మహబూబ్ నగర్: జిల్లా నుండి పేదరికం పారద్రోలి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా, జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో ఒకేషనల్ విద్యార్థులకు ఉద్దేశించి నిర్వహించిన అప్రెంటీస్ షిప్, జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 2015 నుండి ఇప్పటివరకు ఒకేషనల్ విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం 1500 నుండి 4500 వరకు ఉద్యోగాలు కల్పించామని అన్నారు .గ్రామీణ విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వారు బ్రతుకుతెరువు కోసం కుటుంబాల పోషణ నిమిత్తం ఒకేషనల్ కోర్సులలో చేరుతారని, మరికొద్ధిమంది ఒకేషనల్ తర్వాత పాలిటెక్నిక్ ,ఇంజనీరింగ్ కోర్సులు చేస్తారని తెలిపారు .ఎంతోమందికి ఉపాధి కల్పించే ఒకేషనల్ కోర్సుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జబ్ మేలా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గతంలో మహబూబ్ నగర్ జిల్లా నుండి ప్రతి సంవత్సరం 14 లక్షలు మంది వలస వెళ్లే వారని ,దేశంలోనే వలసల జిల్లాగా, ఆకలి జిల్లాగా, పేదరికానికి ,దరిద్రానికి మహబూబ్నగర్ పేరు ప్రఖ్యాతలుగాంచిందని, రెండు జీవనదులు ఉన్నప్పటికీ కూడా ఆకలితో ,పేదరికంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గత పాలకులు పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పల్లెలు బాగుపడ్డాయని, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ లో చదువుకున్న విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు ఒకేషనల్ ద్వారా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు .ఒకేషనల్ కోర్సులలో చేరినప్పటికీ అనంతరం ఉన్నత ఉద్యోగాలు చేసుకునేందుకు చదువుకోవచ్చని అన్నారు.ఇటీవల జిల్లాలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 2500 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించినట్లు ఆయన వెల్లడించారు.
శుక్రవారం నాటి జాబ్ మేళాకు సుమారు 50 కంపెనీలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయని, ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారు.అంతేక్షక ఎంపికైన కొంత మందికి నియామక పత్రాలు అందజేశారు. విద్యార్థులు 5 సంవత్సరాలు కష్టపడి చదివితే తప్పనిసరిగా ఉద్యోగాలు సాధిస్తారని జీవితాలు బాగుపడతాయని, అందువల్ల చదువుపైన దృష్టి నిలపాలని ఆయన కోరారు. గత ఎనిమిది సంవత్సరాలుగా కళాశాలలో చదివిన వారి జాబితాను సేకరించి ఇప్పటివరకు ఉద్యోగాలు రాని వారి జాబితాను రూపొందించాలని, వారందరినీ పిలిపించి జాబ్ మేళాల ద్వారా ఉద్యోగాలు ఇప్పించాలని ఆదేశించారు.
ఉద్యోగం రావడం ద్వారా సమాజంలో గౌరవం, గుర్తింపు వస్తుందని, ఒకేషనల్ విద్యార్థులతో పాటు ,ఇతరులకు కూడా నైపుణ్యాల అభివృద్ధి కోసం శిక్షణ ,కోచింగ్ వంటివి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఒకేషనల్ విద్యార్థుల కోసం రెండు కోట్ల 20 లక్షల రూపాయలతో నిర్మించిన భవనాన్ని వినియోగంలో తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. శాసనమండలి సభ్యులు ప్రముఖ కవి గోరేటి వెంకన్న ,ముడాచైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, ఇంటర్మీడియట్ రాష్ట్ర విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, ఒకేషనల్ విద్య ట్రైనింగ్ అధికారి విజయకుమార్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఆర్డిఓ అనిల్ కుమార్, డీఎస్పీ మహేష్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.