సగటున రోజుకు 1200మంది మృతి
చిన్నారులపైనా ప్రభావం
వాషింగ్టన్: ప్రపంచంపై కరోనా మళ్లీ విరుచుకుపడుతోంది. రోజుకు మిలియన్ల కొద్దీ కొత్త కేసులు వచ్చిపడుతున్నాయి. వేలాది మంది మృత్యుకోరల్లో చిక్కుకుంటున్నారు. అమెరికాలో ఒక్కరోజులోనే పది లక్షల (10,42,000) మంది మహమ్మారి బారిన పడ్డారు. రోజుకు సగటున అక్కడ 1200మంది మరణాన్ని ఆశ్రయిస్తున్నారు. అగ్రదేశంలో ఎక్కడ చూసినా అస్పత్రులు కరోనా రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఒక్కరోజే 4700విమానాలను ప్రభుత్వం రద్దు చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లెక్కలేని తనంతో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడమే అమెరికాలో తాజా దారుణ పరిస్థితికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు భారత్‌లోనూ కరోనా ప్రతాపం చూపెడుతోంది. వారం రోజులుగా కేసుల సంఖ్య పైపైకే పోతోంది. మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలలో రోజుకు వేలాది కేసులు నమోదవుతున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లోనూ తీవ్రత పెరుగుతుండడంతో ఆంక్షల బాటపడుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం వారాంతాల్లో కర్ఫూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళవారంనాడు ఢిల్లీలో 5వేలకుపైగా కొత్తగా మహమ్మారి బారినపడ్డారు. ముగ్గరు మరణించారు. ముంబయిలో నిన్న ఒక్కరోజే 10,860 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 20మంది మృత్యువాతపడ్డారు. 20వేల కేసులు దాటితే ముంబయిలో లాక్‌డౌన్ తప్పదని మేయర్ హెచ్చరించారు.. కొవిడ్ సునామీలా విరుచుకుపడ్డా ఎదుర్కొనేందుకు సిద్ధం అయినట్లు ఆమె చెప్పారు. భారత్‌లో కరోనా థర్డ్‌వేవ్ మొదలైనట్టేనని కొవిడ్ టీకా పంపిణీ జాతీయ సలహా కమిటీ చీఫ్ డాక్టర్ ఎన్‌కె అరోరా అభిప్రాయపడ్డారు. మెట్రో నగరాల్లో వెలుగుచూస్తున్న కేసులో 75శాతం ఒమిక్రాన్ వ్యాప్తి మూలంగానే వచ్చిపడుతున్నవేనన్నారు. మరోవైపు మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందంగా ప్రపంచదేశాలు ఒకపక్క కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో బెంబేలెత్తిపోతుంటే ఫ్రాన్స్ ప్రపంచానికి మరో భయంకరమైన వాస్తవాన్ని చెప్పింది. తమదేశంలో ఒమిక్రాన్ కన్నా ప్రమాదకరమైన కొత్త వేరియంట్ వెలుగుచూసిందని, దానిపేరు ‘ఐహెచ్‌యు’గా నామకరణం చేసినట్లు ప్రకటించింది.
కాగా, అమెరికాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి 7.30వరకు 24 గంటల్లోనే 10,42,000 కేసులు నమోదయ్యాయని అక్కడి వార్తా సంస్థ యుఎస్‌ఎ టుడే తెలిపింది. గత గురువారం రికార్డుస్థాయిలో 5,91,000 కేసులు నమోదు కాగా, ఇప్పుడు అంతకు రెట్టింపు సంఖ్యకు చేరడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా ప్రకారం గత వారంలో ప్రతి 100మంది అమెరికన్లలో ఒకరు కరోనా బారిన పడ్డారు. జనవరి 3వరకు వారం రోజుల్లో నమోదైన కేసులు అంతకుముందు వారంకన్నా 32 శాతం అధికం. ఇదే వారంలో రోజుకు సగటున 1200మంది కొవిడ్ వల్ల చనిపోయారు. 1,52,000 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇది గత వారం కన్నా 46.5 శాతం అధికం. 19,000మంది ఐసియు పడకలపై చికిత్స పొందుతున్నారు. ఇది గత వారంకన్నా 8.6 శాతం అధికం. 2021 జనవరిలోనూ 1,42,000 మంది ఆస్పత్రి పాలయ్యారు. అదే పరిస్థితి మళ్లీ తలెత్తడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
అమెరికాలో ఈసారి కరోనా చిన్నారులపైనా ప్రభావం చూపుతోంది. రోజుకు సగటున 500కుపైగా చిన్నారులు వైరస్ వల్ల ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అమెరికాలో 12 ఏళ్లు పైబడిన చిన్నారులకు ఇప్పటికే టీకాలిస్తున్నారు. 1215 ఏళ్లవారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సోమవారం అనుమతి ఇచ్చింది. రెండో డోస్ తీసుకున్న 5 నెలల తర్వాత బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. మొత్తమ్మీద తమ దేశంలో 20.58 కోట్లమందికి(62 శాతం) పూర్తి డోసుల వ్యాక్సినేషన్ ఇచ్చామని సిడిసి తెలిపింది. ఇప్పటివరకు అమెరికాలో 5,61,89,547 మంది కరోనా బారిన పడగా, వారిలో 8,27,748మంది మరణించారు.
