Monday, January 20, 2025

దేశ దేశాల్లో మన చేనేత వస్త్రాలు

- Advertisement -
- Advertisement -

మానవ జాతి చరిత్రలో చేనేతకు అద్వితీయమైన స్థానం ఉంది. ముఖ్యంగా మన దేశానికి చేనేత వస్త్రాల తయారీకి సంబంధించి చాలా ప్రత్యేకత ఉంది. చేనేత భారత దేశ వారసత్వ సంపద. జాతీయోద్యమంలో కూడా చేనేత కీలక పాత్ర పోషించింది. ఉద్యమానికి ఓ ఊపు తెచ్చింది. ఆ నాడు జాతీయ నేతలు విదేశీ వస్తువులను, వస్త్రాలను బహిష్కరిస్తూ పిలుపు ఇచ్చారు. 1905, ఆగస్టు 7న కోల్‌కతాలో విదేశీ వస్త్రాలను దగ్ధం చేశారు. ఆ తరువాత చేనేత చిహ్నం రాట్నాన్ని జాతీయోద్యమ జెండాలో చేర్చారు. తకిలి అనే కదురు ద్వారా దూదితో నూలు వడకడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టారు. మహాత్మా గాంధీ చర్ఖాతో నూలు వడుకుతుండేవారు. అలా చేనేత వృత్తి చిహ్నం జాతీయోద్యమానికి ప్రతీకగా నిలిచింది. విదేశీ వస్త్రాలను దగ్ధం చేసి జాతీయోధ్యమాన్ని ఓ మలుపు తిప్పిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగాజరపాలని చేనేత కార్మికులు కోరుతూ వచ్చారు.

జాతీయస్థాయిలో చేనేత పరిశ్రమ ప్రాధాన్యతను గుర్తించి 2015లో ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవం (నేషనల్ హ్యాండ్ లూమ్-డే)గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. రంగులతోపాటు వివిధ డిజైన్ల రూపకల్పన, అనేక పద్ధతుల్లో చేనేత వస్త్రాలను తయారు చేయడం భారతీయ చేనేత కళాకారుల ప్రత్యేకత. వివిధ రకాల డిజైన్లతో చేనేత వస్త్రాలను నేయడంలో ఇక్కడి కళాకారులు నిష్ణాతులు. అగ్గిపెట్టెలో పట్టేంతటి చీరను తయారు చేయగల సమర్థులు ఆనాడూ ఈనాడూ ఇక్కడ ఉన్నారు. సాంకేతికాభివృద్ధితో సమాజం ఎన్ని కొత్త పోకడలు పోతున్నా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు చేనేత వస్త్రాలపై మక్కువ మాత్రం తగ్గలేదు. ఈ ప్రపంచానికి భారత దేశం ప్రసాదించిన వాటిలో చేనేత వస్త్రం ఒకటి. చేనేత మన జాతి సంపద. ప్రపంచీకరణ నేపథ్యంలో విపరీతమైన పోకడలను తట్టుకుంటూ దేశం వారసత్వ సంపదైన సంప్రదాయ చేనేత వస్త్రాలను కాపాడుకుంటూ వస్తోంది. ఫ్యాషన్ షోలలో సైతం చేనేత వస్త్రాలను ధరిస్తున్నారంటే విదేశీ వస్త్రాలకు దీటుగా ఇవి నిలబడగలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో మంగళగిరి, ధర్మవరం, చీరాల, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, నారాయణ్ పేట్, గద్వాల్ వంటి ప్రాంతాలు ప్రపంచ వ్యాప్తంగా చేనేతకు మంచి గుర్తింపు తెచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో నూలుకు రంగులు అద్దే కార్మికుల నైపుణ్యం వల్ల ఆ రంగులలో నాణ్యత ఉంటుంది. ఆయా రంగుల వల్ల కూడా ఆయా ప్రాంతాల చేనేత వస్త్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే చేనేత వస్త్రాలలో దాదాపు 14% తెలంగాణ వస్త్రాలే ఉంటాయి. అంటే ఇక్కడి చేనేత వస్త్రాలకు ఎంత గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు. విదేశాలలో స్థిరపడిన భారతీయ మహిళలు పండుగలు, వేడుకల సందర్భంగా మనసంప్రదాయ చేనేత వస్త్రాలనే ధరించి కళకళలాడుతూ హుందాగా వ్యవహరిస్తుంటారు. వారిలో భారతీయత ఉట్టిపడుతూ ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ అనే చేనేత కళాకారుడు అగ్గిపెట్టెలో సరిపోయే పట్టుచీరను తయారు చేసి పద్మశాలీ ఆడపడుచైన తిరుమల తిరుపతిలోని పద్మావతి దేవికి సమర్పించారు. 250 గ్రాముల బరువైన ఈ చీరను 25 రోజుల్లో తయారు చేశారు. దీని తయారీలో కొంత మేర బంగారం, వెండి తీగలను ఉపయోగించారు. సిరిసిల్లకు చెందిన మరో కళాకారుడు వెల్ది హరిప్రసాద్ 2001 నుంచి అగ్గిపెట్టెలో పట్టేంతటి పట్టుచీరలు తయారు చేస్తున్నారు. ఈ చీరల పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 47 అంగుళాలు ఉంటాయి. ఆయనే దబ్బళం మొనలో దూరే 5.5 అడుగుల చీరలను కూడా తయారు చేసి ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. హరి నైపుణ్యాన్ని ఇటీవల మన్ కీ బాత్ ప్రోగ్రాంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా మెచ్చుకున్నారు. హరి ఇప్పు డు ఓ కొత్త చీరను తయారు చేస్తున్నారు. అది రాజన్న సిరిసిల్ల ప్రత్యేకం. ఆ చీరపై సిరిసిల్ల కమాన్‌తో పాటు రాట్నం వడికే మహిళ కూడా ఉంటుంది. ఈ చీరను జాతీయ చేనేత దినోత్సవం రోజు ప్రభుత్వానికి అందచేస్తానని హరి చెప్పారు.

