Wednesday, January 22, 2025

దృఢ సంకల్పంతో మారిన గ్రామాల రూపురేఖలు

- Advertisement -
- Advertisement -

రఘునాథపాలెం : అన్ని ప్రాంతాలు సమానంగా ప్రగతి సాధించాలనే ఉద్దేశంతోనే గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో గ్రామాల స్వరూపమే మార్చేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని గురువారం పల్లె ప్రగతి దినోత్సవంలో భాగంగా జిల్లాలో రఘునాధపాలెం మండలంలోని నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సూర్య తండా, పుటాని తండా, కొర్లబొడు తండా, బధ్యా తండా, జింకలతండా, హర్య తండా గ్రామాల్లో మంజూరైన గ్రామ పంచాయతీ భవనాలు ఒక్కో భవనం రూ. 20 లక్షల మొత్తంతో నిర్మించనున్న ఆయా నిర్మాణ పనులకు గురువారం మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కేవలం ఎనిమిదేండ్లలోనే ఎంతో పురోగతి సాధించామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతోపాటు కాల్వలకు మరమ్మతులు, చెరువుల పూడికలు చేయడంతో గ్రామాల్లో పుష్కలంగా త్రాగు, సాగు నీరందుతుందని, వలసలు వెళ్లిన వారు స్వగ్రామాలకు వచ్చి పని చేసుకుంటున్నారన్నారు.

గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. రఘునాథపాలెం మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా, మండలంలోని 20 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నట్లు, ఇప్పుడు మొత్తం 37 గ్రామ పంచాయతీలు ఉన్నట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తాండాలను గ్రామ పంచాయితీలు మార్చి, గిరిజనుల తండాలకు గిరిజనులనే పాలకులుగా చేసిందన్నారు. తాండాలు, గూడెంలలో అవసరమైన మౌలిక సదుపాయాలు విద్యుత్తు, రోడ్లు, పాఠశాలలు, డ్రైనేజీలు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు తదితర అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. తెలంగాణలో మాదిరిగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ విధానం ఎక్కడా లేదన్నారు.

లో-ఓల్టేజీ సమస్యలు అధిగమించేందుకు రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ మాట్లాడుతూ, మండలంలో 20 గ్రామ పంచాయతీలకు భవనాలు మంజూరు కాగా, గురువారం 7 గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేసుకున్నట్లు, మిగతా వాటికి ఈ నెల 17న చేపట్టే గిరిజనోత్సవం నాడు శంకుస్థాపనలు చేయనున్నట్లు ఆయన అన్నారు. ఈ రోజు మారుమూల తాండాల్లో రోడ్లు అద్దాల్లా మెరుస్తున్నాయని, అన్ని చోట్ల అంతర్గత సిసి రోడ్లు నిర్మించుకున్నామని ఆయన తెలిపారు.

పొలాలకు మట్టి రోడ్లతో దారులు నిర్మించుకున్నట్లు ఆయన అన్నారు. తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ భవనాలు నిర్మించుకొని ప్రారంభించుకున్నట్లు, అన్ని కార్యాలయాలు మండలంలోని ఉన్నట్లు ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్యాoకర్, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, పట్టణంలో ఉన్న అన్ని సౌకర్యాలు గ్రామాలలో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల సర్పంచ్, ప్రజాప్రతినిధులను సన్మానించారు. గ్రామాల పారిశుధ్యంలో కీలక భూమిక పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఉత్తమ సేవా సర్టిఫికేట్ తోపాటు శాలువా కప్పి సత్కరించారు.

అనంతరం దుస్తులు అందజేసి సఫాయి అన్న నీకు సలాం అన్న అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఐటిడిఎ పీవో గౌతమ్ పోట్రూ, డిఆర్‌డిఒ విద్యా చందన, డిపిఒ అప్పారావు, పిఆర్ ఇఇ కెవికె. శ్రీనివాస్, డిసిఓ విజయ కుమారి, ఐటిడిఎ ఇఇ తానాజీ, డిఇ రాజు, ఎంపిడిఓ రామకృష్ణ, తహసీల్దార్ నర్సింహారావు, ఎంపిపి గౌరీ, జెడ్పిటిసి ప్రియాంక, సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులతోపాటు బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వీరూనాయక్, సూర్య తండా పుటాని తండా, కొర్లబోడు తండా, బాధ్యతండ జింకల తండా పంచాయతీలలో నూతన పంచాయతీల కార్యాలయాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపిటిసిలు, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News