న్యూయార్క్‌లో పాఠశాలల కొనసాగింపు
వైరస్‌తో సహజీవనం తప్పదంటున్న నగరవాసులు
చిన్నారులను పాఠశాలలకు పంపించే విషయంలో అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని విద్యా సంస్థలు ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించగా, మరికొన్ని ఇంకా పాఠశాలల్ని కొనసాగిస్తున్నాయి. వైరస్‌తో ఇక కలిసి జీవించాల్సిందే అన్న అభిప్రాయం అక్కడి తల్లిదండ్రుల్లోనూ వ్యక్తం కావడం గమనార్హం. ఒమిక్రాన్ ఉధృతిని లెక్కచేయకుండా న్యూయార్క్, మిల్‌వావ్‌కీ, డెట్రాయిట్ నగరాల్లో పాఠశాలల్ని కొనసాగిస్తున్నారు. అమెరికాలో అతిపెద్ద పాఠశాల వ్యవస్థ ఉన్నది న్యూయార్క్ నగరంలోనే. ఈ నగరంలో దాదాపు 10 లక్షలమంది పాఠశాలల్లో చదివే విద్యార్థులున్నారు. పాఠశాలల్లోనూ ర్యాండమ్ టెస్ట్‌లు నిర్వహిస్తూ, కట్టడి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ మా పిల్లల్ని విద్యావంతుల్ని చేయడానికే పాఠశాలలు తెరిచామన్నారు. తనకు 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. తను పాఠశాలలో ఉన్నా, ఇంట్లో ఉన్నా కరోనా అంటుకోకుండా ఉండదు అని త్రిషావైట్ అనే న్యూయార్క్ మహిళ అన్నారు. పాఠశాల వ్యవస్థను అవమానించదలచుకోలేదని ఆమె అన్నారు. న్యూయార్క్‌లో గత వారం రోజువారీ సగటు కేసులు 17,000 కాగా, ఇప్పుడవి 37,000కు చేరాయి.
వేలాది విమానాల రద్దు
పలువురు సిబ్బంది కరోనా బారిన పడటంతో.. ఒమిక్రాన్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకలపైనా పడింది. సోమవారం రాత్రి అమెరికాలో 3000కుపైగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4700 విమానాలు రద్దయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆలస్యంగా నడిచే విమానాల సంఖ్య12,500 కాగా, అమెరికాలో 5600. షెడ్యూల్ ప్రకారం అమెరికాలో మంగళవారం బయలుదేరాల్సిన దాదాపు 400 విమానాలను ఎయిర్‌లైన్స్ సంస్థ నిలిపివేసింది. వారాంతంలో అమెరికాలో 5400, ప్రపంచంలో 9000 విమానాలు రద్దయ్యాయని ఫ్లైట్ అవేర్ తెలిపింది. పలువురు సిబ్బంది ఒమిక్రాన్ బారిన పడటమే అందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. క్రిస్మస్ నుంచి చూస్తే అమెరికాలో 18,000 విమానాలు రద్దయ్యాయి. వీటిలో చాలావరకు బయలుదేరడానికి కొన్ని గంటలముందు లేదా ఓ రోజుముందు రద్దయ్యాయి. సోమవారం అమెరికాలోని రోనాల్డ్ రీగన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరాల్సినవాటిలో దాదాపు 75 శాతం, బాల్టిమోర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి 50 శాతం విమానాలు రద్దయ్యాయి. ఈ రెండు విమానాశ్రయాల్లోనూ ఆరు అంగుళాలకుపైగా మంచు పేరుకుపోయిందని అధికారులు తెలిపారు.