Wednesday, January 22, 2025

భారత్‌పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు

- Advertisement -
- Advertisement -

సాయుధ బలగాలు మరింత శక్తిమంతం
భారత్‌పై ఎవరు కన్ను వేసినా శిక్ష తప్పదు
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ : మన సాయుధ బలగాలు మరింత శక్తిమంతం అయ్యాయని, భారత్‌పై ఎవరు కన్ను వేసినా గట్టి గుణపాఠం చెప్పేందుకు బలగాలు సిద్ధంగా ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రకటించారు. తూర్పు లడఖ్‌లో చైనాతో సుమారు నాలుగు సంవత్సరాలుగా సాగుతున్న సరిహద్దు వివాదం, హిందు మహాసముద్రంలో చైనీస్ మిలిటరీ ప్రవేశంపై ఆందోళనల నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి ఆ ప్రకటన చేశారు. దేశ రక్షణ వ్యవస్థకు ప్రజల దూరదృష్టికి అనుగుణంగా ప్రభుత్వం ‘కొత్త శక్తి సమకూర్చింది ’ అని, దృఢమైన, స్వయం సమృద్ధ సైన్యంతో ప్రపంచ వేదికపై శక్తిమంతమైన దేశంగా భారత్ ఆవిర్భావానికి అది దారి తీసిందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

ఎన్‌డిటివి నిర్వహించిన రక్షణ శాఖ సంబంధిత శిఖరాగ్ర సదస్సులో రాజ్‌నాథ్ ప్రసంగిస్తూ, ‘భారతీయత భావంతో’ దేశ రక్షణ వ్యవస్థను మరింత బలిష్టం చేయడంపై మోడీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినందున అది ఎప్పటికన్నా మరింత దృఢంగా ఉందని చెప్పారు. ప్రస్తుత, పూర్వపు ప్రభుత్వాల మధ్య ప్రధాన అంతరం ‘దృక్పథమే’ అని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం భారత ప్రజల సామర్థాలను గట్టిగా విశ్వసిస్తున్నదని, కాని గతంలో అధికారంలో ఉన్నవారు ప్రజల శక్తిపై ఒకింత సందేహంతో ఉండేవారని రాజ్‌నాథ్ వివరించారు. ‘ఇప్పుడు కేంద్రంలోని శక్తిమంతమైన నాయకత్వం వల్ల మన దళాలు దృఢచిత్తంతో ఉన్నాయి. సైనికుల నైతిక స్థైర్యం ఉన్నతంగా ఉండేలా మేము నిరంతరం కృషి చేస్తున్నాం’ అని మంత్రి చెప్పారు. ‘భారత్‌పై ఎవరు కన్ను వేసినా గట్టి గుణపాఠం చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారు’ అని రాజ్‌నాథ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News