Wednesday, November 6, 2024

ఖలిస్తానీలపై కెనడాలో వెల్లువెత్తిన ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

వీధుల్లో హిందువులు, సిక్కుల ప్రదర్శన
రోడ్లపై నినాదాలతో నిరసన
బ్రామ్టన్ ఆలయంలో హిందు భక్తులపై ఖలిస్తానీల దాడికి ఆక్షేపణ

ఒట్టావా : గత వారాంతంలో కెనడా బ్రామ్టన్‌లోని హిందు సభ ఆలయంలో హిందు భక్తులపై ఖలిస్తానీ మూకల దౌర్జన్యపూరిత దాడి పర్యవసానంగా వేలాది మంది భారత సంతతి ప్రజలు సోమవారం వీధుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అరుదైన బల ప్రదర్శనగా చట్టబద్ధ సమాజ సభ్యులు దౌర్జన్యకాండ పట్ల ఆగ్రహంతో సమీకృతమై నిరసన వ్యక్తం చేశారు. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కెనడాలో అక్కున చేర్చుకున్న కొద్ది మంది ఖలిస్తానీలకు వ్యతిరేకంగా హిందువులు, సిక్కుల మధ్య ఐకమత్యానికి కూడా ఇది నిదర్శనం. కొంత మంది నిరసనకారులు ఒక బృందంగా రోడ్డుపై రాకపోకలను అడ్డుకోగా ఇతరులు ఖలిస్తానీల దాడిని గర్హించారు. కెనడాలో రాజకీయ పార్టీలకు తమ మద్దతుపై పునరాలోచన చేయవలసిందిగా హిందు సమాజానికి వారు విజ్ఞప్తి చేశారు. ఖలిస్తానీలు దాడి చేసిన మరునాడు సోమవారం బ్రామ్టన్‌లో హిందు సభ ఆలయం వెలుపల సంఘీభావంగా వేలాది మంది భారతీయ, కెనడియన్లు పాదయాత్ర జరిపారు కూడా.

ఖలిస్తానీల అవాంఛిత దౌర్జన్యకాండ నేపథ్యంలో ఐకమత్యాన్ని ప్రదర్శించడం లక్షంగా ఉత్తర అమెరికా హిందువుల సమ్మేళనం(సిఒహెచ్‌ఎన్‌ఎ) ఆ పాదయాత్రను నిర్వహించింది. ‘హిందు సమాజం చైతన్యానికి ఇది ప్రతీక. వారు ఎన్నడూ వేల సంఖ్యలో ఈ విధంగా నిరసన వ్యక్తం చేయలేదు. ఖలిస్తానీలు గీత దాటారు. సమీకతృతమై సంఘటితంగా కదలవలసిన ఆవశ్యకతను హిందువులు గుర్తించారు’ అని కెనడియన్ జర్నలిస్ట్ డేనియల్ బోర్డ్‌మన్ ‘ఇండియా టుడే టివి’తో చెప్పారు. ఖలిస్తానీలకు వ్యతిరేకంగా అన్ని సమాజాలు ఈ విధంగా సంఘటితం కావడాన్ని బోర్డ్‌మన్ ధ్రువీకరించారు.

‘నేను హిందు సభ మందిర్‌లో ఉన్నాను. తమ ఆలయంపై ఖలిస్తానీ దాడి, పీల్ పోలీస్ వైఫల్యం తరువాత హిందు సమాజానికి మద్దతు తెలిపేందుకు సిక్కులు, యూడులు, క్రైస్తవులు, ఇరానియన్లతో పాటు వేలాది మంది హిందువులు సంఘటితంగా ప్రదర్శన నిర్వహించారు’ అని బోర్డ్‌మన్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. ఆలయంపై దాడిలో సరిగ్గా వ్యవహరించనందుకు, హిందు సమాజాన్ని కాపాడడంలో విఫలమైనందుకు పీల్ పోలీసులను విమర్శిస్తూ హిందువులు, సిక్కులు నినాడాలు కూడా చేశారు. ఆలయం ప్రాంగణంలో హిందువులపై దాడి చేసింది సిక్కులు కారని, కొద్ది మంది ఖలిస్తానీలని కూడా నిరసనకారులు స్పష్టంచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News