించాలన్నదే తన ఎజెండా అన్నారు. చెత్త సేకరణలో మరింత సమర్థ నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి పురపాలనలో రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో పౌరుల భాగస్వామ్యం కల్పించే బాధ్యత తనదని స్పష్టం చేశారు.
ప్రజలు పని చేసే ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారని, ఎన్నికల్లో గెలిచేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తాము చేసిన అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తుందన్నారు. ‘హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయి. అభివృద్ధిలో హైదరాబాద్ న్యూయార్క్ తో పోటీ పడుతుంది. చారిత్రక మహా నగరంగా పేరున్న ఈ భాగ్యనగరాన్ని కాపాడుకోవాలి. గత పదేళ్లలో నగరంలో 36 ఫ్లైఓవర్లు నిర్మించాం, 39 చెరువులను నవీకరించాం. నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తాం. జిహెచ్‌ఎంసికి ఒక కమిషనర్ సరిపోరు. మరో ఇద్దరు ప్రత్యేక కమిషనర్లను నియమిస్తాం. వీరిలో ఒకరు పచ్చదనం, పార్కుల పరిరక్షణకు, మరొకరు చెరువుల పరిరక్షణ చూసే విధంగా చూస్తాం’ అని వెల్లడించారు.