టి టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
బిజెపి, కాంగ్రెస్‌లు అగ్రవర్ణాల పార్టీలేనని విమర్శ
మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లలో గెలువాలనేది మా ప్రణాళిక అని టి టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఈ దిశగా తమ పార్టీ ప్రణాళిక బద్దంగా అభ్యర్ధులను ప్రకటించి ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలో తమ పార్టీకీ బలమైన నాయకత్వం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో టి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన రాష్ట్ర పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు,పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ తెలంగాణ తెలుగుదేశంలో నూతన నాయకులు తయారవుతున్నారన్నారు. అందరం కలిసి పార్టీని నిలబెట్టడానికి పనిచేద్దామని క్యాడర్‌కు ఆయన సూచనలు చేశారు. గత సంవత్సర కాలంలో ఖమ్మం బహిరంగ సభ, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 41 పార్టీ ఆవిర్భావ సభ, కరీంనగర్ శంఖారావం సభ, 17 పార్లమెంట్ నియోజక వర్గాలలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు, మినీ మహానాడులు,ఇంటింటికి తెలుగుదేశం, ఇందిరా పార్క్ దర్నాచౌక్ వద్ద ప్రభుత్వ హామీలు వైఫల్యాలపై మహాధర్నా వంటి కార్యక్రమాలను నిర్వహించామన్నారు.
119 నియోజకవర్గాలలో బ్యాలెట్ పేపర్లలో సైకిల్ గుర్తు ఉండాలనేది నా తపన అన్నారు. అధినేత చంద్రబాబు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోరాటం చేయాల్సిన నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మనమందరం కట్టుబడి ఉండాలని సూచించారు. జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును గత 44 రోజులుగా అక్రమంగా, అన్యాయంగా జైలులో పెట్టారని చంద్రబాబు సభలు,లోకేష్ పాదయాత్రకు లక్షలాది మంది ప్రజలు వచ్చి బ్రహ్మరథం పట్టడం చూసిఓర్వలేక తప్పుడు కేసులో ఇరికించారని కాసాని ధ్వజమెత్తారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక, దేశంలోనూ ప్రపంచం లోనూ నిరసనలు తెలుపుతూనే ఉన్నారన్నారు. ఇతర పార్టీల వారూ బాబు అక్రమ అరెస్టులపై స్పందిస్తున్నారని ఆయన అన్నారు. విజన్ -2020 ద్వారా చదువుకొని వృద్ధిలోకి వచ్చిన కుటుంబాలు చంద్రబాబు అక్రమ అరెస్టుపై బయటికి వచ్చి నిరసన తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుండి అన్ని పార్టీలు అభ్యర్థులపై దృష్టి పెట్టాయన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికలలో పోటీ చేయడానికి ఇప్పటి వరకు తమకు 190కి పైగా దరఖాస్తులు అందాయని, మరో రెండు రోజులలో అధినేత చంద్రబాబుని కలిసి ఆయనకే వారి జాబితాను ఇవ్వనున్నామన్నారు. అర్హులైన వారిని చంద్రబాబే నిర్ణయించి బి.ఫారంలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నాదానికి మనమందరం కట్టుబడి ఉండాలని క్యాడర్‌కు ఈ సందర్భంగా సూచించారు. అన్ని జిల్లాలలో టిడిపి జెండా ఎగరాలన్నదే నా ఆశ, తపన అని ఈ సందర్భంగా కాసాని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు జాతీయ పార్టీ అధికార ప్రతినిధులు ప్రేమ్ కుమార్ జైన్, టి. జోత్స, జాతీయ పార్టీ కార్యదర్శి కాసాని వీరేష్ తదితరులు పాల్గొన్నారు.