Monday, December 30, 2024

అమ్మకానికి ఔట్‌సోర్సింగ్

- Advertisement -
- Advertisement -

వాణిజ్యశాఖకు సంబంధించి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను కొందరు అధికారులు విక్రయానికి పెట్టుకున్నారు. వాణిజ్యశాఖలో డిప్యూటీ కమిషనర్‌గా (ఎస్టాబ్లిష్‌మెంట్)లో పనిచేసే ఓ అధికారి ప్రస్తుతం ఉన్న ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీని మార్చి కొత్త ఏజెన్సీకి అవకాశం ఇచ్చి వారి ద్వారా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను అ మ్ముకోవాలని ప్రణాళిక రూపొందించారు. ఇప్పటి కే ఏజెన్సీ మార్పునకు సంబంధించి ఫైల్ ఉన్నతాధికారుల వద్దకు చేరిందని అక్కడ సంతకం కా గానే కొత్తవారిని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఈ దందాకు ఓ అదనపు కమిషనర్ (ఎస్టాబ్లిష్‌మెంట్) కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ శాఖలో కొన్నేళ్లు గా ప నిచేస్తున్న 30 మంది డిఈఓలు, 39 మంది డ్రైవర్ లు ఔట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత ఉద్యోగులను తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఈ శాఖ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది.

అందులో భాగంగానే ఒక డిఈఓ పోస్టు కోసం రూ.3 నుంచి రూ.4 ల క్షలు, డ్రైవర్ పోస్టు కోసం రూ.2లక్షలకు బేరం పెట్టినట్టుగా ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న 30 మంది డిఈఓలను, 39 మంది డ్రైవర్‌లను తీసివేస్తామని డిప్యూటీ కమిషన ర్ మౌఖికంగా వారితో పేర్కొన్నారని తెలిసింది. దీంతో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఈ ఉద్యోగులంతా తమను తొలగించవద్దని ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి తమ బాధను తెలియచేయాలని వారు నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ఈ నెలరోజుల్లో ఇద్దరు, ముగ్గురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడంతో ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న వారు భయాందోళనకు గురవుతున్నారు.

ఓ జేసి స్థాయి అధికారికి రూ.16 కోట్ల ముడుపులు
ప్రస్తుతం కమర్షియల్ ట్యాక్స్‌లో పనిచేసే ఒక జేసి (జాయింట్ కమిషనర్) స్థాయి అధికారి తన డివిజన్‌లో కిందిస్థాయి సిబ్బందితో కలిసి స్క్రాప్ దందా చేసే వ్యాపారి నుంచి రూ.16 కోట్ల ముడుపులను వసూలు చేసి వాటాలుగా పంచుకున్నట్టుగా వినికిడి. ఆ వ్యాపారికి రూ.100 నుంచి రూ.200 కోట్ల వరకు ఈ అధికారి మేలు చేశారని అందులో భాగంగా ఆ వ్యాపారి కూడా జేసి అడిగిన విధంగా ముడుపులు సమర్పించుకున్న ట్టుగా తెలిసింది. దీంతోపాటు మరో డివిజన్‌లో పనిచేసే మరో జేసి, సిటిఓ కలిసి మరో కేసులో కోటి 60 లక్షలను ఇవ్వాలని ఒక వ్యాపారిపై ఒత్తిడి తీసుకొచ్చారని దీంతో ఆ వ్యాపారి ఆడిట్‌కు సంబంధించి కోర్టును ఆశ్రయించారని తెలిసింది.

ప్రభుత్వానికి రావాల్సిన రూ.200 కోట్లు మాయం..!
5 నెలల క్రితం మరో డివిజన్ పరిధిలో ఓ స్క్రాప్ లారీని సీజ్ చేసినప్పుడు అదే లారీ నెంబర్ పేరుతో వందలసార్లు ఓ కంపెనీ స్క్రాప్ బిజినెస్ చేసిందని గుర్తించిన ఆ డివిజన్ అధికారులు దీనివల్ల ప్రభుత్వానికి రూ.200 కోట్ల నష్టం జరిగిందని అప్పటి ఉన్నతాధికారి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ఆ వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని నిర్ణయించారు. అంతలోనే దళారులు రంగంలోకి ఆ ఉన్నతాధికారికి, జేసి, సిటిఓ స్థాయి అధికారులకు సుమారుగా రూ.30 నుంచి రూ.40 కోట్ల ముడుపులను ముట్టచెప్పడంతో ప్రభుత్వానికి రావాల్సిన రూ.200 కోట్ల గురించి గప్‌చుప్ అయ్యారని, ప్రస్తుతం దానికి సంబంధించిన ఫైలు కూడా మాయం చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

రీఫండ్ కేసుతో సంబంధం ఉన్న ఉద్యోగులు మళ్లీ విధుల్లోకి…..
7 నెలల క్రితం బయటపడిన జీఎస్టీ రీఫండ్ కేసుకు సంబంధించి సిసిడబ్లూలో (సెంటర్ ఫర్ కంప్యూటరైజ్డ్)లో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఆ శాఖ ఉన్నతాధికారులు తొలగించారు. సిసిడబ్లూలో పనిచేసే కొందరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చిందని గుర్తించిన ఆ శాఖ ఉన్నతాధికారులు వారిని అప్పట్లో తొలగించింది. తిరిగి మళ్లీ నెల క్రితం ఆరుగురిని ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఈ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వద్ద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాపారులకు సంబంధించి లాగిన్‌లు, పాస్‌వర్డ్‌లు ఉంటాయి. ప్రస్తుతం కొందరు అధికారులు మళ్లీ వారిని ఈ వింగ్‌లోకి తీసుకోవడంపై ఆ శాఖ ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీరివల్ల ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో నష్టం వచ్చిందని అయినా మళ్లీ వారిని విధుల్లోకి తీసుకోవడం ఏమీటని ఆ శాఖ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

అంతకంతకు తగ్గుతున్న ఆదాయం
ఈ ఆర్థిక సంవత్సరం ప్రస్తుతం వాణిజ్యపన్నుల శాఖ అనుకున్న ఆదాయాన్ని రాబట్టడంలో వెనుకంజ వేసినట్టుగా ఆ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు సుమారుగా రూ.40 వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినట్టుగా అధికారిక వర్గాల సమాచారం. గత ఆర్థిక సంవత్సరం రూ.82 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆశించగా రూ.70 వేల కోట్ల పైచిలుకు ఆదాయాన్ని ఆర్జించిన ఈ శాఖ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూ.60 నుంచి రూ.70 వేల కోట్ల లోపే ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ శాఖలో కొందరు అధికారుల అవినీతి తారాస్థాయికి చేరుకోవడం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతుందని పలువురు ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంతకంతకు ఆదాయం తగ్గుతుందని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొనడం విశేషం. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు అందినకాడికి దోచుకుంటే ప్రభుత్వానికి ఎలా ఆదాయం వస్తుందని ఆ శాఖ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ శాఖ ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వం అంచనాలు పెంచుకోగా ఈ శాఖ ఆదాయం అంతంతమాత్రంగా వస్తుండడంపై ప్రభుత్వం ఆశ్యర్యం వ్యక్తం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News