Thursday, January 23, 2025

మన పివి భారత ‘రత్నం’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:కేంద్రప్రభుత్వం మరోసారి ‘భారత రత్న’పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం ఎస్ స్వామినాథన్‌లను అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఎక్స్( ట్విట్టర్) వేదికగా ఈ మేరకు ప్రకటించారు. దేశానికి వీరు అందించిన సేవలను కొనియాడారు. తాజా ప్రకటనతో ఈ ఏడాది మొత్తం అయిదుగురిని ఈ అత్యున్నత పురస్కారం వరించింది. మోడీ ప్రభుత్వం ఇంతకు ముం దు బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌లకు భారత రత్న ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఒకే ఏడాది ఇంత మందికి భారత రత్న ప్రకటించడం ఇదే మొదటిసారి.1999లో అప్పటి వాజపేయి ప్రభుత్వం నలగురికి భారత రత్న ప్రకటించింది. పివి నరసింహారావు, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్‌లకు భారత రత్నను ప్రకటిస్తూ ప్రధాని మోడీ దేశానికి వారు అందించిన సేవలను కొనియాడారు.‘ రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు ఈ దేశానికి అందించిన సేవలు అపారం.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఆయన చేసిన సేవ చిరస్మరణీయం. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వం బఅలమైన పునాది వేసింది.పివి హయాంలో ప్రపంచ మార్కెట్‌ను భారత్ ఆకర్షించింది. ఆయన పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైంది. విదేశాంగ విధానం, విద్యారంగంలో ఆయన అందించిన సహకారం దేశాన్ని సాంస్కృతికంగా, మేధిపరంగా సుసంపన్నం చేసింది’ అని ప్రధా ని కొనియాడారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, స్వామినాథన్‌ల కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

