Thursday, January 23, 2025

మాది ‘బహుజన’ టీమ్

- Advertisement -
- Advertisement -
బిజెపి, కాంగ్రెస్ ఎంత బద్నాం చేసినా బిఆర్‌ఎస్‌ను విస్తరించి తీరుతాం
రెండో రోజూ కెసిఆర్‌కు బ్రహ్మరథం

మనతెలంగాణ/హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి దేశంలోని రైతులందరికీ ప్రతినిధి అని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. బిఆర్‌ఎస్ ఏ పార్టీకి ఎ టీమ్, బి టీమ్ కాదని.. పేద, దళిత, బిసి, రైతుల టీమ్ అని స్పష్టం చేశారు. భారత్ పరివర్తన కోసం పుట్టిన పార్టీ బిఆర్‌ఎస్ అని అన్నారు. బిఆర్‌ఎస్ భారతదేశ గతిని మార్చే, భారతదేశంలో పరివర్తన తె చ్చే ఒక మిషన్ అని, ఇది జాతీయస్థాయిలో పనిచేసే పార్టీ అని పేర్కొన్నారు. దేశాన్ని తప్పకుండా మారుస్తామని వ్యాఖ్యానించారు.

బిఆర్‌ఎస్ తెలంగాణకో, మహారాష్ట్రకో పరిమితం కాదని అన్నారు. ఎన్నికలలో పార్టీ లు గెలవడం కాదు, ప్రజలు గెలవాలని అన్నారు. దేశం లో రైతు ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. ఈ దే శంలో ఎన్నో రాజకీయ పార్టీలో ఎన్నో రకాల నినాదాలిచ్చాయని, కానీ మొట్టమొదటి సారి ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ అని నినదించిన ఏకైక పార్టీ బిఆర్‌ఎస్ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు. ఇంతకుముందు ఏ పార్టీ కూడా ఈ నినాదమివ్వలేదని తెలిపారు. 60 శాతానికిపైగా ఉన్న రైతులు, కార్మికులు తమ మద్దతును బిఆర్‌ఎస్ పార్టీకి ప్రకటిస్తుండటం కాంగ్రెస్, బిజెపి పా ర్టీలకు భయాన్ని కలిగిస్తున్నదని, దీంతో అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వింత వింత ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. మహారా ష్ట్ర పర్యటనలో రెండో రోజైన మంగళవారం సిఎం కెసిఆర్ పండరిపూర్‌లోని విఠలేశ్వర స్వామి, రుక్మిణీదేవీని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం సర్కోలిలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో మాజీ ఎంఎల్‌ఎ, దివంగత భరత్ బా ల్కే కుమారుడు స్థానిక ఎన్‌సిపి నేత భగీరథ బాల్కే తన అనుచరులతో కలిసి బిఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు సిఎం కెసిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సర్కోలిలో జరిగిన బహిరంగ సభలో సిఎం కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడారు. తెలంగాణ మాదిరిగా దేశంలోని ఇతర ప్రాంతా ల్లో ఎందుకు అభివృద్ధి సాధ్యం కాలేదని ప్రశ్నించారు. తెలంగాణలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యం అయినప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కాదని అన్నారు. వనరులు పుష్కలం గా ఉన్నప్పటికీ మహారాష్ట్ర ఇలా ఉండాల్సింది కాదని, మరిం త అభివృద్ధి చెందాల్సి ఉండాలని అభిప్రాయపడ్డారు. దశాబ్దాల పాటు మహారాష్ట్రను పాలించిన కాంగ్రెస్, బిజెపి పార్టీలపై కెసిఆర్ విరుచుకుపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయాయని, అభివృద్ధి ఎలా ఉందో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. అభివృద్ధి విషయంలో పొరుగు దేశం చైనా ఎక్కడున్నది…? భారత్ ఎక్కడున్నదో చూడాలని పేర్కొన్నారు.
నేతలు దివాళా.. రైతులకు దివాళి
తెలంగాణ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే దివాళా తీస్తామని కొందరు అంటున్నారని.. కానీ, దివాళా తీసేది నేతలు, దివాళి పండుగ చేసుకొనేది రైతులని సిఎం కెసిఆర్ అన్నారు. రైతు సంక్షేమ పథకాలు అమలైతే దేశంలోని రైతులంతా బిఆర్‌ఎస్ వెంట నడుస్తారని బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు భయం పట్టుకున్నదని ఎద్దేవా చేశారు. అందుకే బిఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.