Friday, November 22, 2024

బంగ్లాదేశ్ హింసాకాండలో 100 మందికి పైగా మృతి

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌లో షేఖ్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి సోమవారం దేశం నుంచి పారిపోయిన తరువాత సంక్షుభిత పరిస్థితులు నెలకొనగా దేశవ్యాప్తంగా హింసాకాండలో వంద మందికి పైగా మరణించినట్లు మంగళవారం మీడియా వార్తలు తెలిపాయి. మరొక పక్క ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒక రోజు అంతా అశాంతి, ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరువాత మంగళవారం ఉదయం ఢాకాలో పరిస్థితి మొత్తం మీద ప్రశాంతంగా ఉంది. వీధుల్లో బస్సులు, ఇతర ప్రజా రవాణా వాహనాలు తిరుగుతున్నాయి. వర్తకులు దుకాణాలు తెరిచారు. ప్రభుత్వ వాహనాలు ఆఫీసులకు వెళుతున్నాయి. బ్యాటరీతో నడిచే పలురిక్షాలు రోడ్లపై తిరిగాయని బిడిన్యూస్24.కామ్ వార్తాపోర్టల్ తెలిపింది. హసీనా దేశం వదలి వెళ్లారన్న వార్త సోమవారం వ్యాపించగానే వందలాది మంది ప్రజలు ఆమె నివాసంలోకి చొరబడి, విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఏ మేరకు వ్యాపించాయో ఇది సూచించింది.

రాజధానిలో హసీనా నివాసం సుధా సదన్‌పైన, ఇతర సంస్థలపైన దాడి జరిగింది. వాటిని ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఢాకాలోను, నగరం వెలుపల మంత్రులు, పార్టీ ఎంపిలు. హసీనా అవామీలీగ్ ప్రభుత్వ నేతల నివాసాలు, వాణిజ్య సంస్థలపైన దాడులు జరిగాయి. స్థానిక మీడియా వార్తల ప్రకారం, రాజధానిలో, వివిధ ప్రదేశాల్లో హింసాకాండలో 119 మంది వ్యక్తులు మరణించారు. హిందు ఆలయాలపై దాడులు, విస్తృత స్థాయిలో లూటీలు జరిగాయి. సోమవారం వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం ఏక సూత్ర డిమాండ్ చివరి క్షణంలో ఢాకాతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంఘర్షణల్లో కనీసం 109 మంది మృతి చెందినట్లు బెంగాలీ భాష దినపత్రిక ‘ప్రథమ్ అలో’ మంగళవారం వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 98 మంది మరణించినట్లు అంతకుముందు ఆ పత్రిక తెలియజేసింది. ఆ రోజు అర్ధరాత్రి మరి 16 మంది మరణించినట్లు సమాచారం. ఆదివారం మృతుల సంఖ్య 114గా ఉన్నది.

‘దీనితో జూలై 16 నుంచి సోమవారం వరకు 21 రోజుల్లో మొత్తం మృతుల సంఖ్య 440గా ఉన్నది’ అని ఆ పత్రిక తెలిపింది. సోమవారం ఉదయం 11 గంటలు, రాత్రి 8 గంటల మధ్య 37 మృతదేహాలను ఢాకా వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకువచ్చారని పత్రిక తెలిపింది. ఆసుపత్రి వర్గాలను పత్రిక ఉటంకిస్తూ, తూటా గాయాలో సహా వివిధ గాయాలతో 500 మందిని ఆసుపత్రిక తీసుకువచ్చినట్లు తెలియజేసింది. సోమవారం పోలీసులు, దుండగుల మధ్య సంఘర్షణలు చోటు చేసుకున్న తరువాత రాజధాని శివార్లలోని సవర్, ధమ్రాయ్ ప్రాంతాల్లో కనీసం 18 మంది మృతి చెందినట్లు ఢాకా ట్రైబ్యూన్ దినపత్రిక వెల్లడించింది. సోమవారం రాజధానిలోని ఉత్తరలో సివిలియన్ దుస్తులు ధరించిన వ్యక్తులు నిరసనకారులపై కాల్పులు జరిపిన తరువాత పది మంది హతులయ్యారు. ఆ పత్రిక సమాచారం ప్రకారం, హబీగంజ్‌లో ఆరుగురు, జెస్సోర్‌లో ఎనిమిది మంది, ఖుల్నాలో ముగ్గురు, బరిసాల్‌లో ముగ్గురు, లక్ష్మీపూర్‌లో 11 మంది, కుష్టియాలో ఆరుగురు, సాత్ఖిరాలో ముగ్గురు, గాజీపూర్‌లోని శ్రీపూర్‌లో ఆరుగురు హతులయ్యారు.

దేశంలో తిరిగి ప్రశాంత పరిస్థితిని నెలకొల్పాలని అన్ని రాజకీయ పార్టీలను బంగ్లా అధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దీన్ సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత కోరారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సాయుధ బలగాలను ఆయన ఆదేశించారు. విద్యార్థి ఉద్యమంలో దౌర్జన్య సంఘటనల కారణంగా దీర్ఘ కాలం మూతపడిన అనంతరం దేశంలోని విద్యా సంస్థలు మంగళవారం తెరచుకున్నాయి. అయితే, దేశ రాజధానిలోని విద్యా సంస్థల్లో హాజరు శాతం తక్కువగా ఉందని ఢాకా ట్రైబ్యూన్ దినపత్రిక తెలియజేసింది. ‘విద్యా సంస్థ తెరచుకున్నది. కొందరు బాలికలు వచ్చారు. కానీ హాజరు శాతం స్వల్పంగా ఉంది. రెండు రోజుల్లో హాజరు శాతం పెరుగుతుంది’ అని రాజధానిలో మొహమ్మద్‌పూర్ ప్రాంతంలోని కిశోలోయ్ బాలికల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ మొహమ్మద్ రహమత్ ఉల్లాహ్ చెప్పినట్లు ఆ పత్రిక తెలిపింది. ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో కోటా విధానాన్ని ప్రకటించినప్పటి నుంచి క్రమంగా ఉద్రిక్తత పెరగసాగింది.

పోలీసులు, చాలా వరకు విద్యార్థి నిరసనకారులకు మధ్య దౌర్జన్యపూరిత ఘర్షణల్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన కొన్ని రోజుల తరువాత ఆదివారం బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో హసీనా రాజీనామా కోరుతున్న నిరసనకారులు, అధికార అవామీ లీగ్ మద్దతుదారుల మధ్య సంఘర్షణలు చోటు చేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News