రైతు బాంధవుడు
రైతు సంక్షేమం కోసం ఎనలేని కృషి చేసిన చౌధరి చరణ్ సింగ్ 1903 డిసెంబర్ 23న ఉత్తరప్రదేశ్‌లోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. మహాత్ముడి స్ఫూర్తితో స్వాతంత్య్ర సంగ్రామంలోకి అడుగుపెట్టారు. మొదట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున చురుగ్గా వ్యవహరించిన ఆయన .. 1967లో భారతీయ క్రాంతిదళ్ పేరిట సొంతంగా పార్టీ స్థాపించారు. జనతా పార్టీ, జనతా పార్టీ (సెక్యులర్)లో పని చేసి 1980లో లోక్‌దళ్ పేరిట మరోసారి సొంత పార్టీని స్థాపించారు. 1967 68, 1970లలో రెండు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఎమర్జెన్సీ రోజుల్లో జైలుపాలయ్యారు. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఆయన హయాంలోనే 1979 జనవరినుంచి జులై వరకు ఉపప్రధాని,ఆర్థికమంత్రిగా ఉన్నారు.ఆ వెంటనే 1979 జులై 28నుంచి ఆగస్టు 20 మధ్య కేవలం 23 రోజుల పాటు దేశ అయిదో ప్రధానిగా సేవలందించారు.ఆ తర్వాత కొంత కాలం ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగారు. గ్రామాల ఆర్థిక పరిస్థితులకు హాని కలిగించే, రైతులను దోపిడీ చేసే చట్టాలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. ఆయనకు ఆరుగురు సంతానం. ఆయన కుమారుడు అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్‌దళ్ వ్యవస్థాపకుడు. చరణ్ సింగ్ 1987లో కన్ను మూశారు.
హరిత విప్లవ పితామహుడు
స్వామినాథన్ 1925 ఆగస్టు 7న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి ఎంకె సాంబశివన్ సర్జన్. మెట్రిక్యులేషన్ పూర్తయిన తర్వాత స్వామినాథన్ తన తండ్రిబాటలోనే మెడికల్ స్కూల్లో చేరారు. కానీ 1943 నాటి బెంగాల్ కరవును కళ్లారా చూసిన ఆయన చలించి పోయారు. దేశాన్ని ఆకలినుంచి కాపాడాలనే లక్షంతో వైద్య రంగం నుంచి తన మనసును మరల్చుకుని వ్యవసాయ పరిశోధనలవైపు అడుగులు వేశారు. భారత్‌లో హరిత విప్లవానికి నాంది పలికారు. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో స్వామినాథన్ విశేష కృషి చేశారు.అధిక దిగుబడిని ఇచ్చే వరి, గోధుమ వంగడాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. స్వామినాథన్ 98వ ఏట కన్నుమూశారు.
సంతోషిస్తున్నాను: సోనియా గాంధీ
మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లు నాడు, నేడు ఎప్పటికీ భారత రత్నాలేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. దేశానికి వారు అందించిన సేవలు అపూర్వమని, ప్రతి భారతీయుడు వారిని గౌరవిస్తాడని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు. భారత రత్నాల ప్రకటన.. ముఖ్యంగా పివికి ఇవ్వడంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీస్పందిస్తూ..ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. శుక్రవారం పార్లమెంటు భవనం వెలుపల విలేఖరులతో మాట్లాడిన ఆమె‘ నేను వాటిని స్వాగతిస్తున్నాను.ఎందుకు స్వాగతించను’ అని స్పందించారు. కాగా డాక్టర్ స్వామినాథన్ ఫార్ములా ఆధారంగా రైతులకు ‘కనీస మద్దతు ధర’ కల్పించడంలో ప్రధాని మోడీ ప్రభుత్వం మౌనం వహిస్తోందని జైరాం రమేశ్ విమర్శించారు. ప్రధాని మొండి వైఖరి వల్ల ఉద్యమ సమయంలో 700 మంది రైతులు అమరులయ్యారని, కేంద్రప్రభుత్వం వ్యవసాయదారులకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఇప్పుడుకూడా అన్నదాతలు ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరినా ప్రభుత్వం పట్టించుకోలేదని ‘ ఎక్స్’ వేదికగా జైరాం రమేశ్ విమర్శించారు. పివి నరసింహారావు, చరణ్ సింగ్, స్వామినాథన్‌లకు భారత రత్న ఇవ్వడాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాను స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో ఉంచిన ఓ పోస్టులో పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో పివి నరసింహారావు అద్భుతమైన సేవలందించారని, ఆయన ప్రభుత్వంలో భారత్ పలు ఆర్థిక సంస్కరణలతో ఒక సమూలమైన మార్పుతో కూడిన ప్రయాణాన్ని సాగించిందని, ఆ సంస్కరణలు రాబోయే తరాల మధ్య తరగతిని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాయని ఖర్గే అన్నారు. ప్రధాని చరణ్ సింగ్, డాక్టర్ స్వామినాథన్‌లు అన్నదాతలు, వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం ఎనలేని సేవలందించారని కూడా ఖర్గే అన్నారు.
నా తండ్రి సేవలకు గుర్తింపు: సౌమ్య
స్వామినాథన్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం పట్ల ఆయన కుమార్తె డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ హర్షం వ్యక్తం చేశారు. తనకు లభించిన ఈ గౌరవానికి తన తండ్రి జీవించి ఉంటూ సంతోషించే వారని ఆమె అంటూ, అయితే ఆయన ఎప్పుడూ ఆవార్డుల కోసం పని చేయలేదన్నారు. తన తండ్రి చేసిన కృషిని అత్యున్తత పౌర పురస్కారంతో గుర్తించినందుకు తాను ఎంతో గర్వించడంతో పాటుగా సంతోషిస్తున్నానని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అయిన సౌమ్యా స్వామినాథన్ అన్నారు. అయితే ఆయన పట్ల రైతులు చూసిన ప్రేమాభిమానాలే ఎక్కువ ఇష్టమనన్నారు.

Charan Singh

Swaminathan

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News