అయోధ్యలోని రామమందిరం కోసం నాగరాజు, భుజంగరావు, సురేంద్ర బాబు, తేజ అనే ఎపిలోని ధర్మవరం చేనేత కళాకారులు ఇటీవల 16 కిలోల పట్టుచీర తయారు చేశారు. 160 అడుగులున్న ఈ చీరపై 13 భారతీయ భాషల్లో 32 వేల 200 సార్లు శ్రీరామ నామం వచ్చింది. రామాయణంలోని 168 ప్రధాన ఘట్టాలు వచ్చేవిధంగా దీనిని రూపొందించారు. ఈ పట్టువస్త్రాన్ని అయో ధ్య రామ మందిరానికి సమర్పించనున్నారు. ఇటువంటి ఉద్ధండులైన చేనేత కళాకారులకు ఇక్కడ కొదవలేదు. కానీ, వారికి ప్రోత్సాహమే కరువైంది. దేశ ఆర్థిక వ్యవస్థలో, ఉపాధి కల్పనలో చేనేత రంగం కీలకమైనదిగా ఉంది. దేశంలో వ్యవసాయం తర్వాత ఉపాధికి అవకాశాలున్న రెండవ అతి పెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. అందులో చేనేత రంగం వాటానే ఎక్కువ.

ఈ రంగంలో దేశ వ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ప్రత్యక్షంగా, 15 కోట్ల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. చేనేత కార్మికుల్లో పురుషులతో పాటు మహిళలు కూడా గణనీయంగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో వృద్ధుల నుంచి పిల్లల వరకు ఇదే వృత్తిలో ఉంటారు. పరోక్షంగా లేక అనుబంధంగా అంటే.. నూలు తయారు చేయడం, వడకడం, అచ్చు అతకడం, పడుగులు చేయడం, చిలపలను కండెలుగా తయారు చేయడం, మగ్గాలు, డిజైన్ డాబీలు, రాట్నాలు, నాడెలు, పన్నెలు, పన్నెల్లో ఇత్తడి ఈనెలు… వంటివి తయారు చేయడం, నూలుకు రంగులు అద్దడం, పట్టు, రేషన్ దారాలు తయారు చేయడం, ఆసు తోడటం వంటి పనుల ద్వారా ఉపాధి పొందడం. కొన్ని అనుబంధ వృత్తులపై చేనేత కాకుండా ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఆధాపడి జీవిస్తుంటారు. చేనేత రంగం అనేక ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. అయినా, మన దేశంలోని చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ మాత్రం తగ్గలేదు. చేనేతపై తయారు చేసిన వస్త్రాలకు ఉన్న ప్రత్యేకత వల్లే ఆ డిమాండ్ అలా కొనసాగుతోంది. చేనేతపై తయారయ్యే చీరలు, షర్టింగ్స్, టవల్స్, లుంగీలు, డ్రెస్ మెటీరియల్, దుప్పట్లు వంటివి ఆరోగ్యానికి మంచిదని ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు నిర్ధారించారు. అందువల్ల కూడా అందరూ చేనేత వస్త్రాలపై మొగ్గు చూపడం ఎక్కువైపోతోంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల చేనేత వస్త్రాల వ్యాపారం జరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యం, ప్రాచుర్యం, ప్రాశస్త్యం కలిగిన చేనేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదరణ కరువైంది. తగిన ప్రోత్సాహం లేదు. చేనేత వస్త్రాలపై కేంద్రం 5% జిఎస్‌టీని ఎత్తివేసి వారసత్వ సంపదను రక్షించుకోవలసిన అవసరం ఉంది.

-శిరందాసు నాగార్జున,
9440222914

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News