భారతదేశంలో 41 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉందని, దేశంలో 1 లక్ష 40 వేల టిఎంసిల వర్షపాతం సంభవిస్తుందని వివరించారు. దీంట్లో సగం నీరు భాష్పీకరణ ప్రక్రియ ద్వారా ఆవిరిగా మారుతుండగా, మిగిలిన 70 నుంచి -75 వేల టిఎంసిల స్వచ్ఛమైన నీరు నదుల్లో ప్రవహిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు దమ్ముంటే, వారు సరైన విధానాలు అమలు చేస్తే ప్రతీ ఎకరానికి సరిపడా సాగునీటిని అందించవచ్చని తెలిపారు. దేశంలో అందుబాటులో ఉన్న 70 వేల టిఎంసిల నీటిలో … మనం ఎన్ని టింఎంసిలు వాడుకొంటున్నామని అడిగారు. దేశంలో ఇంత నీరుండగా ఎందుకు వాడుకోలేకపోతున్నామని ప్రశ్నించారు. వ్యవసాయ యోగ్యమైన భూమిలో ఎంత మేర మనం సాగు చేయగలుగుతున్నామని అడిగారు. ప్రభుత్వంలో సత్తా ఉంటే ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చని పేర్కొన్నారు. బిజెపికి దమ్ము ఉంటే దేశంలోని ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని సవాల్ విసిరారు. భారత జల్ నీతిని మార్చాలని, నీల్లుండగా మోసపోకూడదని పిలుపునిచ్చారు. విద్యుత్తు ఉత్పత్తి 5 రకాలుగా జరుగుతుందని, ధర్మల్ విద్యుత్తు మాత్రమే సరియైన విధానమని పేర్కొన్నారు. దేశంలో 150 ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఎందుకు వాటిని సరిగా ఉపయోగించుకోకూడదని ప్రశ్నించారు. మనం ఐక్యం కానంత వరకు మన సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కిసాన్ సర్కార్ ఏర్పాటు చేసి, రైతులకు 24 గంటల నిరంతన ఉచిత విద్యుత్తును అందిస్తామని హామీ ఇచ్చారు.
రైతులకు అండ..
తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉం టుందని, ప్రతి సంవత్సరం ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని కెసిఆర్ తెలిపారు. దేశంలో పండుతున్న ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం రైతులు ఆందోళన బాట ఎందుకు పట్టాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. పనిచేయని ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.
ఈయన పేరు భగీరథ.. ఈ ప్రాంతానికి నీళ్లు తెస్తడు
భగీరథ బాల్కే.. ఈయన పేరులోనే భగీరథుడి పేరు ఉన్నదని, ఈ ప్రాంతానికి నీళ్లు తెస్తాడని సిఎం కెసిఆర్ తెలిపారు.భగీరథ్ బాల్కే రానున్న రోజుల్లో చంద్రబాగ్ నీటిని మంగళ్ వాడ్‌కు తరలించనున్నారని చెప్పారు. భగీరథ బాల్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ప్రకటించారు. మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలయ్యే ప్రతి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు, దళితబంధు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి తదితర పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు.
నా కళ్ళ ముందే ఎన్నో దేశాలు గొప్పగా పురోగమించాయి
తాను ఈ సభలో ప్రస్తావించే విషయాలను మీరు మీ మీ గ్రామాలకు వెళ్ళాక మిత్రులతో, బంధువులతో చర్చించాలని సిఎం కెసిఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన దేశానికి ఏదైనా లక్ష్యముందా లేక లక్ష్యం లేకుండా మనం దారి తప్పిపోయామా..?, దారి మరిచి చీకట్లో మగ్గుతున్నామా..? అని ప్రశ్నించారు. ప్రతి భారతీయునికి ఈ విషయంపై ఆలోచించాల్సిన అనివార్య సమయమిదని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంద రో త్యాగాలతో నేడు మనం స్వాతంత్య్ర ఫలాలను అనుభవిస్తున్నామని, కానీ నేడు మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని మనం చేపట్టాల్సి ఉన్నదని పిలుపునిచ్చారు. నూతనోత్సాహంతో విప్లవ మార్గంలో ఒక కొత్త ఉషోదయం కోసం భారతదేశం ముందుకు సాగాలని ఆకాంక్షించారు.మనకు స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు అయిందని, ఇది తక్కువ సమయమేమీ కాదని పేర్కొన్నారు. మన కళ్ళ ముందే ఎన్నో దేశాలు గొప్పగా పురోగమించాయని తెలిపారు. సౌత్ కొరియా, జపాన్, సింగపూర్, మలేషియా, భౌగోళికంగా హిమాలయాలకు ఆవల మన సరిహద్దు దేశమైనా చైనా దేశం ఉందని, 1982 వరకు చైనా దేశం మన దేశం కంటే బీద దేశంగా ఉండేదని వివరించారు. నేడు చైనా దేశం ఎక్కడుంది.. .మనం ఎక్కడున్నామని, ఈ విషయం పై ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News